Sunday, December 22, 2024

వీడ్కోలు

                            ————-

( LAST WORDS OF THE PROPHET  FROM   ‘ THE PROPHET ‘– BY KAHLIL GIBRAN)

అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్

————————-

  సాయం సమయం అయింది.

  ఆల్ మిత్రా — సన్యాసిని ఇలా అంది

  “ఈరోజు, ఈ ప్రదేశం,

  ప్రవచించిన మీ ఆత్మ

  ధన్యమవుగాక!”

  ఆల్ ముస్తఫా ఇలా జవాబిచ్చాడు

 “నేనా మాట్లాడింది!?

  నేను కూడా ఒక శ్రోతను కాదా?”

  అప్పుడాయన గుడిమెట్లు దిగాడు

  ప్రజలందరూ ఆయనను అనుసరించారు.

  ఓడను సమీపించాడు

  డెక్ (అంతస్తు) పై నిలబడ్డాడు !

  ప్రజల వైపు తిరిగి, స్వరం పెంచి ఇలా చెప్పాడు:

  ఆర్ఫేలెస్ ప్రజలారా!

  గాలి మిమ్ములను విడువ మంటోంది!

  నాకు గాలికున్న తొందర లేకపోయినా గాని

  నేను వెళ్లక తప్పదు!

  మాలాటి సంచారులు

  ఎప్పుడూ ఒంటరి మార్గాన్నే ఎన్నుకుంటారు.

 నిన్న పూర్తి అయిన రోజు దగ్గరే

  ఇంకో రోజు మొదలవుతుందని ఏమీ లేదు

 మాకు సూర్యాస్తమయం ఎక్కడో

 సూర్యోదయం ఎక్కడో -మాకే ఎరుక ఉండదు.

 అవని నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా

 మేము పయనిస్తూనే ఉంటాము.

  మేము మొండి మొక్కల విత్తనాలం

  పక్వత చెందినప్పుడు

  గుండె నిండుగా ఉన్నప్పుడు

  మేము గాలిలోకి వెదజల్ల బడతాము !

  నేను మీతో ఉంది కొద్దికాలం మాత్రమే.

  మీతో మాట్లాడింది కూడా కొంచెమే!

  కానీ,

  మీ చెవుల్లో నా స్వరం వాడిపోయినప్పుడు,

  మీ జ్ఞాపకాల్లో నా ప్రేమ కరిగిపోయినప్పుడు

  అప్పుడు — నేను మరలా వస్తాను !

  సుసంపన్నమైన హృదయమూ,

  పెదవులపై నా ఆత్మను నిలిపి

  మీతో సంభాషిస్తాను !

  అవును,   సంద్రపు పోటుతోపాటు నేను వస్తాను!

  మరణం నన్ను దాచివేయుగాక!

  మహా నిశ్శబ్దం నన్ను ఆవరించుకోనీ!

  అయినా, మరలా వచ్చి మీకు దగ్గరౌవుతాను.

  నేను ఫలించనిది కోరుకోను

  నేను చెప్పేది సత్యమయితే

  స్పష్టమైన స్వరంతో ఆ సత్యం-

  మాటల రూపంలో మీ మనోగతాలకు

  దగ్గరగా బహిర్గతమవుతుంది!

  ఆర్ఫాలేస్ ప్రజలారా!

  నేను గాలితో వెళతాను గాని

  శూన్యంలోకి కాదు;

  ఈరోజుమీ అవసరాలునా ప్రేమ

  నెరవేరే దినం కాకపోతే —

  ఇది రేపటి వాగ్దానం అనుకోండి!

  మనిషి అవసరాలు మారవచ్చు గాక

  కానీ అతని ప్రేమ,

  ఆ ప్రేమ  అతని అవసరాలను తీర్చాలనే

  — అతని కాంక్ష   మారవు!

  మహా నిశ్శబ్దం నుండి

  నేను తిరిగి వస్తానని తెలుసుకోండి!

  ఉదయ సంధ్యలో —

  మైదానాల్లో కొన్ని నీటి చుక్కలు విడిచి,

  వేగంగా కరిగిపోయే పొగ మంచు

  పైకి లేచిమేఘమై

  వానలా కురుస్తుంది!

  నేనూ ఆ పొగ మంచు లాంటి వాడినే!

  నిశ్చల నిశీధిలో  

  నేను మీ వీధుల్లో తిరుగాడాను

  నా ఆత్మ మీ ఆవాసాలలోకి ప్రవేశించింది;

  మీ గుండె చప్పుళ్లు నా గుండెలో

  నిక్షిప్తమై ఉన్నాయి.

  నా ముఖంపై మీ శ్వాస కదులుతోంది

  మీరందరూ నాకు తెలుసు!

  ఔనుఔనౌను!

  మీ ఆనందం నాకు తెలుసును

  మీ దుఃఖమూ తెలుసు

  నిద్రావస్థలో మీరు కన్న కలలే

  నా కలలు కూడా!

   చాలాసార్లు,

   కొండల మధ్య సరోవరంలా

   మీ మధ్య నేనుంటాను!

   మీ శిఖరాగ్రాలకు, మీ వంగే వాలులకు,

  మీ ఆలోచనా స్రవంతులకు,

  మీ ఆకాంక్షలకు కూడా — అద్దం పడతాను

  ప్రవాహాల్లో మీ చిన్నారుల కేరింతలూ,

  నదుల్లో మీ యువకుల ఆశలూ

  నా మౌన సాగరంలో వచ్చి కలుస్తాయి!

  నా లోతుల్లోకి నదులూ, ప్రవాహాలూ

  వచ్చి చేరినపుడు కూడా

  పాడుతూనే ఉంటాయి!

  నవ్వుల కేరింతల కన్నా తీయనిదీ,

  వాంఛల కన్నా ఉన్నతమైనదీ

  — నాలో వచ్చి కలుస్తుంది!

  అది మీలోని అనంత తత్వమే;

  ఆ మహాపురుషుని లోని

  కణాలు, నాడులేగా మీరంటే!

  ఆ పరమాత్మ జపంలో

  మీ గానం కేవలం

  ఒక నిశ్శబ్దమైన దడ లాంటిది!

  ఆ మహానరునిలోనే

  మీరు కూడా మహానరులుగా ఉంటారు!

  ఆయనను దర్శించటంలోనే

  మిమ్మల్ని నేను దర్శించాను

  ఇంకా ప్రేమించాను

  ఆ అనంత గోళంలో–

  ప్రేమ చేరని  దూరాలేముంటాయి?

  ఏ దర్శనాలు, ఏ అంచనాలు, ఏ ఊహలు —

  ఆ ప్రేమ పరుగుని మించిపోగలవు?

  ఆపిల్ మొగ్గలతో నిండి ఉన్న

  మహా ఓక్ వృక్షం లాంటివాడే

  మీలోని మహాపురుషుడు.

  అతని శక్తి మిమ్ములను భూమికి బంధిస్తుంది

  అతని సువాసన మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుంది!

  అతని అక్షయత్వంలో

  మీరు అమరులు అవుతారు!

  ‘గొలుసులా కూడా మీరు,

  అతి దుర్బలమైన బంధాలు‘ —

  అని మీకు చెప్పబడింది

  అది అర్థ సత్యం మాత్రమే

  గొలుసులో మీరు

  అతి బలమైన బంధాలు కూడా

  బహు చిన్న పనితో మిమ్ములను

  అంచనా వేయాలంటే —

  నురగ బలహీనత చూసి

  సాగరాన్ని  అంచనా వేయటం లాంటిదే!

  మీ వైఫల్యాలను బట్టి

  మీపై తీర్పునివ్వడం అంటే

  ఋతువుల అస్థిరతపై అభిశంసన చేయడమే!

  అవునుమీరు మహాసాగరం లాంటివారు

  స్థిరమైన ఓడలు మీ తీరాలలో

  పోటుని ఆపినా గాని

  సాగరంలా మీ పోటుని తొందరించలేవు

  మీరు రుతువుల లాంటివారే

  మీ శీతకాలంలో వసంతాన్ని కాదన్నా గాని

  మీలో నిదురిస్తున్న వసంతం

  మగత  నిదురలో నవ్వుకుంటుందే గాని

  మనస్తాపం చెందదు!

