Sunday, December 22, 2024

రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం

ఇప్పుడు రద్దయిన వ్యవసాయ చట్టాలకు సంబంధించి కుట్రపూరితమైన కార్యక్రమం ఒకటి అమలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ, మన ఆర్థికవేత్తలలో ప్రాబల్యం ఉన్నవారూ, మధ్యతరగతిలో ప్రభావం ఉన్నవారూ, ప్రధాన మీడియా ఈ కార్యక్రమాన్ని రహస్యంగా, కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. విషయం ఇది: వ్యవసాయ చట్టాలు అవసరమైనట్టివే. వ్యవసాయరంగానికి ఇటువంటి సంస్కరణల అవసరం ఎంతో ఉంది. అవి సరైన దిశలో రూపొందించిన చట్టాలే.  రైతుల ప్రయోజనాలు నెరవేర్చేవే. ఒక చిన్నవర్గం, ఇంకా చెప్పాలంటే స్వార్థపరులు కొందరు, వాటిని వ్యతిరేకించారు. పాపం ప్రధాని ముఖ్యమైన రాష్ట్రాలలో ఎన్నికలున్న నేపథ్యంలో ఒత్తిడికి లొంగిపోయారు. ప్రజాస్వామ్యం కోసం అభిలషణీయమైన చర్యలను ఏ విధంగా త్యాగం చేయవలసి వచ్చిందో ఈ వాదన చెబుతుంది. వ్యవస్థీకృతమైన, కృతనిశ్చయంతో ఉండిన స్వల్పసంఖ్యాకులు బృహత్తరమైన సంస్కరణల కార్యక్రమాన్ని పట్టాలు తప్పించారు. ఈ క్రమంలో విజేతలైన రైతులను మొండివారుగా, వెనుకబడినవారుగా, చట్టాలలోని మంచిని గ్రహించలేనివారుగా చూపుతున్నారు. ప్రభుత్వానికి మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ మూక రాజకీయాలకు బలి అయినట్టు చెబుతున్నారు. పంట దిగుబడికి కనీస మద్దతు ధర చెల్లించాలనే డిమాండ్ విపణిని చిందరవందర చేసేదిగా, ఆర్థికంగా అసాధ్యమైనదిగా అభివర్ణిస్తున్నారు. ఈ ధోరణిని నేను ప్రశ్నించదలుచుకున్నాను. దేశంలోని వ్యవసాయరంగాన్ని వేధిస్తున్న మౌలికమైన సమస్యలను పట్టించుకోకుండా  మార్కెట్ క్రమాన్ని వేగవంతం చేయడానికే వ్యవసాయచట్టాలు ఉద్దేశించినవని నిరూపించదలిచాను. పైన చెప్పిన వాదన వ్యవసాయరంగాన్ని కేవలం ఆర్థికరంగంగానూ, రైతును ఆర్థికరంగంలో పాత్రధారిగానూ, ఆహారాన్ని వ్యాపరవస్తువుగానూ పరిగణించడం ఈ వాదనలోని పూర్తిగా లోపభూయిష్టమైన దృక్పథమని చూపించదలచుకున్నాను.

Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?

