Sunday, December 22, 2024

విరాట్ ను వెంటాడుతున్న వైఫల్యాలు

  • కెప్టెన్ గా 8వసారి డకౌట్
  • టెస్టు క్రికెట్లో కొహ్లీ 12వ డకౌట్
  • ధోనీ సరసన విరాట్ కొహ్లీ

విరాట్ కొహ్లీ ఆధునిక క్రికెట్లో పరుగుల యంత్రం. భారత క్రికెట్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు అసలు సిసలు వారసుడు. 32 సంవత్సరాల వయసుకే 91 టెస్టులు ఆడి 27 శతకాలు, 29 అర్థశతకాలు, 7 వేల 490 పరుగులు సాధించిన ఘనుడు. 52.38 సగటు నమోదు చేసినా గత 14 మాసాలుగా కొహ్లీని వైఫల్యం వెంటాడుతోంది. మూడంకెల స్కోరు వెక్కిరిస్తోంది. ప్రస్తుత టెస్టు సిరీస్ లో కొహ్లీ రెండోసారి డకౌట్ గా వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది.

టెస్టు క్రికెట్లో 12వ డకౌట్:

క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్లకు సైతం వైఫల్యాల చరిత్ర ఉంది. దానికి నవతరం క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కొహ్లీ సైతం ఏమాత్రం మినహాయింపు లేదు. గత దశాబ్దకాలంగా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్న విరాట్ కొహ్లీని టెస్టు శతకం గత 14 మాసాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ దాగుడుమూతలు ఆడుతూ వస్తోంది. కొహ్లీ అంటే సలామ్ చేసి గులాముగా మారిపోయే మూడంకెల స్కోర్లు 2019 డే-నైట్ టెస్టు నుంచి పో..పొమ్మంటున్నాయి. రానంటే రానంటున్నాయి. ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో సైతం విరాట్ పరుగులేవీ చేయకుండానే అవుటయ్యాడు. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన కొహ్లీ ఆచితూచి ఆడుతూ ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా చివరకు పేస్ బౌలర్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో..ఓ కళ్లు చెదిరే బంతికి చిక్కాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ పట్టిన క్యాచ్ తో డకౌటయ్యాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో కొహ్లీ డకౌట్ కావడం ఇది 12వసారి. అంతేకాదు భారత కెప్టెన్ గా తన 60వ టెస్టు ఆడుతున్న కొహ్లీ ఖాతా తెరువకుండానే ఎనిమిదోసారి అవుట్ కావడం విశేషం.

Also Read: సిరాజ్ తో బెన్ స్టోక్స్ లడాయి

చెన్నైలో మోయిన్- మొతేరాలో బెన్ :

ప్రస్తుత సిరీస్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో కొహ్లీని ఇంగ్లండ్ స్పిన్నర్ మోయిన్ అలీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత సిరీస్ లోని ఆఖరిటెస్టుగా జరుగుతున్న మ్యాచ్ తొలిఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ బెన్ స్టోక్స్ అవుట్ చేయగలిగాడు. 2014 తర్వాత తొలిసారిగా పరుగులేవీ చేయకుండానే రెండుసార్లు అవుట్ కావడం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లికి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డ‌కౌట్‌. గ‌తంలో ధోనీ సైతం కెప్టెన్‌గా  ఎనిమిదిసార్లే డ‌కౌట‌య్యాడు. ఇప్పుడు కోహ్లి డకౌట్ కావడం ద్వారా ధోనీ సరసన నిలిచాడు. అత్యధికంగా 60 టెస్టుల్లో నాయకత్వం వహించడం ద్వారా ధోనీ పేరుతో ఉన్న రికార్డును స‌మం చేసిన కోహ్లి చివరకు డకౌట్లలోనూ సమఉజ్జీగా నిలిచాడు. పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కంటే కూడా కోహ్లి ఎక్కువ‌సార్లు డ‌కౌటైన ఆటగాడిగా నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డ‌కౌట్ కాగా విరాట్ 12సార్లు డ‌కౌట‌య్యాడు. టెస్టుల్లో ఇషాంత్ శ‌ర్మ పేరుతోనే అత్యధికంగా 32 డ‌కౌట్ల‌ రికార్డు ఉంది. టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ డకౌట్ కావడం ఇదే మొదటిసారికాదు. ప్రస్తుత టెస్టుకు ముందు వరకూ పదిసార్లు డకౌట్ గా వెనుదిరిగిన రికార్డు కొహ్లీకి ఉంది.

కొహ్లీకి కొరుకుడు పడని బౌలర్లు :

కొహ్లీని డకౌట్ చేసిన బౌలర్లలో కరీబియన్ పేసర్  రవి రాంపాల్‌, కంగారూ సీమర్ బెన్‌ హిల్పెనాస్‌, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లియాన్‌ ఫ్లంకెట్‌, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌, బెన్ స్టోక్స్, కంగారూ ఫాస్ట్ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌, సురంగ లక్మల్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, పాట్‌ కమిన్స్‌, కీమర్‌ రోచ్‌, అబి జావెద్‌లు ఉన్నారు. వీరందరూ ఫాస్ట్‌ బౌలర్లే కావడం విశేషం. అయితే కోహ్లిని డకౌట్‌ చేసిన ఏకైక స్పిన్నర్ మోయిన్ అలీ మాత్రమే.

Also Read: కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ

మూడు ఫార్మాట్లలోనూ 27 డకౌట్లు:

తన కెరియర్ లో ప్రస్తుత చెన్నై మ్యాచ్ వరకూ 91 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ-20 మ్యాచ్ లు ఆడి 70 శతకాలు, 19వేలకు పైగా పరుగులు సాధించిన కోహ్లికి మొత్తం 27 డకౌట్లున్నాయి. భారత టెస్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధికసార్లు డకౌటైన రెండో ఆటగాడిగా ధోనీ పేరుతో ఉన్న 8 అవుట్ల రికార్డును కోహ్లి సమం చేశాడు. భారత కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ అత్యధికంగా 13 డకౌట్ల రికార్డు ను మూటగట్టుకొన్నాడు. గత 15 మాసాలుగా మూడంకెల స్కోరు లేక వెలవెలబోతున్న విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ లోని అహ్మదాబాద్ ఆఖరిటెస్టు తొలి ఇన్నింగ్స్ వరకూ 27సార్లు డకౌట్లు అయ్యాడు. ప్రస్తుత సిరీస్ లో కొహ్లీ అత్యధిక స్కోరు 72 పరుగులు మాత్రమే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles