- దీక్షకు ఢిల్లీ సీఎం మద్దతు
- భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల సమాలోచనలు
- చర్చలకు సిద్దమన్న కేంద్ర ప్రభుత్వం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 19 వ రోజు ఆందోళనల్లో భాగంగా 40 మంది రైతు సంఘాలు నేతలతో పాటు వందలాది మంది రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు నిరశన దీక్షను ప్రారంభించిన రైతులు సాయంత్ర 5 గంటల వరకు కొనసాగిస్తారు. ఘాజీపూర్, సింఘు, టిక్రీ వద్ద రైతులు నిరశన దీక్షకు దిగారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు జరుగుతాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. రైతుల ఆందోళన ఉధృతమవుతున్న నేపథ్యంలో హర్యానా, రాజస్థాన్ సరిహద్దును మూసివేశారు. మరోవైపు రైతు సంఘాల నేతలు తమ భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చట్టాలను కేంద్ర్రప్రభుత్వం రద్దు చేయని పక్షంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు.
నిరశన దీక్షకు కేజ్రీవాల్ మద్దతు
అన్నదాతల నిరశన దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రైతులపై కేజ్రీవాల్ కపట ప్రేమను చూపిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రైతులను కేజ్రీవాల్ రెచ్చగొడుతున్నారని జవదేకర్ ఆరోపించారు. అయితే జవదేకర్ విమర్శలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. అన్నదాతల దీక్షకు తన మద్దతు ఎపుడూ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు రైతుల దీక్షకు మద్దతుగా మనీశ్ సిసోడియా కార్యకర్తలతో కలిసి ఆప్ కార్యాలయంలో దీక్ష చేపట్టారు.
ఇదీ చదవండి:రైతు పోరు : పతకాలు వాపసు ఇచ్చేందుకు మాజీ సైనికుల సన్నాహాలు
గడ్కరీతో భేటీ అయిన హర్యానా డిప్యుటీ సీఎం
రైతుల నిరశన దీక్ష నేపథ్యంలో హర్యానా డిప్యుటీ సీఎం దుష్యంత్ చౌతాలా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి చేరుకున్నారు. రైతుల ఆందోళనలపై చర్చించనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అమిత్ షాతో భేటీ అయి ఆందోళనలపై చర్చించారు. రైతులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తోమర్ ప్రకటించారు.
ఇదీ చదవండి: మూడు చట్టాల రద్దుపై రైతుల పట్టుదల