కిసాన్ మోర్చా సభ

బీజేపీ రైతు విభాగం కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశం గురుగ్రాంలో కొన్ని రోజుల కిందట జరిగింది. ఈ సమావేశంలో ఒక సందేశం స్పష్టంగా వెలువడింది. రైతుల చేతిలో పరాభవాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో శక్తిమంతుడైన ప్రధాని దిగిరావడం, జాతికి క్షమాపణ చెప్పడం, అనంతరం పార్లమెంటులో మూడు చట్టాల రద్దు బిల్లును ఆమోదించడం పార్టీ సహించలేకపోతోంది. రద్దయిన మూడు చట్టాలూ ఎంత మంచివో, రైతులకు ఎంత ప్రయోజనం కలిగించేవో ప్రభుత్వం శక్తిమంతంగా చాటుతోంది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన రైతులనూ, వారికి మద్దతు ఇచ్చినవారినీ దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా, ఖలిస్తానీయులుగా అభివర్ణించింది.  కానీ ప్రధాని లొంగిపోయిన దరిమిలా గంభీరమైన, సాహసోపేతమైన వైఖరి చాటాలంటే ఏమి చేయాలి? ఇందుకు మోర్చా సభకు హాజరైన కేంద్ర వ్యవసాయ మంత్రి ఒక నమూనా అందించారు. ప్రధాని దిగిరావడాన్ని ఆయన హృదయ వైశాల్యానికి చిహ్నంగా, ‘ఐతిహాసిక్ బడప్పన్ (చరిత్రాత్మకమైన పెద్దరికం, హుందాతనం)’ గా అభివర్ణించారు. రైతులకు మేలు చేయడానికే వ్యవసాయ చట్టాలను ఉద్దేశించామని మోర్చా నాయకులకు మంత్రి చెప్పారు. రైతులలో ‘ఒక చిన్న వర్గం’ వ్యతిరేకించింది కనుక వాటిని రద్దు చేశాం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించింది రైతులలో ‘ఒక చిన్న వర్గం’ మాత్రమేనని ప్రధాని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో  కూడా స్పష్టంగా నొక్కి చెప్పారు. మంత్రి ఈ వ్యవహారానికి మరో కోణం జోడించారు.  మనం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో దేశంలో ఏ మూలన కూడా అభిప్రాయభేదాలూ, అశాంతీ ఉండకూడదని ప్రధాని భావించారని మంత్రి చెప్పారు. కనుక ప్రధాని విశాల హృదయం, మనం 75వ స్వాతంత్ర్య వత్సర ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రధాని సంకల్పించడం కారణంగానే వ్యవసాయ చట్టాలను రద్దు చేశామని రైతులకు నచ్చజెప్పడం కిసాన్ మోర్చా కర్తవ్యం. కష్టతరమైన బాధ్యత!

Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం

ఆర్థిక ప్రవీణుల అడ్డగోలు వాదన

గులాబీరంగు పత్రికలలో (పింక్ పేపర్స్ – వ్యాపార వ్యవహారాలు ప్రచురించే పత్రికలు) రైతులు వ్యాసాలు రాయరు. మన నయాఉదారవాద ఆర్థికవేత్తలలాగానో, వీక్షకులు ఎక్కువగా చూసే సమయంలో టీవీలు నిర్వహించే చర్చాగోష్ఠులలో(ప్రైమ్ టైమ్ డిబేట్స్) కనిపించే అధికారపార్టీ ప్రతినిధులలాగానో తెలివిగా, చాకచక్కంగా, చురుకుగా మాట్లాడే వక్తలు కారు వ్యవసాయదారుల నాయకులు. టీవీ తెరపైన అందంగా కనిపించే రకం కాదు. కనుక వ్యవసాయదారుల సమస్యలకు మీడియాలో చోటు దొరకదు. రైతుల పట్ల మీడియా నిర్దయగా ఉంటుంది. దేశంలో రైతులకు వ్యవసాయ చట్టాలు ఎట్లా నష్టదాయకమో వివరించేందుకు నేను చట్టాల తబ్సీళ్ళలోకి వెళ్ళను. ఈ విషయంపైన ఇప్పటికే ప్రచురించిన వ్యాసాలూ, వ్యాఖ్యానాలూ కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉన్నాయి. మన ఆర్థికవేత్తలు చెబుతున్న అంశాలలో రెండింటిని మాత్రమే పరిశీలిస్తాను. ‘ఫినాన్సియల్ ఎక్సెప్రెస్’ 20 డిసెంబర్ 2021 వ సంచికలో అశోక్ గులాటీ, శ్వేతా సైనీ రాసిన వ్యాసం పరిశీలిద్దాం. వారిని మాత్రమే విమర్శించేందుకు చేస్తున్న పని కాదు ఇది. ఉద్యమించిన రైతులను వ్యతిరేకించే ధోరణికి వారి వ్యాసం చాలా సమర్థంగా అద్దం పట్టింది కనుక దాన్నిస్వీకరిస్తున్నాను. ఈ వ్యాసం ప్రాతినిధ్య స్వభావం కలిగినది. విధాన నిర్ణయంలో అనుసరించే ప్రజాస్వామ్య పద్ధతి గురించి ఈ వ్యాసం ఏమంటుందో ఉటంకిస్తాను. ఈ పేరా చదివి నేను దిగ్భ్రాంతి చెందాను. మీకు కూడా అదే విధంగా అనిపిస్తుందేమో చూడండి. ఆ పేరా ఈ విధంగా సాగుతుంది:‘‘….ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానాలను ఎల్లప్పుడూ శాస్త్రీయ అంశాల ఆధారంగా రూపొందవు. వివిధ లాబీలూ (ప్రభావం వేసే వర్గాలు), ఉచిత విద్యచ్ఛక్తి, పంటరుణాల మాఫీ వంటి ఓటర్లకు ఉచితాలు ఇచ్చే రాజకీయ నాయకులు కూడా ఈ వర్గాలలో ఉంటారు. ఈ హ్రస్వ దృష్టి కారణంగా అసమర్థమైన, అసమంజసమైన విధానాలు రూపొందుతాయి. కాలక్రమేణా ఇటువంటి విధానాలు ఆర్థికవ్యవస్థకూ, పర్యావరణానికీ, చివరికి రైతులకూ హాని కలిగిస్తాయి.’’

Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు

మంచి, సమర్థమైన విధానాలు రూపొందేందుకు ప్రజాస్వామ్య ప్రక్రియ ఆటంకమనే అభిప్రాయం ఒకటి దాపరికం లేకుండానే ప్రమాదకరంగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో తప్పని సరి భాగమైన ఎన్నికల వల్ల నిర్హేతుకమైన విధానాలు చేస్తున్నారనే నింద కూడా ఇందులో ఉన్నది. వారి మాటలకు ఇంతకంటే భిన్నమైన అర్థం ఏమైనా ఉన్నదా? ఆర్థికవేత్తలు మనకు ఏమి చెబుతున్నారు?

తాము సౌష్టవమైన విధానాలు రూపొందించడంలోనూ, శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవడంలోనూ సిద్ధహస్తులమని వారు మనకు చెబుతున్నారు. వారు చెబుతున్న చికిత్స వల్ల తమకు ఎంత మేలు జరుగుతుందో లబ్ధిదారులకు తెలియదు. సర్వసాధారణంగా నయాఉదారవాద ఆర్థికవేత్తలూ, సామాజికార్థిక సమస్యలకు సాంకేతికమైన, శాస్త్రపరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలను విశ్వసించేవారూ విధాన నిర్ణయ పద్ధతిని చాలా అహంకారపూరితంగా పరిగణిస్తారు. ఆ సంగతి వారు చెప్పరు కానీ నిరంకుశుడైన పాలకుడు పదవిలో ఉండి తాము ఇచ్చే శాస్త్రీయమైన సలహాలు ఆలకించి పాటిస్తే వారు సంతోషిస్తారు. అటువంటి వలలో మన ప్రధాని పడ్డారేమోనని నా అనుమానం. ఎందుకంటే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ – ఎంఎస్ పీ) ని ముఖ్యమంత్రిగా ఉండగా మోదీ గట్టిగా సమర్థించారు. ప్రధాని అయిన తర్వాత తన వైఖరిని మార్చుకొని తాజా వైఖరిని ప్రదర్శించడం ఎప్పుడు, ఎందుకు, ఎట్లా ప్రారంభించారో జాతికి చెప్పాలని మోదీ అనుకోలేదు. ముఖ్యమంత్రి, కాబోయే ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కనీస మద్దతు ధర గురించి ఏమన్నారో ఈ చిన్న విడియో చూడండి  (కనీస మద్దతు ధర ఇచ్చితీరాల్సిందే నంటూ ఘంటాపథంగా మోదీ అద్ఘోషించడం వీడియోలో కనిపిస్తుంది).

Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన ఏ నాయకుడైనా వ్యవసాయ బిల్లులను ఆమోదించే ముందు వాటిపైన పార్లమెంటులోనూ, వెలుపలా విస్తృతమైన చర్చకు అవకాశం కల్పించేవారు. సౌష్టవమైన విధానాల రూపకల్పనకు ప్రజాస్వామ్యం అడ్డంకి అనే భావన బిల్లులపైన చర్చ లేకుండా వాటిని ఆమోదించేందుకు దారి తీసిందేమో. అదే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించడం కూడా మంత్రిమండలిలో చర్చించకుండానే చేశారు. ప్రధాని ప్రకటన చేసిన తర్వాత సదరు ప్రకటనను మంత్రిమండలి ఆమోదించింది.

