- ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత
- గస్తీ నిర్వహిస్తున్న భద్రతాబలగాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాల రద్దుకోసం రాజీలేని పోరాటం చేస్తున్న రైతన్నలు ఈ రోజు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ కారణంగా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా రవణా స్తంభించింది. రైతు మద్దతుదారులు రహదారులపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
వినూత్న నిరసనలు:
ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ఘాజిపూర్ సరిహద్దు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. మండుటెండలో రోడ్లపైనే నృత్యాలు చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. దీంతో 24వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బంద్ నేపథ్యంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అమృత్ సర్ లో బంద్ కు సంఘీభావం తెలుపుతూ రైల్వే ట్రాక్ పై బైఠాయించి రైల్ రోకో చేపట్టారు. బంద్ నేపథ్యంలో నాలుగు శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Also Read: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్ వి రమణ
భారత్ బంద్‌కు ఏపీ సర్కార్ మద్దతు:
రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు జగన్ సర్కార్ సంఘీభావం తెలిపింది. అత్యవసర సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని ఏపీ రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భారత్ బంద్ కు కాంగ్రెస్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ ,ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాలలో జనజీవనంపై ప్రభావం పడింది. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుమేరకు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి.
Also Read: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్
సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న భద్రతాబలగాలు:
ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సరిహద్దుల్లో భద్రతాబలగాలను భారీగా మోహరించారు.