Sunday, December 22, 2024

కరవుకాలం దాపురిస్తోందా?

  • భూతాపం పెరిగితే ప్రమాదం
  • ప్రకృతిని గౌవరిస్తేనే అది మన ప్రాణాలు కాపాడుతంది

భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది. రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత దేశం లోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.  భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి. ముఖ్యంగా  వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న.

Also read: ‘సుకవి’ జాషువా

శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా మనం పట్టించుకోవడం లేదు

భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ.. అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి. ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి. వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా 20 వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది. ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ  భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి, ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.

Also read: భద్రతామండలిలో భారత్ కు స్థానం దక్కేనా?

భూమి వేడెక్కిపోవడం అనర్థదాయకం

ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి. సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం, అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది. భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి నిర్వహించిన తాజా సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేళ్ళలో తగ్గకపోగా మరింత పెరిగింది.

Also read: మన రాజనీతి, యుద్ధనీతి మనవి

వనరుల వినియోగ పద్ధతితోనే సమస్య

భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని ‘గ్లోబల్ డిమ్మింగ్ ‘ అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి. ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో, అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం.పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి. కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు. భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి. వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది.

Also read: రక్తపోటు నియంత్రణలో భారత్ మేటి!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles