( ‘THE FIELD OF ZADD’ FROM’ THE WANDERER ‘ BY KHALIL GIBRAN )
తెలుగు సేత : డా. సి.బి. చంద్ర మోహన్
26. సంచారి తత్త్వాలు
——————————
జాద్ నగరానికి వెళ్లే మార్గంలో ఒక బాటసారి — ఆ దగ్గర గ్రామంలో నివసించే మనిషిని కలిసి, దూరంగా ఉన్న మైదానాన్ని వేలుతో చూపెడుతూ, ఆ మనిషిని ఇలా అడిగాడు ” ఆలం చక్రవర్తి తన శత్రువులను జయించిన యుధ్ధభూమి ఇదే కదా?”
ఆ మనిషి ” అది ఎప్పుడూ రణ భూమిగా లేదు. ఆ మైదానంలో ఒకానొకప్పుడు జాద్ నగరం ఉండేది. అది కాలి బూడిదై పోయింది. ఇప్పుడు ఆ మైదానం బాగుంది కదా!”
ఆ తరువాత బాటసారి, ఆ మనిషి విడిగా వెళ్లి పోయారు. ఒక అర మైలు లోపునే బాటసారి ఇంకో మనిషిని కలిసాడు. ఆ మైదానం వైపు చూపిస్తూ ” అక్కడేగా గొప్పదైన జాద్ నగరం ఒకప్పుడు ఉండేది? ” అని అడిగాడు.
ఆ మనిషి ” అక్కడ ఎప్పుడూ నగరమనేది లేదు. కానీ ఒకానొకప్పుడు అక్కడ ఒక పీఠం ఉండేది. దక్షిణ దేశపు ప్రజలచే అది నాశనం చేయబడింది .” అన్నాడు.
కొంచెం ముందు, అదే జాద్ నగర దారిలో ఆ బాటసారి ఇంకో మనిషిని కలిసాడు. ఆ మనిషికి మరలా ఆ మైదానం చూపిస్తూ ఇలా అడిగాడు ” ఆ మైదానంలో ఒకానొకప్పుడు ఒక గొప్ప పీఠం ఉండేదనే మాట నిజమా, కాదా?”
ఆ మనిషి ఇలా జవాబిచ్చాడు ” ఈ చుట్టు పక్కల ఎప్పుడూ పీఠమనేది లేదు. కాని ఒకానొకప్పుడు ఓ పెద్ద ఉల్క ఆ మైదానంపై పడిందని మా తాత, ముత్తాతలు చెప్పేవారు.”
ఆ బాటసారి మనసులో ఆశ్చర్య పోతూ ముందుకు సాగాడు. అక్కడ బాగా వయసున్న ఒక పెద్దాయనను కలిసి, అతనికి నమస్కరిస్తూ ఇలా అడిగాడు ” సార్! ఈ చుట్టు పక్కల నివసించే ముగ్గురిని ఈ దారిలో కలిశాను. వారందరినీ ఆ మైదానం గురించి వాకబు చేసాను. కానీ వారిలో ప్రతి ఒక్కరూ — మిగిలిన వారు చెప్పింది త్రోసిపుచ్చారు. ప్రతి ఒక్కరూ, మిగతా వారు చెప్పని కొత్త కధను నాకు వినిపించారు.”
అప్పుడా పెద్ద మనిషి తలెత్తి ఇలా జవాబిచ్చాడు ” స్నేహితుడా! ప్రతి ఒక్కరూ నీకు చెప్పింది వాస్తవమే. కానీ, వాస్తవాలను క్రోడీకరించి , వాటినుండి నిజాల్ని (సత్యాల్ని) రాబట్టటం కొంత మంది మాత్రమే చేయగలరు.”
Also read: నిండు చంద్రుడు
Also read: బోధన
Also read: ఎర్ర మట్టి
Also read: వంతెన నిర్మాతలు
Also read: స్వీయ జ్ఞానం