• ఫాక్ట్ చెక్ వేదికను ప్రారంభించిన సీఎం జగన్
• అధికారులకు కీలక ఆదేశాలు
• విషప్రచారం చేస్తే కఠిన చర్యలు
ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చి, అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చెల్లదని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రతిపక్షాలు వీలు చిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాలలో జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల హిందూ దేవాలయాల దాడులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తుతం జరిగినట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేయడంతో సీఎం జగన్ ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావించారు.
Also Read: కైకలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
ఫాక్ట్ చెక్ ను ప్రారంభించిన సీఎం జగన్:
సామాజిక మాధ్యమాలలో దురుద్దేశంతో చేస్తున్న ప్రచారానికి తెరదించేందుకు జగన్ సర్కార్ ఏపీ ఫాక్ట్ చెక్ వేదికను ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న విషపూరిత ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలలో ముఖ్యంగా ఫేస్ బుక్ ట్విటర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వంపై దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో వాటి ఫలాలు పేదలకు అందడంలో విఫలమవుతున్నాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. జరుగుతున్న అసత్య ప్రచారం ఎలా తప్పో సాక్షాధారాలతో ఎపీ ఫ్యాక్ట్ చెక్ తెలుపుతుందని సీఎం జగన్ అన్నారు. అసలు వాస్తవానికి, జరుగుతున్న అసత్య ప్రచారానికి మధ్య తేడాను ఫాక్ట్ చెక్ ద్వారా తెలుసుకోవచ్చని సీఎం అన్నారు.
Also Read: విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ
అసత్యప్రచారానికి అరదండాలు:
ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసిన వారిపై అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో విషప్రచారం మూలాలు మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక వ్యక్తి ప్రతిష్ఠను, ఒక వ్యవస్థ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు జగన్.
విషప్రచారానికి ముగింపు:
అసత్య ప్రచారాలతో వ్యవస్థలను తప్పుదోవపట్టించే విధంగా వ్యవహరించొద్దని సీఎం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలకు ముగింపు పలికేందుకే ఫాక్ట్ చెక్ వెబ్ సైట్ ను ప్రారంభించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీస్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: ఎన్నికల సంఘంపై టీడీపీ, వైసీపీల అసహనం