  నేను చెప్పే మాటలు —

  “ఆయన మనల్ని బాగా పొగిడాడు

   మనలో మంచినే చూసాడు”

   అని మీరు ఒకరికొకరు

    చెప్పుకుంటానికి కాదు!

   మీ ఆలోచనలలో ఉన్నదే

  నేను మాటల్లో చెబుతున్నాను

  ‘మాటల జ్ఞానం ‘  — అంటే

  నిశ్శబ్ద జ్ఞానం యొక్క క్రీనీడయే కదా!

  మీ ఆలోచనలునా మాటలు —

  మన  నిన్నటి‘  జ్ఞాపకాల అలల

  దస్తావేజులే కదా!

  ఇంకా,

  భూమికి తన గురించి జ్ఞానం,

  మన గురించి జ్ఞానం —

  లేని గతకాలమే కాదా?

  గందరగోళంలో అవని ఆకృతి

  సంతరించుకునే రాత్రులే కదా

  జ్ఞానులు, తమ జ్ఞానం

  మీకివ్వటానికి మీ వద్దకు వచ్చారు

  నేను — మీ జ్ఞానాన్ని పొందేందుకు వచ్చాను :

  చూడండి  — జ్ఞానానికన్నా

  ఉన్నతమైన దాన్ని నేను కనుగొన్నాను.

  అది — నిత్యం తనను తాను వృద్ధి చేసుకునే

                    ‘ఆత్మ జ్వాల

  మీరేమో,

  దాని విస్తృతిని అశ్రద్ధ చేస్తూ

  వాడిపోయే కాలం గురించి విలపిస్తుంటారు!

  శరీరాల్లో జీవితాన్వేషణ చేసే మీ జీవితం

  సమాధుల గురించి భయపడుతుంది!

  ఇచట సమాధులు లేవు —

  ఈ పర్వతాలు, ఈ  మైదానాలు

  మీ ఊయలలుమీ సోపానాలు .

  మీ పెద్దలను ఖననం చేసిన

  మైదానాల గుండా మీరు వెళ్లి చూస్తే —

  మీరు, మీ పిల్లలు గుంపుగా

  నాట్యం  చేస్తూ ఉండటం చూస్తారు!

  నిజానికి, మీకు తెలియకుండానే

  మీరు ఆనందిస్తుంటారు!

  ఇంతకు పూర్వం మీ వద్దకు

  చాలామంది వచ్చి

  మీకు విశ్వాసం కలిగేట్లు

  బంగారు వాగ్దానాలు చేసి ఉండ వచ్చు!

 వారికి మీరు సంపదలు, అధికారం,

  గౌరవాన్ని పంచి ఉండవచ్చు

  నేను మీకు ఏ వాగ్దానమూ చేయలేదు

  కానీ మీరు నా ఎడల చాలా ఔదార్యం చూపారు!

  నా జీవితానికి ఒక లోతైన

  జ్ఞాన తృష్ణను కలగజేశారు!

  తన లక్ష్యాలన్నీ ఎండిన పెదవులయినప్పుడు–

   జీవితమంతా ఊరే జల అయితే —

   ఆ మనిషికి అంతకంటే

   విలువైన బహుమతి ఏముంటుంది ?!

  దీనిలోనే నా గౌరవం, నా పురస్కారం ఉన్నాయి,–

  నేను ఊరే జల వద్దకు దాహార్తితో పోయినా

  ఆ జీవన ఊట కూడా నాకు దాహార్తితో కనిపిస్తుంది!

  నేను దాన్ని తాగితే అది నన్ను తాగుతుంది

   బహుమతులు అందుకుంటానికి

  ఇతను గర్విష్టి‘  ‘అతి సిగ్గరి

  అని మీలో కొందరు  అనుకొని ఉండవచ్చు

  నేను జీతం అందుకోలేనంత గర్విష్టినే

  కానీ బహుమతులు అందుకుంటాను!

  మీతో భుజించాలని మీరు కాంక్షించినా

  నేను కొండలలో దొరికిన బెర్రీ పళ్ళనే తిన్నాను

  మీరు నాకు ఆనందంగా

  ఆశ్రయమిస్తారని తెలిసినా

  దేవాలయంలోనే  పండుకున్నాను

  మీ ప్రేమలే

  నా దివారాత్రాలను అమృతమయం

  చేశాయి కాదా!?

