Wednesday, January 22, 2025

ఆయన పేరలింగం కాదు, ప్రేరణ లింగం

అద్వితీయ భావోద్యమ తరంగం !

ఆయనే దేవగుప్తపు పేరలింగం !!

వెనుదీయని హేతువాద తరంగం

 తిరుగులేని భౌతికవాద విహంగం

 మహామానవవాద ఉద్యమ రంగం

ఆయనే , ‘దేవగుప్తపు పేరలింగం‘”

ఆయనో సాధారణ ప్రజా ఉద్యమ చైతన్య కార్యకర్త. కానీ సామాజిక కార్యాచరణలో అసాధారణమైన ఆచరణాత్మక యోధుడు. నలభై ఏళ్ళుగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తూ,  ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదురుకున్న ధీరుడు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలోనూ రెండొందల ఏళ్ళ హేతువాద సాహిత్యంలోనూ సామాన్య వడ్రంగి వృత్తి చేసుకుంటూ అయిదో తరగతి వరకు చదివిన ప్రాథమిక విద్యతో రాజమండ్రి లో జరిగిన ఒక హేతువాద సభ ద్వారా ప్రభావితం అయ్యీ నిఖార్సైన నాస్తికుడు గా జీవిస్తున్న అద్భుతమైన మానవవాది పేరలింగం!

Also read: మహామానవవాద మహత్తర దూత ‘మానవ గీత’

పేరలింగం దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

ఆయన 80 వ పుట్టినరోజు జరుపుకోబోతున్న సందర్భంగా 04 – 09 – 2022 ఆదివారం సాయంత్రం రాజమండ్రిలోని ప్రదీప్ హాస్పిటల్ లో  అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్య ఆద్వర్యంలో తలపెట్టిన అభినందన కార్యక్రమం నిజానికది  వ్యక్తి గా ఆయన్ని గౌరవించుకోవడం కాదు, మొత్తం కుదేలై ఉన్న భావోద్యమాల పరిస్థితిని ఒక రకంగా సమీక్షించుకునే ప్రయత్నం. పడక్కుర్చీ జీవుల్లా కాకుండా జ్ఞానం సమాజ హితమని నమ్మి ఒక హేతువాద సభకి వెళ్ళి వస్తుంటే ప్రమాదవశాత్తు కాలు విరిగితే ఏ పనీ చేసే వీలు లేదని విచారించకుండా ఈ ఆరేడు సంవత్సరాల్లో అధ్యయనం, శోధనే ధ్యేయంగా శ్రమించి నేటికి పదకొండు పుస్తకాలు రాసి ప్రచురించిన అనితరసాధ్యమైన ప్రజాపక్ష మేధావి మన పేరలింగం!

Also read: ఒకే వ్యక్తి – అనేక జీవితాలు! రాహుల్ సాంకృత్యాయన్ ! !(వ్యాస సంకలనం)

హేతువాద చైతన్యరథం

నిత్య జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా తన సైకిల్ కి ‘హేతువాద చైతన్య రథం’ అని నామకరణం చేసి గోదావరి జిల్లాలలోని మారుమూల గ్రామాల్లో సైతం ముష్కర మూకలు ఎన్ని అవాతరాలు సృష్టించినా కూడా వెరవకుండా సామాన్య ప్రజానీకంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కోసం అహర్నిశలూ అవిశ్రాంత కృషి చేసిన నిజమైన అభ్యుదయ వాది ఆయన. ఆయన్ని సన్మానించుకోవడం అంటే, అది  హేతువాద, నాస్తిక, భౌతికవాద, మానవవాద ఉద్యమాలని సత్కరించు కోవడమేనని నా అభిప్రాయం. అందుకే ఆయన్ని లివింగ్ లెజెండ్ అంటాన్నేను!

