Thursday, December 26, 2024

ఉద్యమబాట వీడని రైతులు

  • చాలా షరతులను ప్రభుత్వం ఆమోదించాలి
  • అప్పటిదాకా ఆందోళన విరమణ ప్రసక్తి లేదంటున్న రైతు సంఘాలు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించినట్లుగానే  సాగు చట్టాల  రద్దు దిశగా ముందడుగు పడింది.  దీనికి సంబంధించిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజునే రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ వైఖరి పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూనే, డిమాండ్లు మొత్తం నెరవేరే దాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు భీష్మిస్తున్నాయి. అప్పటి వరకూ ఇంటిముఖం పట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ మరోమారు తేల్చి చెప్పేశారు.

Also read: ‘భారత్ గౌరవ్’ రైళ్ళకు స్వాగతం!

షరతులు అలాగే ఉన్నాయంటున్న రైతు నేతలు

కనీస మద్దతు ధరను ప్రకటించడం, ఆందోళనలో అమరులైన 700 మంది రైతులకు పరిహారాన్ని ఇవ్వడం, రైతులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించడం, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించడం మొదలైన డిమాండ్లన్నీ జనవరి 26 లోగా నేరవేర్చాలనే పట్టుదలతోనే రైతు సంఘాలు ఉన్నాయి.  ఈ నవంబర్ 26 తో ఉద్యమానికి ఏడాది కాలం పూర్తి కానుంది. భవిష్య కార్యాచరణ ఆ రోజు మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈ నవంబర్ 29వ తేదీన 500 మంది రైతులు 30 ట్రాక్టర్లలో ర్యాలీగా దిల్లీకి చేరుకుంటారని కిసాన్ యూనియన్ నేత టికాయిత్ ఇప్పటికే ప్రకటించారు. అదే రోజు పార్లమెంట్ లో చట్టాల రద్దు కూడా జరగనుండడం గమనార్హం. పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బిజెపి ప్రభుత్వం సాగుచట్టాల విషయంలో యూటర్న్ తీసుకుందనే మాటలు అంతటా వినపడుతూనే వున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో, రైతు సంఘాలు ఆ యా రాష్ట్రాలకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి.రాబోయే ఎన్నికల సమయంలోనూ రైతు సంఘాలు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత తాము ఎన్నికలపై మాట్లాడుతామని రాకేశ్ టికాయిత్ అంటున్నారు.

Also read” నిలిచి గెలిచిన రైతు

ఉద్యమ రైతులలో బీజేపీ పట్ల వ్యతిరేకత

సాగు చట్టాల రద్దు, రైతు సమస్యల పరిష్కారాలు ఎలా ఉన్నా బిజెపి ప్రభుత్వంపై రాకేశ్ టికాయిత్ వ్యతిరేక భావంతోనే ఉన్నారు. ఆ భావన ఇప్పట్లో పోయేట్లు లేదు. బిజెపిని రైతు వ్యతిరేక, సిక్కుల వ్యతిరేక పార్టీగానే ఆయన చూస్తున్నారు. జాట్లకు కూడా బిజెపి వ్యతిరేకమనే భావన కలిగించడంలో రైతు సంఘాల ఆందోళనలు ముఖ్య భూమికను పోషించాయి. ఉద్యమంలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతంమంది సిక్కులు, జాట్లు కావడమనే అంశం ఈ ప్రచారానికి బలాన్నిస్తోంది. రైతు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ, రైతు నేతలు ఇటువంటి భావనలు కలిగిఉండడం వెనకాల వారి రాజకీయ,ఆర్ధిక స్వార్ధాలు దాగిఉన్నాయని  బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. రాకేశ్ టికాయిత్ వంటివారి వైఖరి దానికి అద్దం పడుతోందని బిజెపి శ్రేణులు అంటున్నాయి.  రైతు హితంగా వ్యవహరిస్తూ, సర్వ మత సహనంతో, పారదర్శకంగా ఉండివుంటే  ఈనాడు బిజెపికి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని డాక్టర్ స్వామినాథన్ తాజాగా మరోమారు గట్టిగా చెప్పారు. రైతు సంఘాలతో మాట్లాడకుండా, చర్చకు తావు ఇవ్వకుండా వ్యవసాయ చట్టాలు తెచ్చిన రోజే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందనీ, ఇప్పుడు రద్దు చేస్తున్న దశలోనూ అదే ఏకస్వామ్యం కనిపిస్తోందనీ దిల్లీకి చెందిన సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు. మా సమస్యలపై మాతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చించి తీరాల్సిందేనని రైతు సంఘాలు అంటున్నాయి. గతంలో జరిగిన చర్చలన్నీ అర్ధాంతరంగానే ముగిసాయి. మళ్ళీ చర్చలు జరుగుతాయా? జరిగినా సవ్యంగా ముగుస్తాయా అన్నది చెప్పలేం. రైతుసంఘాల నేతలు – బిజెపి నాయకుల మధ్య ఒకరిపై ఒకరికి మొదటి నుంచీ విశ్వాసం లేదు. ఒకరినొకరు తప్పుపట్టుకుంటూనే ఉన్నారు. తీవ్రమైన విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇరు వర్గాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడేంత వరకూ ఈ ఆందోళనలు ఆగేట్టు లేవు. ఉభయుల రాజకీయ ఎజెండాల మధ్య,సామాన్య రైతు నలిగే పరిస్థితి రాకూడదని కోరుకుందాం.

Also read: ధర్మవర్తనుడికి బ్రహ్మరథం, యాచకుడికి ఘనంగా వీడ్కోలు!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles