హైదరాబాద్: కోనేరు ఆంజనేయులుది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్ గ్రామం. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో స్పెషల్ పార్టీలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ పని చేస్తున్నారు. 2018 బ్యాచ్ ఆయనది.
ఈ నెల 18వ తేదీన విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద మన్నెగూడెం వైపు వేగంగా వెళ్తున్న బోలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు, శరీరానికి బలమైన గాయాలయ్యి అపస్మారక స్థితికి చెరుకున్నారు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ఆంజనేయులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులు ఆంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు శనివారం (నవంబర్ 21) ఉదయం నిర్ధారించారు.
ఆంజనేయులు కుటుంబసభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పరామర్శించారు. ఆంజనేయులు శరీరంలోని అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవల్సిందిగా వారిని సీపీ కోరారు. అందుకు వారు అంగీకరించారు.
కానిస్టేబుల్ కొనేరు ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కళ్లు తదితర ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను సైబరాబాద్ పోలీసుల ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ‘మరో జన్మ’ సహకారంతో ప్రభుత్వరంగ సంస్థ ‘జీవన్ దాన్’కు అప్పగించారు. తమ కుటుంబ సభ్యుడు ఇక లేరనే బాధలో ఉన్నప్పటికీ మరో ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను సీపీ అభినందించారు. కానిస్టేబుల్ కొనేరు ఆంజనేయులు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్‌కు తరలించారు. బాబాపూర్‌లో అతడి మృతదేహం వద్ద నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాడె కూడా మోశారు. మృతుడి కుటుంబాన్ని పోలీస్ శాఖాపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సైబరాబాద్ పోలీసుల ‘మరో జన్మ’
అవయవదానం మీద ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గాన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రెండేళ్ల కిందట సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘మరో జన్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం చేస్తే ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారవుతారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ సమయంలో అవయవ దానం కోసం సమాచారం ఇచ్చేందుకు ల్యాండ్ లైన్ నంబర్ 040 2348 9495, 9603944026, 88850 60093 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.