సభకు హాజరైన ప్రముఖులు

వెనిగళ్ళ సుబ్బారావు, సి. వి, తాపీ ధర్మారావు, ఆరుద్ర, అంబేద్కర్, ఫూలే, ఏటుకూరి, నార్ల, పింగళి దశరధరామ్ వంటి వారి రచనలతో సైన్సు గ్రంథాలయం స్థాపించడం ఒకెత్తయితే, తాను ప్రచురించిన ప్రతీ పుస్తకంలోనూ ఆ రచనకి ఉపకరించిన ఆధార గ్రంథాల జాబితా ఒకవైపు, ఆ పుస్తకం ప్రచురించడానికి సహకారం అందించిన వారి జాబితా మరోవైపూ పారదర్శకంగా ముద్రించడం మరొకెత్తూ‌. అంతేకాదు, దేవుడు, మహిమలను నిరూపిస్తే లక్షరూపాయలు ఇస్తానంటూ బహిరంగ సవాల్కి సిద్దపడమని ఆశ్చర్య పరచడం ఆయనలోని ధీరత్వానికి తిరుగులేని ప్రతీక. ఆయన భాషతోనూ, భావాలతోనూ మనందరికీ అనేకానేక భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ గత నలభై ఏళ్ళుగా ఎన్నో అడ్డుగోడల్ని దాటుకుంటూ, వైజ్ఞానిక పురోగమనం కోసం  ఆయన చేస్తున్న అక్షర సేద్యానికి జోహారులు అర్పించకుండా ఉండలేం!

కుటుంబ సభ్యులతో పేరలింగం దంపతులు

భావోద్యమకారులు తరలివచ్చిన సందర్భం

అందులో భాగంగా ఆయనకి తలపెట్టిన అభినందన కార్యక్రమానికి కొద్దిమంది వస్తే చాలని కరపత్రం రాసి ప్రచురించడం జరిగింది. కానీ, ఆ కరపత్రం తెలుగు రాష్ట్రాల్ని ఏ స్థాయిలో కదిలించిందంటే ప్రజాకాంక్ష, ప్రజా పత్రిక, ప్రజా శక్తి, నవ తెలంగాణ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ప్రచురించిన వ్యాసాలతో నలువైపుల నుండి భావోద్యమకారులు స్వచ్ఛందంగా కదిలి ఈ కార్యక్రమానికి వచ్చారు. అటు పల్నాడు లోని రొంపిచెర్ల మొదలుకొని ఇటు ఉత్తరాంధ్ర లోని విశాఖపట్నం వరకూ, పశ్చిమ గోదావరి తణుకు, ఏలూరు, జంగారెడ్డి గూడెం మొదలుకొని కోనసీమ జిల్లాలోని రావులపాలెం, అమలాపురం, రామచంద్రాపురం, మండపేట, ఇంకా కాకినాడ జిల్లా పిఠాపురం, కేంద్ర పాలిత ప్రాంతమైన యానం దాకా, ఇంకా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అంతులేని ఇష్టంతో పెద్ద వయసులో కూడా కష్టపడి వచ్చిన వారిని చూసి నిర్వాహకులు నిర్ఘాంతపోతారు. అప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించడం కూడా చాలా కష్టమైంది!

Also read: ఉద్వేగభరితమైన రచన – లేడీ డాక్టర్స్!

వారికి ఇది ఒక చెంపపెట్టు

 పాతిక మంది వస్తే చాలని ఆరంభించిన కార్యక్రమం ఏకంగా డెబ్బై మందికి పైగా ఇరుక్కుని కూర్చోగా, ఇక చోటు లేక మేడ మెట్లమీదా, స్టూళ్ళ మీదా సర్దుకుని కూర్చున్న వాళ్ళూ, స్థలాభావం వల్ల అంతసేపూ మైకు కూడా లేకపోయినా నిలబడి మరీ కార్యక్రమం మొత్తాన్ని వీక్షించి విన్న వాళ్ళందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరలింగం గారి కృషిని చులకన చేసి చూసిన వారందరికీ ఈ సమావేశం ఒక చెంపపెట్టు. కులం, ధనం, హోదా, పరపతి ఏదీ లేకుండా తన వెన్నెముకని నమ్ముకుని మాత్రమే నమ్ముకుని నిబద్ధతతో దీక్షగా పని చేసుకు పోయిన ఒక నిజాయితీ కలిగిన ఉద్యమకారుడికి తెలుగు భావోద్యమ రంగం సగర్వంగా తన అభినందనలు సమర్పిస్తూ  సత్కరించిన సందర్భం ఈ సమావేశం!

పేరలింగం పేరిట తయారు చేసి ఆయనకు బహూకరించిన జ్ఞాపిక

ఎంఎన్ రాయ్ పుస్తకావిష్కరణ

ఇంత అపురూపమైన వేదిక మీద ఈ ఏడాదే శతజయంతి జరుపుకుంటున్న  ఇరువురు  బెంగాల్ భావోద్యమ ధీరులు సత్యజిత్ రే, శిబ్ నారాయణ్ రే లకి  అంకితం ఇస్తూ,  ప్రత్యామ్నాయ సాంస్కృతిక సమాఖ్య ప్రచురించగా విశాఖ మిత్రులు పార్టీరహిత ప్రజాస్వామ్యం సంపాదకులు ప్రేమగా ముద్రించి పంపిన , రాయ్ 135 వ జయంతి సందర్భంగా తీసుకొచ్చిన “మహామానవవాద తత్వవేత్త : మానవేంధ్రనాధ రాయ్” పుస్తకాన్ని మానవవాద యోధుడు పేరలింగం గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఒక అందమైన ఘట్టం. జీవితాన్ని పరులహితం కోసమే ఆదర్శవంతంగా మలుచుకున్న ఆయనకి అనేక ప్రజా సంఘాల బాధ్యులు కలిసి”జీవిత సాఫల్య అభినందన పురస్కారాన్ని” ప్రదానం చేయడం జరిగింది. హాజరైన మిత్రులు అంతా పేరలింగం – కామాక్షమ్మ దంపతులకు, ఇంకా ఆయన కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరి సారధ్యంలో పూలూ, పళ్ళూ, దండలు, బట్టలు, దుశ్శాలువాలు, మొక్కలతో సత్కరించడం జరిగింది!

Also read: సమసమాజమే సోమసుందర్ స్వప్నం!

ఇదీ అసలు విషయం

అది కాదు అసలు విషయం, ఢిల్లీ నుండి పెద్దలు జె. లక్ష్మారెడ్డి గారు ఉదారంగా స్పందించి పంపించిన యాభై వేల రూపాయలు కలుపుకుని సమావేశం మొత్తం అప్పటికప్పుడు కేవలం పెన్షన్ పై ఆధారపడి జీవిస్తూ కూడా భావోద్యమాలకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయనకి అండగా నిలవాలని భావించి స్వచ్ఛందంగా ఆర్థిక సహకారాన్ని బహుమతి రూపంలో అందజేయాలని నిశ్చయించుకుని అక్షరాలా రమారమి డెబ్బై రెండు వేల రూపాయలు (71,500) ఆ దంపతుల చేతికి అందించడం నిజంగా ఈ వయసులో ఆయన చేస్తున్న కృషికి రవంత సాయం చేసినట్లైంది.

ఎంఎన్ రాయ్ పుస్తకావిష్కరణ

ఉద్వేగానికి లోనై గద్గద స్వరంతో…

ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో చాలా మంది ఉపాధ్యాయుల కంటే గొప్పగా లెక్కలేనంత మందికి భావోద్యమ రంగాన్ని స్పూర్తివంతంగా పరిచయం చేసిన పేరలింగం గారు మహామహోపాధ్యాయులని కొద్ది మంది అన్నారు. ఆయన 100వ పుట్టినరోజు కూడా ఇలాగే జరుపుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. హేతువాద లెజెండ్ శీర్షిక తో చదివిన సన్మానపత్రం నుండి ఆయన జీవిత విశేషాలు, నిబద్ధత , ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలూ సభికులు అందర్నీ కదిలించాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం నుండి తేరుకుని వారి భావాలు పంచుకోగా, చివరగా గుండె లోతుల్లో నుండి తన్నుకొస్తున్న భావోద్వేగంతో గద్గద స్వరంతో  స్పందించిన పేరలింగం గారు చెప్పినవి నాలుగు మాటలే అయినా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రశ్న అధ్యయన వేదిక స్థాపకులు కీ. శే. కెమేరా విజయ్ కుమార్ , ప్రజాపత్రిక సంపాదకులు కీ. శే. రమాదేవి తన అక్షరాలు బయటకు రావడానికి ప్రోత్సాహం అన్నారు. వారిద్దరూ ఈ రోజు జీవించి లేకపోవడం బాధాకరం అన్నారు. సమాజానికి ఏనాటికైనా దిక్సూచి హేతువాద మేననీ, హేతువాదమంటే మనిషి చింతనా త్మకమైన జిజ్ఞాస అనీ దానిని ఏ తరంలో నైనా కాపాడుకోవడం అంటే ఆ తరం యొక్క అర్థవంతమైన ఆలోచన శైలిని కాపాడుకో వడానికి ప్రయత్నం చేయడమేనంటూ భావోద్యమాలే సమ సమాజ నిర్మాణానికి సరైన భవిష్యత్తు దిక్సూచులన్నారు !

