- అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఆమెను మహానటిగా నిలబెట్టాయి
- ఎవరికీ తలవంచని మనస్తత్వం, అందరినీ సమానంగా చూసే సమదృష్టి
సత్యభామ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఊహాచిత్రాలు గీసుకోవడం తప్ప ఏమీ ఎరగం. ఆత్మగౌరవం, అమాయకత్వం, అందం కలబోసుకున్నట్లు కనిపించే ఆ పాత్రలో జమున ఒదిగినట్లుగా ఎవ్వరూ ఒదగలేరు. అమాయకత్వం సంగతి అట్లుంచగా,ఆత్మగౌరవం, అందం సరిజోడుగా ఆమెలోనూ ఉన్నాయి. అందుకే ఆ పాత్ర అంతగా పండింది. పండటికాపురంలోని రాణీ మాలినీదేవి పాత్రలో పట్టుదల, మొండితనం జట్టుగా ఉంటాయి. అవి జమునలోనూ ఉన్నాయని చెప్పవచ్చు. ఆమె సినిమా జీవితంలో జరిగిన సంఘటనలు, వాటికి ఆమె ప్రతిస్పందించినతీరు వీటన్నిటిని వివరిస్తాయి. ఒకదశలో.. మేరునగధీరులైన ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ను కూడా ఆమె లెక్కచెయ్యలేదు. ఫైర్ బ్రాండ్ జయలలితను కూడా ఒక సందర్భంలో ఖాతరు చెయ్యలేదు. అటువంటి మనస్తత్వం కలిగివుండి కూడా చిత్రసీమలో మహారాణిలా వెలుగొందడం ఆమెకే చెల్లింది. (ఇక్కడ భానుమతిని మినహాయిద్దాం) ఆమె తీరు వేరు. జమున ‘రాణిం’పు వెనకాల ఆమె అందం, ప్రతిభ, వరుస విజయాలు కవచకుండలాలుగా పనిచేశాయి.
హంపీ సుందరి
ఈ హంపీ సుందరి, గుంటూరు పిల్ల గోదావరి యాసలో మాట్లాడి కూడా మెప్పించింది. జమునకు కన్నడ-తెలుగు రెండు మూలాలు ఉన్నాయి. హంపీలో పుట్టారు, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. తొలినాళ్లలో ఆమెను హంపీసుందరి అని కూడా అనేవారు. దుగ్గిరాలలో పెరగడం వల్ల గుంటూరు కారం కూడా చేరింది. జమున ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హీరోయిన్ గా రాణించారు. దక్షిణాదిని ఏలారు. సత్యభామ,రాణి మాలినీదేవి, మూగమనసులు సినిమాలో గౌరిగా గోదారి గట్టుంది… అని ఆడిపాడే అమాయక పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నది చరిత్ర విదితం. ఆమెకు బాగా ఇష్టమైన పాత్రలు కూడా ఇవేనని ఆమె అనేకసార్లు చెప్పారు కూడా. మూవీ మొఘల్ గా చెప్పుకొనే డి రామానాయుడు ఎన్నో సినిమాలు నిర్మించారు. తన సినిమాల్లో ఎందరో హీరోయిన్లు పనిచేశారు. అందరిలో తనకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగితే జమున అని చెప్పారు. గొప్ప అందగత్తెగా, శుభనేత్రిగా ఆమెను అభివర్ణించారు. గుడిపూడి శ్రీహరి వంటి దిగ్గజ పాత్రికేయుడి దృష్టిలో హీరోయిన్ గా జమున స్థానం ప్రథమం. జమున పుట్టు కళాకారిణి. ఆటలు, పాటలు, నటన సహజసిద్ధంగానే అబ్బాయి. అవి సాధనతో మరింత రూపుదిద్దుకున్నాయి. క్రమశిక్షణ, ఆహార నియమాలు, యోగాభ్యాసం ఆమెను ఆరోగ్యంగా నిలబెట్టాయి. ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల తల వణుకుడు ఇబ్బంది వచ్చింది. అది తప్ప ఆమెకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. సహజంగా వయసు రీత్యా వచ్చినవాటిని నియంత్రించుకుంటూ వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా గెలిచి విజయాన్ని వరింపజేసుకున్నారు. సుప్రసిద్ధమైన ‘గుండమ్మకథ’ సినిమాలోని ‘సరోజ’ పాత్ర ఆమెతోనే వేయించాలని ఆమె కోసం మూడేళ్లు ఎదురు చూశారు.
చిత్రజగత్ విజేత
ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ తో ఆమెకు వచ్చిన విభేదాలే దానికి కారణం. నాగిరెడ్డి, చక్రపాణి కలుగజేసుకొని అక్కినేని, జమునతో సమావేశం ఏర్పాటుచేసి రాజీ కుదిర్చారు. అలా గుండమ్మకథ వారందరినీ మళ్ళీ కలిపింది. జమున అంటే యమున. అది గొప్ప నది. జమున గొప్ప నటి. ఆ జీవనదిలా జమున పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో, హృదయాల్లో, కళ్ళల్లో ప్రవహిస్తూనే ఉంటాయి. 87ఏళ్ల నిండైన జీవితాన్ని, నటజీవితాన్ని పండించుకున్న జమున చిత్ర జగత్ విజేత. ఆ దివ్యాత్మకు జోతలు సమర్పిద్దాం.
Also read: తెలుగువారికి భారతరత్న దక్కదా?