కనీస మద్దతు ధర ఆర్థిక వ్యవస్థకు వినాశకారి

కనీస మద్దతు ధర-ఎంఎస్ పి- అభిలషణీయం కాదని మన ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. గులాటీ, సైనీని ఉటంకిస్తున్నాను చూడండి. ‘‘….ఇది ఆర్థికవ్యవస్థను చిందరవందర చేయడమే కాకుండా చివరికి రైతు వ్యతిరేకిగా మారుతుంది. కారణం స్పష్టం. గిరాకీ-సరఫరా (డిమాండ్ – సప్లయ్) సూత్రానికి లోబడే ధరల నిర్ణయం జరుగుతుందనే ప్రాథమిక లాజిక్ ను పట్టించుకోవడం లేదు.’’ ఎంఎస్ పి చెల్లించి ధాన్యం సేకరించే ధోరణిని బాగా తగ్గించకపోతే ఏమి జరుగుతుందని వారు అన్నారో వారి మాటలలోనే ఆలకించండి: ‘‘రైతులకు మెరుగైన ఆదాయం కల్పించాలని ప్రయత్నిస్తే అందువల్ల కేంద్రప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.’’ అవును. వారు ఆ మాట నిజంగా అన్నారు. ఎంఎస్ పీ చెల్లించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయంలో వారి అంచనాలు వివాదాస్పదం కావచ్చు.  కానీ విషయం అది కాదు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పట్లా, రైతులపట్లా, మానవీయ పరిస్థితుల పట్లా వారి వైఖరి గమనార్హమైనది.

Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం

నానాటికి తీసికట్టు

మన వ్యవసాయం, రైతులు, వారి ఆదాయాలు, వారి సందిగ్ధావస్థ గురించి మీకు కొన్ని అంశాలు నివేదిస్తాను.

దేశంలో పనిచేసేవారిలో 54శాతం మంది వ్యవసాయంలోనో, దానికి సంబంధించిన రంగాలలోనో ఉన్నారు. అంటే మనం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నామంటే పనిచేసే జనాభాలో సగం కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. మన గ్రామీణ ప్రాంతాలలోని కుటుంబాలలో 58 శాతం వ్యవసాయరంగంలో ఉన్నాయి. అంటే మనం వ్యవసాయం గురించి వ్యవహారం చేసేటప్పుడు గ్రామీణ భారతంలో ప్రతి పది కుటుంబాలలో ఆరు కుటుంబాలతో వ్యవహారం చేస్తున్నట్టు లెక్క. మన వ్యవసాయ కార్మికులలో 40 శాతంకంటే అధికులు మహిళలు. మన వ్యవసాయదారులలో సైతం 30 శాతంమంది మహిళలే. ఈ లెక్కన వ్యవసాయంపైన ఆధారపడినవారు ఎంతమంది ఉన్నారో ఊహించుకోవాలి. వ్యవసాయంపైన ఆధారపడిన వ్యక్తులూ, కుటుంబాలూ, వయోవృద్ధులూ, పిల్లలూ, వారి జీవికలూ, విద్య, ఆరోగ్యం, సంక్షేమం అన్నీ ఆలోచించాలి. వ్యవసాయరంగం గురించి కాకుండా ఆ రంగంపైన ఆధారపడి జీవిస్తున్నవారి గురించి ఆలోచించండి.