  నా నిద్రను దార్శనికతతో

  చుట్టుకునేట్లు చేశాయి కాదా

  ఇందుకే  —  నేను ముఖ్యంగా

  మిమ్ములను ఆశీర్వదిస్తాను!

  మీరు చాలా ఇస్తారు

  మీరు ఇచ్చేది మీకు తెలియదు!

  నిజానికి,

  దయాగుణం తనను తాను

  అద్దంలో వీక్షించుకుంటే

   రాయిగా మారిపోతుంది!

  ఒక మంచి పని తనను తాను

  గొప్పగా పొగుడుకుంటే

  శాపానికి తల్లీ, తండ్రీ అవుతుంది

  మీలో కొందరు, నన్ను

  “దూరంగా ఉంటాడు

  తన ఏకాంతంతో తాను తాగుతుంటాడు”

  ఇంకా మీరిలా అన్నారు,

  “వృక్షాలతో సమావేశాలు జరుపుతాడు

   కానీ మనుషులతో మాట్లాడడు”

  “పర్వత శిఖరాగ్రాలపై కూర్చుని

   క్రిందకు నగరంపై చూపుసారిస్తాడు”

   నిజమే, నేను కొండలపైకి ఎక్కాను

   మారుమూలల్లో నడిచాను

  బహు దూరం నుండీ, ఎత్తుల నుండీ గాక

  మిమ్ములను ఎలా చూడగలిగే వాడిని?

  ఎవరైనా దూరంగా ఉంటే తప్ప

  దగ్గర ఎట్లా అవ్వగలరు?

  మీలో మరికొందరు

  (మాటల్లో కాకపోయినా)

  నా గురించి ఇలా అనుకుంటారు

  “అపరిచితుడా!

  చేరలేని ఎత్తులను ప్రేమించేవాడా!

  గ్రద్దలు గూళ్ళు కట్టుకునే

  శిఖరాగ్రాలలో ఎందుకు నివసిస్తావు?

  “దుర్లభమైనది కోరుకుంటావెందులకు?

  ఏ తుఫానులను నీ వలలో బంధించాలనుకుంటావు?

  “ఏ ఆవిరి పక్షులని ఆకాశంలో వేటాడుతావు?

  “వచ్చి మాలో ఒకరిగా ఉండు

  “దిగివచ్చి, మా రొట్టెతో నీ క్షుద్బాధను శాంతింపజేయి

   “మా మద్యంతో నీ దాహం తీర్చుకో!”

  వారి ఆత్మ ఏకాంతంలో వారిట్లా అనుకునేవారు.

  కానీ వారి ఆత్మ ఏకాంతత ఇంకా లోతుగా ఉంటే —

 మీ సుఖదుఃఖాల రహస్యాన్ని

 అన్వేషిస్తున్నానని తెలుసుకునేవారు!

 ఆకాశంలో తిరిగే మీలోని

 మహా వ్యక్తిత్వాలనే  నేను వేటాడాను!

 కానీ, వేటగాడు కూడా వేటకు గురయ్యేవాడే!

 నా విల్లు నుండి వదిలిన చాలా బాణాలు

 తిరిగి వచ్చి నా వక్షానికే తగిలాయి!

 ఎగిరేవాడే భూమిపై పాకే లత కూడా;

 ఎందుకంటే,   సూర్యుని వెలుతురులో

 నా రెక్కలు చాచి ఉన్నప్పుడు

 వాటి నీడ భూమిపై

 తాబేలులా కనబడుతుంది!

 నేనే విశ్వాసిని

  నేనే సందేహపరుణ్ణి;

 ఎందుకంటే,

 — మీ మీద గొప్ప నమ్మకం ఉంటానికి,

 — మీ గురించి గొప్ప జ్ఞానం కలిగి ఉంటానికి,

 — తరచుగా,

 నా గాయంలో  నేనే వేలు పెట్టి కెలుకుతాను!

