మరి కొన్ని నెలల్లోనే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ వంటి కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఉద్యమంలో ముఖ్యభూమిక పోషిస్తున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. నిరసనలు మొదలై నెలలు గడచినా ఇంతవరకూ ఎటువంటి పరిష్కారం కుదరలేదు. కేంద్రం దిగివచ్చే దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. మడమ తిప్పే ఆలోచనలోనూ ఉద్యమకారులు లేరు. చావోరేవో తేల్చుకోడానికే వాళ్ళు సిద్ధమయ్యారు. రైతులపై హరియాణా పోలీసులు లాఠీచార్జి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన మరింత మంటలు రేపుతోంది.
Also read: నల్ల చట్టాలపై నిరసన ప్రదర్శనకు రైతుల సన్నాహాలు
కిసాన్ మహాపంచాయత్
కర్నాల్ లో మంగళవారం నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’ వేలమంది రైతులతో దుమ్మురేగి పోయింది.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో,ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించి తీరుతామని విపక్షాలు చేస్తున్న భీషణ ప్రతిజ్ఞలు ఎలా ఉన్నా ఉత్తరాది రైతులు ఆగేట్టు లేరు. రాజకీయ పార్టీల ప్రభావం లేకుండానే ఈ ఉద్యమం సాగుతోంది. దీనిని నకిలీ ఉద్యమంగానే బిజెపి నేతలు కొట్టి పారేస్తున్నారు. దక్షిణాదిలో ఎలా ఉన్నా, ఉత్తరాదిలో ఉద్యమం ఉడికిపోతోంది. ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి, బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా రైతునేతలు ముందుకు సాగుతున్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితాలు కనిపించడం లేదు. ప్రతిగా రెట్టింపు ఉత్సాహంతో రైతు సంఘాలు కలిసి సాగుతున్నాయి. కర్నాల్ లో ఆగస్టు 28వ తేదీన రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. ఆ క్రమంలో, రైతులపై పోలీసులు పెద్దఎత్తున లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి బాధ్యుడైన ఐ ఏ ఎస్ అధికారి ఆయుష్ సిన్హాను విధుల నుంచి తొలగించమని కర్షక నేతలు డిమాండ్ చేశారు. ‘మహా పంచాయత్’ వేదికగా ఈ డిమాండ్ ను ముందుకు తెచ్చారు. రైతునేతలతో స్థానిక అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆ జిల్లా మినీ సచివాలయాన్ని ముట్టడించడానికి వేలాదిమంది రైతులు ర్యాలీగా వెళ్లారు. వాళ్ళని అడ్డుకోడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. నిరసనకారులపై జలఫిరంగులు కూడా ప్రయోగించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటూనే రైతులోకం ముందుకు సాగింది. రైతుల తలలు పగలగొట్టాలంటూ…. ఐ ఏ ఎస్ అధికారి ఆయుష్ సిన్హా మాట్లాడిన మాటలు అన్నదాతలను ఆగ్రహోదగ్రులను చేస్తున్నాయి. “హరియాణా జైళ్లను నింపడానికి మేం సిద్ధం.. ” అంటూ రైతు సంఘాల అగ్రనేత రాకేష్ టికాయిత్ ప్రతిస్పందించిన తీరు రైతులను యుద్ధోన్ముఖులను చేస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేట్టులేదు. ఆపే సూచనలూ ప్రభుత్వాల నుంచి కనిపించడం లేదు.
Also read: అన్నదాత ఆగ్రహించి వందరోజులు
రైతులను దోషులుగా తేల్చే యత్నం
రైతులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి, ఉద్యమానికి చెడ్డపేరు తేవాలనే పన్నాగంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని కిసాన్ మోర్చా నేతలు విమర్శిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై అధ్యయనం చేసి, సమగ్రమైన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. సభ్యులు నివేదికను సమర్పించడం కూడా జరిగింది. అందులో ఏముంది? దానిపై సుప్రీంకోర్టు వైఖరి ఏంటి? ఇంకా తెలియాల్సి వుంది. ఏదిఏమైనా, అన్నదాతల సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా కాలయాపన చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిట్టుబాటు ధర దొరకక, వ్యవసాయం లాభసాటి కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోట్లు కుమ్మరించే రియల్ ఎస్టేట్ వ్యాపారం బారినపడి, వ్యవసాయం తగ్గుముఖం పట్టింది. ఆహార ఉత్పత్తి ఇప్పటికే పెద్ద సవాల్ గా మారింది. కడుపుకాలిన రైతులు కాడి పడేస్తే దేశం వల్లకాడవుతుందని వ్యవసాయ విద్యావేత్తలు మండిపడుతున్నారు. సుప్రీం ధర్మాసనం కలుగజేసుకొని, రైతు సమస్యల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం చేయాలి. ఏలికలు మొండిపట్టు వీడి రైతుల పట్ల నిలవాలి. అన్నదాత చల్లగా ఉంటేనే.. దేశం సుభిక్షంగా ఉంటుంది. నిజంగా, రైతులోకమంతా ఏకమైతే… అధికారాలు కదిలిపోతాయి. తెగేదాకా లాగడం వివేకం కాదని విజ్ఞుల సూచన.
Also read: రైతు ఉద్యమంలో దేశద్రోహులు