డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక
నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం మూలాధారం. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడి పోయి రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు కొంత సహాయం లేదా వెసులుబాటు కల్పించే నిమిత్తం మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఇది గిట్టుబాటు ధర కాదు. రైతులు గిట్టుబాటు ధర కోరుతున్నా ఇచ్చేది లేదా ప్రకటించేది కనీస మద్దతు ధర మాత్రమే. కనీస మద్దతు ధర కనీసంగానే నిర్ణయిస్తుంది. దీనివల్ల రైతులకు లాభం చేకూరడం లేదు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు శ్రమ పడుతున్నారు. రైతు శ్రమను, రిస్క్‌ను ప్రభుత్వం, సమాజం గుర్తించాలి. వ్యవసాయం రైతుకు గిట్టుబాటు కావాలి.
అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు
అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నారు. దేశంలో అన్ని రకాలుగా వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులు అష్టకష్టాలు పడుతున్న వారిని అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాలు, చట్టాలు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో దండగ మారి పథకాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం వ్యవసాయాన్ని రైతు సంక్షేమాన్ని మరచి సంక్షోభానికి దారితీసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. రైతులు అప్పుల ఊబిలో చిక్కి బలవన్మరణాలకు పాల్పడ్డారు. లక్షలలో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని సతమతమవుతున్నారు. వ్యవసాయం దండగ అని భావించి పొలాలను బీడు పెట్టి కూలీ పనులకు, బేల్దార్ పనులకు వెళ్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సుదీర్ఘ పొడి స్పెల్‌లు, పంటలు దెబ్బ తినడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. 2023 జనవరి, నవంబరు మధ్య మొత్తం ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 87 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. గత నాలుగు సంవత్సరాలలో పదుల సంఖ్యలో మాత్రమే ఆత్మహత్యలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత నాలుగు సంవత్సరాల వ్యవధిలో 296 మంది రైతులు తమ జీవితాలను ముగించుకున్నారు. పత్తి, వేరుశనగ మెట్ట భూమి రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అత్యంత పొడి జిల్లా అనంతపురం 87 ఆత్మహత్యలతో అగ్రస్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యలు పత్తి, వేరుశనగ, వరి వంటి కొన్ని నిర్దిష్ట పంటలకు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు, అన్ని జిల్లాల్లో వ్యాపించి, అన్ని రకాల పంటలు పండించే రైతులు ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కారణం చేత ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు.
ప్రభుత్వాల ప్రగల్భాలు
రైతు సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, రైతులకు లక్షల కోట్ల హామీలు గుప్పించారు, వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం, రైతులు సంతోషంగా ఉండేట్లు చూస్తాము అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు . రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు చనిపోతే రూ. 7 లక్షలు అన్న ముఖ్యమంత్రి జగన్ రైతు బతికుండగా ఎందుకు పట్టించుకోరు? 2019 లో ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ప్రతికూల పరిస్థితి కొనసాగుతోంది, గత నాలుగు సంవత్సరాలుగా సూక్ష్మ బిందు సేద్యానికి, డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ షీట్ ఇతర ఉపకరణాలు నయాపైసా కేటాయించలేదు. రైతులకు రావాల్సిన ఇంటరెస్ట్ సబ్వెన్షన్, ప్రాంప్టు రీపేమెంట్ ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు. లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేశారు. దీనికి తోడు కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక పథకాలకు మద్దతు తెలుపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారు. భూమి లేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల రైతులకు రైతు బంధు, రైతు బీమా అమలు కావడం లేదు. పోడు రైతులను గుర్తించి వారికి రైతుబంధు రైతు భరోసా ఇవ్వగలిగి, బీమా పథకం వర్తింపజేస్తే రైతు ఆత్మహత్యలు మరింత తగ్గుతా. వ్యవసాయ కూలీలకు సమగ్ర సాంఘిక సంక్షేమ పథకం అమలు చేయాలి. ఈ కుటుంబాలకు కూడా బీమా పథకం అమలు చేయాలి. సాగునీటి ప్రాంతాల రైతులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు గ్రామీణ కార్మికులపై భారం అసమానంగా పడింది . గత దశాబ్దంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోని ఆర్థిక వ్యూహం రైతులకు కల్పించే రక్షణను క్రమపద్ధతిలో తగ్గించి, మార్కెట్ అస్థిరతకు, తగిన నియంత్రణ లేకుండా ప్రైవేట్ లాభదాయకతకు గురిచేసింది” అనే వాస్తవాన్ని కూడా రైతులు గమనించాలి.
పెరిగిన సాగు వ్యయం
సాగు వ్యయం భారీగా పెరిగింది. పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎరువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి గత ఏడాది కాలంలో డిఎపి ఎరువుల ధర రెండింతలు పెరిగింది. అంతేకాకుండా, గత ఐదేళ్లలో విత్తనాల ధరలు 100 శాతానికి పైగా పెరిగాయి. వర్షాధార ప్రాంతాలలో, రైతులు బోర్‌వెల్‌ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు, వీటిలో చాలా వరకు నీటి దిగుబడికి విఫలమవుతుంది. ఒక్కో బోర్‌వెల్ ఖరీదు దాదాపు రూ.లక్ష రూపాయలు ఖర్చు చేయాలి. అన్ని పంటల సాగు ఖర్చులు పెరగడం; నాన్-రిమ్యునరేటివ్ ధరలు ; నిలకడలేని పంట విధానాలు, ఉత్పత్తి పద్ధతులు; వర్షాధార ప్రాంతాల్లో పత్తి, ఇతర వాణిజ్య పంటల మోనో-క్రాపింగ్ ఆధారపడటం; సంస్థాగత రుణం వంటి రైతులకు మద్దతు వ్యవస్థలు లేకపోవడం; కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం, పంట విస్తీర్ణంలో 60 శాతానికి పైగా ఉన్న వర్షాధార పొలాలలో రుణం, బీమా పంట నష్టపరిహారం పొందేందుకు ఎలాంటి నిబంధన లేదు. వ్యవసాయ సంక్షోభానికి మూలకారణాలను పరిష్కరించడానికి బదులుగా, రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మరణాలను “వాస్తవమైనది”, “నిజం కానిది”గా వర్గీకరించడం ద్వారా వాస్తవ ఆత్మహత్యల సంఖ్యను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.
మూడేళ్ళలో నష్టబోయిన రైతును గుర్తించాలి
తక్షణ చర్యగా, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం గత మూడేళ్లలో పంట నష్టపోయిన రైతులందరినీ గుర్తించి, కౌలు రైతులను కలుపుకుని ఎకరాకు కనీసం రూ. 15,000 పరిహారం అందించాల. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఎలాంటి జాప్యం లేకుండా నష్టపరిహారం అందజేయాలని, తద్వారా రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోకుండా భరోసా కల్పించి , వేలాది మంది ఆత్మహత్యల మరణాలను నివారించాలి