 ఈ నమ్మకం, జ్ఞానంతోనే నేనిలా చెప్తాను

 ‘మీరు మీ శరీరాలలో బందీలు కారు

 మీ పొలాలకు, ఇళ్లకు పరిమితం కారు.

 నిజంగా మీరుఅనేది

 పర్వతాలపై ఉంటుంది

 గాలిలో తిరుగుతుంటుంది

 అది వెచ్చదనం కోసం

 ఎండలోకి పాకి రాదు

 రక్షణ కోసం చీకటిలో

 గోతులు తవ్వుకోదు!

 ‘మీరు‘  అనేది

 ఒక స్వేచ్ఛా వ్యక్తిత్వం

 భూమిని చుట్టుకొని ఉన్న ఆత్మ

 ఆకసంలో సంచరిస్తుంది!

 ఈ నా మాటలు అస్పష్టంగా ఉంటే

 అలాగే ఉండనీయండి!

 అస్పష్టత, మబ్బు వలే ఉండటం — అనేవి

 అన్నింటికీ ప్రారంభం గాని

 అంతం కాదు!

 నన్ను మీరు ఆరంభంగా

 గుర్తుంచుకుంటే సంతోషిస్తాను!

 ప్రాణం — జీవించేది, రూపం దాల్చేది

 పొగ మంచు లోనే కాని స్ఫటికలో కాదు

 నశించిపోయే పొగ మంచు — స్ఫటిక

 అవుతుందని ఎంతమందికి తెలుసును?

 నన్ను జ్ఞప్తికి తెచ్చుకున్నపుడు

 ఈ విషయాలు గుర్తు చేసుకోండి:

 మీలో — దుర్భలమైనవి, చికాకు పరిచేవి

 అనుకున్న విషయాలే —

 మీకు శక్తివంతమైన,

 నిర్ణయాత్మకమైన విషయాలు అవుతాయి!

 మీ ఎముకల నిర్మాణాన్ని నిటారుగా,

 గట్టిగా నిలబెట్టేది

 మీ శ్వాస కాదా?

 మీలో ఎవరూ జ్ఞప్తికి ఉంచుకోని

 మీ కలలే కదా — ఈ నగర నిర్మాణానికీ,

 అది ఒక ఆకృతి సంతరించుకోవడానికి

 — కారణభూతమైంది!

 మీరు ఆ శ్వాస కెరటాలను

 చూడగలిగితే —

 మిగిలినవి చూడటం మానేస్తారు

 మీ స్వప్నాల గుసగుసలని వినగలిగితే

 మీరింకే శబ్దమూ వినరు!

 కానీ మీరు చూడకపోయినా,

 వినకపోయినా — ఫరవాలేదు!

 మీ కళ్ళను కప్పిన ముసుగుతెరలను

 అవి నేసిన– చేతులే తొలగిస్తాయి!

 మీ చెవులను మూసివేసిన మట్టిని

 వాటిని పిసికిన వేళ్ళే తొలగిస్తాయి

 అప్పుడు — మీరు చూస్తారు,

 వినగలుగుతారు.

 అయినా గాని,

 అంధులైనందుకు నిరసన వ్యక్తం చేయరు

 బధిరులైనందుకు విచారించరు

 ఎందుకంటే,

 ఆరోజే మీరు అన్నింటిలో నిక్షిప్తమై ఉన్న

 రహస్య ఉద్దేశాన్ని తెలుసుకుంటారు!

 వెలుతురును ఆశీర్వదించినట్లే

 చీకటిని కూడా ఆశీర్వదించగలరు.

 ఇవన్నీ చెప్పిన తర్వాత —

 ఆయన తన చుట్టూ చూసుకున్నాడు

 ఓడ  కెప్టెన్ చుక్కాని వద్ద నిలబడి

 తెరచాపల వైపు చూస్తూ,

 ప్రయాణ దూరాన్ని అంచనా వేసుకుంటున్నాడు.

 ఆల్ ముస్తఫా ఇలా అన్నాడు :

 “కెప్టెన్ కొంచెం ఓపిక పట్టు.”

 గాలి వీస్తోంది

 తెరచాపలు ఊగుతున్నాయి

 చుక్కాని దారి చూపమంటోంది;

 అయినా,

 కెప్టెన్ నా మౌనభంగం కోసం

 ఎదురు చూస్తున్నాడు.