గ్రామీణ భారత ప్రజల సంధిగ్థావస్థను పట్టణ భారత, పట్టణీకరణ చెందిన మేధావులు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. వారి ఆదాయాలు ఎంత అసమానంగా ఉన్నాయో చెప్పడానికి లఘువుగా లెక్కలు చెబుతాను. ఈ అసమానతలు ఏటా ఏ విధంగా పెరుగుతూ వచ్చాయో కూడా చూడండి. 1980లలో వ్యవసాయదారుడి ఆదాయం వ్యవసాయేతర వ్యాపకంలో ఉన్నవారి ఆదాయంలో 34 శాతం ఉండేది. 1993-94 నాటికి అది 25 శాతానికి పడిపోయింది. 2004-5 నుంచి 2011-12 దాకా రైతుల ఆదాయంలో స్పల్ప అభివృద్ధి కనిపించింది. అది కూడా 1983-84 నాటి స్థాయిని దాటలేదు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయాల మధ్య అంతరాలు పెరగడానికి కారణం వ్యవసాయరంగం వైఫల్యం కాదు. వ్యవసాయంరంగం మూడు పూవులూ, ఆరు కాయలుగా సమృద్దిగా ఉన్న కాలంలోనే ఆదాయంలో అంతరాలు పెరిగాయి. 1960లలో ఆహారంకొరత ఉన్న దేశం ఇప్పుడు మిగులు ఆహారధాన్యాలు కలిగిన దేశంగా అభివృద్ధి చెందింది. ప్రతి మనిషికీ ఏడాదికి 45 శాతం ఎక్కువ ఆహారం అందుబాటులో ఉంది. ఆహారధాన్యాల ఉత్పత్తి 3.7 రెట్లు పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే రైతు మనకు ఆహారోత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించిపెట్టాడు. కానీ అతడు ఆర్థికంగా మరింత కుంగిపోయాడు.

Also read: టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?

నిరాశానిస్పృహలు

నిరాశానిస్పృహలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే గత రెండు దశాబ్దాలలో 2.5 కోట్ల మంది వ్యవసాయరంగం విడిచి దూరంగా వెళ్ళిపోయారు. వారికి వ్యవసాయం తప్ప మిగతా రంగాలలో మెలకువలు తెలియవు కనుక నిర్మాణ రంగంలోనో, పట్టణాలలోనో తక్కువ ఆదాయం వచ్చే పనులలో కునారిల్లుతున్నారు.

వారు ఏ రకమైన వ్యవసాయదారులు? దేశం మొత్తం మీద సగటున భూకమతం 1.08 హెక్టార్లు. సన్న, చిన్న కమతాలు. 0 నుంచి 2 హెక్టార్ల విస్తీర్ణం భూములు కలిగినవారు.  అటువంటివారు దేశంలో 86 శాతం మంది ఉన్నారు. సాగుచేసేవారిలో అత్యధికులు ఎటువంటి రక్షణా లేని కౌలుదారులు. వారికి భూమి పట్టాలు ఉండవు. భూమిపైన ఎటువంటి హక్కులూ ఉండవు. వారు చేసే అప్పులలో 40 శాతం వరకూ అవ్యవస్థీకృత వనరుల నుంచి తీసుకున్నవే. పశువులు, చెట్లు పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలకు వ్యవస్థీకృత సంస్థల నుంచి అందే రుణాలు పది శాతం మాత్రమే. మన వ్యవసాయరంగంలో ఇటువంటి దయనీయమైన పరిస్థితులకూ, రైతులు పడే వర్ణనాతీతమైన బాధలకూ బాధ్యత వహించవలసిన ఏ రాజకీయ పార్టీ కానీ, కూటమి కానీ, ప్రభుత్వం కానీ తప్పించుకోజాలదు. తమ ఉత్పత్తిపైన రైతులకు అధికారం లేదు. మార్కెట్ లో మంచి ధర పలికే వరకూ ధాన్యం నిల్వ ఉంచడానికి అవసరమైన గిడ్డంగి సదుపాయాలు లేవు. వ్యవసాయ పనులకు పెట్టుబడికోసం ముందుగా అప్పులు ఇచ్చే నిర్దాక్షిణ్యమైన వడ్డీవ్యాపారుల నుంచీ, ఎరువుల, రసాయనాల వ్యాపారుల నుంచీ రక్షణ లేదు. ఎంఎస్ పీ (కనీస మద్దతు ధర) ను ప్రభుత్వం చెల్లించబోదంటూ వ్యవసాయ చట్టాలు స్పష్టం చేశాయి. స్థానికంగానే పంటదిగుబడిని అమ్ముకోలేని బడుగు రైతుకు నువ్వు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునంటూ చట్టాలు వాగ్దానం చేస్తాయి. స్థానికంగా దళారీని ఎదుర్కొని నిలువలేకపోతున్న బక్క రైతుకు బడా కార్పొరేషన్లు గిట్టుబాటధర ఇస్తాయని చట్టాలు నమ్మబలుకుతున్నాయి. కార్పొరేషన్లు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వాటితో న్యాయపోరాటం చేయవచ్చునంటూ బక్కచిక్కిన రైతుకు చట్టాలు ఆశ్వాసం ఇస్తున్నాయి. ఈ విషయంలో రైతులకు ఏమైనా భయసందేహాలు ఉంటే మార్కెట్ శక్తులు ఎంత మంచిగా ఉంటాయో వారు అర్థం చేసుకోలేకపోతున్నారంటూ వారిని ఆర్థికవేత్తలు నిందిస్తారు. మన గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పుడు నిరాశావాదాన్ని వినిపిస్తున్నారని తాజా సీఎంఐఈ (భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం – సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) సర్వే తెలియజేస్తున్నది. తమ ఆదాయం నిరుడి కంటే ఎక్కకువగా ఉన్నదని చెప్పే కుటుంబాల సంఖ్య నవంబర్ 14తో అంతమయ్యే వారంలో 14 శాతం ఉంటే నవంబర్ 28తో అంతమయ్యే వారానికి 8.4 శాతానికి పడిపోయింది. కానీ సాంకేతికతపైన ఆధారపడే మన ప్రవీణులకు గ్రామీణ ఆవేదన పట్టదు.

Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది

వ్యవసాయం వాణిజ్యం కాదు

వ్యవసాయోత్పత్తులు కేవలం వాణిజ్యపరమైన వస్తువులు మాత్రమే కావు. అవి ఆహారపదార్థాలు. భూమి అనేది ఇతర ఉత్పాదక వనరు వంటిది కాదు. అది సజీవమైనది. దానితో రైతుకు బలమైన అనుబంధం ఉంటుంది. అనిర్వచనీయమైన విశ్వాసం (సెంటిమెంటు) ఉంటుంది. భూమి యాజమాన్యం, భూమిపైన హక్కు, విశ్వసనీయమైన వంగడాల అందుబాటు, ఎరువులూ, రసాయనాలూ, నీరూ, విద్యుచ్ఛక్తి సరఫరా, ప్రాథమిక అవసరాలూ, ఇంకా అటువంటి కీలకమైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా మార్కెటింగ్ సమస్యలను మాత్రమే పట్టించుకోవాలనీ, వాటికి మాత్రమే పరిష్కారాలు కనుగొనాలనీ ప్రభుత్వాలూ, ప్రవీణులూ ప్రయత్నిస్తున్నారు. మార్కెటింగ్ లో మాత్రమే సంస్కరణలు అవసరమనీ, మిగతా కీలకమైన రంగాలలో సంస్కరణలు అవసరం లేదనీ మనం నమ్మాలని వారు కోరుకుంటున్నారు. పైగా రుణ మాఫీ అనేది ఆర్థికవ్యవస్థకు మంచిది కాదనీ, ఎంఎస్ పి చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదనీ వారు రైతులకు చెబుతున్నారు. 2013 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ బ్యాంకులు 10.83 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయేతర రుణాలను మాఫ్ చేసినట్టు సెంట్రల్ బ్యాంక్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆ మొత్తం చుక్కలను చూపుతుంది. అందుకే మన ప్రభుత్వం పట్ల రైతులలో విశ్వాసం కుదురుకోవడం లేదు.

ఇప్పటికైనా రైతుల గోడు ఆలకించండి

ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక ప్రవీణులూ ఒక సారి రైతులు చెప్పే విషయాలను ఆలకించి, వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విపణిదేవుళ్ళకు ఇచ్చే ప్రాధాన్యంలో సగం ప్రాధాన్యమైనా అన్నదాతలకు ఇస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆగ్రహంతో దహించుకుపోతున్న, అశక్తుడనే భావన వేధిస్తున్న,  పేదరికంలో అలమటిస్తున్న, రుణగ్రస్థుడైన, దయనీయమైన రైతు దేశం అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తర లక్ష్య సాధనకు దోహదం చేయజాలడు.

సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా నేను కొంత విరామం తీసుకుంటాను. పునర్దర్శనం కొత్త సంవత్సరం జనవరి మూడో వారంలో. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్

(MwM (మిడ్ వీక్ మ్యాటర్స్)41వ భాగానికి స్వేచ్ఛానువాదం)

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles