• ఎర్రకోట బురుజులు ఎక్కిన ఆందోళనకారులు
• డ్రోన్లు ప్రయోగించిన ఆందోళనకారులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ పలు హింసాత్మక ఘటనలకు దారితీసింది. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ భద్రతా వలయాలను ఛేదించిన రైతులు ఎర్రకోటను చేరుకున్నారు. దేశం నలుమూలల నుంచి ఢిల్లీ వచ్చిన వేలాది మంది రైతులు ఎర్రకోటను ముట్టడించారు. కొందరు ఆందోళన కారులు తమ దగ్గర ఉన్న ఖడ్గాలను దూయడంతో పోలీసులు భయాందోళనలకు గురయ్యారు.
ఇది చదవండి: హింసాత్మకంగా కిసాన్ పరేడ్
అంతకుముందు ఎర్రకోటవైపు దూసుకెళుతున్న ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు బస్సులను అడ్డుగా పెట్టారు. దీంతో ట్రాక్టర్లతో బస్సులను పక్కకు తోసి రైతులు ముందుకు సాగారు. రైతులు చేస్తున్న ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో ఢిల్లీ ఐటీవో ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ఎర్రకోట చేరుకున్న ఆందోళనకారులు ఎర్రకోట బురుజులు ఎక్కి జెండాలు ఊపుతూ హడావుడి చేశారు. రైతులు ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఎర్రకోటకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆందోళన కారులు ఎర్రకోటపై డ్రోన్లను ప్రయోగించడం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కారులను శాంతింపచేసేందుకు పోలీసులు చర్చలు జరుపుతున్నారు.
ఇది చదవండి: ఢిల్లీలో కిసాన్ పరేడ్