 సాగర ప్రార్థనాగీతాలు వినిఉన్న

 నావికులు నా పలుకులను

 కూడా, శ్రద్ధగా విన్నారు.

 ఇంక వారు వేచి ఉండలేరు.

 నేను సిద్ధంగా ఉన్నాను!

 ప్రవాహం సాగరాన్ని చేరింది.

 మరోసారి సాగరమాత

 తన బిడ్డను ఎదకు హత్తుకుంది!

 ఆర్ఫాలెస్ ప్రజలారా!

 ఇదే మీకు నా వీడ్కోలు

 ఈ దినం ముగిసింది

 తన రేపటిపై నీటి కలువ

 ముకుళించినట్లుగా

 ఈరోజు ముగుస్తోంది!

 ఇచట, మనం పొందినది

 ఉంచేసుకుందాం!

 అది చాలక పోతే

 కలిసి మరలా వద్దాం

 చేతులు జాపి, ఇచ్చేవానిని అడుగుదాం

 నేను మరలా వస్తానని మరువకండి

 కొద్దిసేపటిలో, నా ఆశలు మరో శరీరం కోసం

 అన్నీ సమకూర్చుకుంటాయి!

 కొంతసేపయిన తర్వాత,

 గాలిలో విశ్రాంతి తీసుకున్న పిమ్మట,

 మరో తల్లి నన్ను గర్భం దాలుస్తుంది!

 మీకూ, ఇక్కడ మీతో గడిచిన

 నా యవ్వనానికీ – వీడ్కోలు!

 నిన్ననే మనం కలలో కలిసాం!

 నా ఒంటరితనంలో

 మీరు నాకు గీతాలు వినిపించి

 ఉత్తేజపరచారు!

 మీ ఆశల మోసులతో నేను మీకు

 ఆకసంలో గోపురం కట్టాను.

 ఇప్పుడిక;;;;;, మన నిద్ర అయిపోయింది.

 స్వప్నాలు లేవు

 ఉదయ సంధ్య పరిసమాప్తి అయింది

 అపర్ణాహం వచ్చేసింది.

 మగత తీరి, పూర్తి పగలు అయింది.

 మనం విడిపోవాలి.

 జ్ఞాపకాల మసక వెలుతురులో

 మరోసారి మనం

 కలిసి మాట్లాడుకుందాం.

 మీరు నా కోసం

 ఓ అనంత గీతం పాడాలి!

 మరో స్వప్నంలో

 మన హస్తాలు కలిస్తే

 నింగిలో మరో గోపురం కడదాం!

 ఇలా చెబుతూ,

 ఆయన నావికులకు సంజ్ఞ చేశాడు!

 చుక్కాని సరిచేసి,

  ఓడ తాళ్ళు వదులు చేసి,

  లంగరెత్తారు.

  తూర్పు వైపు పయనం సాగించారు!

 ఒక మహా ఆర్తనాదం

 ప్రజల నుండి వినిపించింది

 అందరి వేదన కలగలిసి

 ఒకే హృదయం నుండి

 వెలువడినట్లుగా ఉంది!

 అది సాయం సంధ్య పై పరచుకుని

 మహా నాదంలా

 సాగరం పైకి విస్తరించింది.

 ఆల్ మిత్ర ఒక్కతే — మౌనం వహించింది!

 పొగ మంచులో అదృశ్యమయ్యే వరకు

 ఓడను చూస్తూ ఉంది!

 ప్రజలందరూ వెళ్లిపోయిన తర్వాత కూడా

 ఆమె సముద్రపు గోడపై ఒంటరిగా నిలబడి ఉంది.

మనసులోఆల్ ముస్తఫా చెప్పిన

 ఈ మాటలు నెమరేసుకుంది :

 “కొంతకాలం తర్వాత

  గాలిలో విశ్రాంతి తీసుకున్న పిదప

  ఇంకో తల్లి నన్ను గర్భం ధరిస్తుంది.”

Also read: మరో సంచారి

Also read: నిన్నా, నేడూ, రేపూ

Also read: మార్పిడి

Also read: ప్రవక్త

Also read: మతం

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles