మనిషికి మనిషిపై నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది.
నిజాయితీని నిగ్గు తేల్చడానికి,
నిఖార్సయిన సాక్ష్యం అవసరం అయ్యింది.
పరస్పర విశ్వాసం నశించిన ప్రపంచంలో
రాజదండాలు రాజ్యాలు పాలించాయి,
రాజముద్రలు మనిషి గుర్తులు చెప్పాయి,
లిఖిత చట్టాలు సమాజాన్ని నేడు
కట్టుబాటు పట్టాలపై నడిపిస్తున్నాయి.
నోటి మాటకు విలువ మాసిపోయి
నోటు పైని చిక్కని చేవ్రాలు
విముఖ సమ్మతికి రాత ఊతం ఇచ్చింది.
మంచి నడత నలిగిపోయి
చుక్కల గీతల పై చేసిన తడబాటు సంతకం
అతన్ని భవిష్యత్తుకు బందీ చేస్తోంది.
శ్రుతం విస్మృతి పవనాలకు చిక్కి
గతం లోకి జారుకొంటుంది.
లిఖితం మరి ప్రతిజ్ఞాత రజ్జువు తో బంధించి
భవిష్యత్తు లోనికి ఈడ్చుకువెళుతుంది.
అందుకే విదిత వాగ్దానాలు నిర్వీర్యమయినాయి…
కలానికి కండ పట్టింది.
కాలం కాగితం పై వొలికించిన వ్యక్తాక్షరం
వ్యవహారానికి ఆలంబన అయ్యింది.
రాత కోతల జాలికా జాలం లో చిక్కి మనిషి
శుష్క తంతుల మార్గాల లో
విధిలేక అడుగులు వేస్తున్నాడు.
పరమాత్మ మాత్రం ఏమి చేయగలడు?
స్తోత్రాలలో స్వయంభూ అని రాయించుకున్నాడు.
Also read: గొర్రె
Also read: యుద్ధము… శాంతి
Also read: ఎరుపు-తెలుపు
Also read: వర్షం
Also read: అమ్మ