       “ఎన్నో బీళ్ళున్నాయి

        ‌మరెన్నో మోళ్ళున్నాయి

        కాసేపు,

        ఒక్క మోడు పైనైనా వాలి

        పాడే పక్షివై నిలవాలి”

అంటాడు ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ ఒకచోట

చైతన్యపక్షి

అలా నిరాశ నిస్పృహ లతో నిండిన వాతావరణం లో సైతం తన శక్తికి మించిన స్వరంతో తన గొంతు వినిపిస్తూనే ఉన్న చైతన్య పక్షి మన పేరలింగం అంటూ కొనియాడడం జరిగింది. అనేక ప్రజాసంఘాల ప్రతినిధులు, నాస్తిక , వామపక్ష, హేతువాద, భౌతికవాద, మానవవాద, అంబేద్కరిస్టు, బౌద్ధ, సైన్సు సంఘాల ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశం నిజానికి భావోద్యమాలకి బూస్ట్ లాంటిదని కొద్ది మంది అంటే, అలనాడు ఇదే రాజమహేంద్రవరంలో భావోద్యమాలకి బాట వేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం వారసత్వాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకు వెళుతున్న  రాజమండ్రి వాసి పేరలింగం అనీ, నిజానికి ఆయన అనేక మంది అసంఖ్యాక ఆలోచనాపరులకు ప్రేరణలింగమనీ మిత్రులు కితాబులిచ్చారు. నిజమే, స్తబ్దతతో నిండిన సమాజంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మనిషి పక్షాన నిలబడి సమానత కోసం నినదించిన బలమైన ధిక్కార స్వరం దేవగుప్తపు పేరలింగం. ఎవరికి ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ తెలుగు నేల మీద దశాబ్దాలుగా భావోద్యమ ప్రచారాన్ని శక్తికి మించి ఒక్కడిగానే  చేస్తున్న అరుదైన ప్రజాపక్ష మేధావిగా, ఆచరణాత్మక బుద్దిజీవిగా, బహుగ్రంథకర్త గా, అరుదైన ఉద్యమకారుడిగా ఆయన జీవితం ధన్యం,  ఆయన స్థానం ఎప్పటికీ అది నిరుపమానం! ఆయన మార్గం మరెవ్వరికీ అది అనితర సాధ్యం!! ఆయన వాదం  విశ్వమానవ సౌభ్రాతృత్వ అజరామర  సోపానం!!!

Also read: మనుషులు – వస్తువులు – సంస్కృతి

(ది. 04 – 09 – 2022 ఆదివారం రాజమహేం ద్రవరంలో నిత్య చైతన్యపు తరంగం : దేవగుప్తపు పేరలింగంగారికి జరిపిన అభినందన సన్మాన సత్కార సమావేశం సంక్షిప్త రిపోర్టు ఇది. వ్యాస విస్తరణాభీతి వల్ల హాజరైన వారి పేర్లను ఇక్కడ పేర్కోవడం జరగలేదు కానీ మరే ఇతర దురుద్దేశం కాదని విజ్ఞులు గ్రహించగలరు. అలానే కార్యక్రమానికి వచ్చిన అనేక మంది ప్రముఖుల పేర్లు అన్నీ పేర్కోవడం సాధ్యం కాదు కాన గమనించమని  వినమ్ర పూర్వక విన్నపం. ది. 06 – 09 – 2022 శ్రీ దేవగుప్తపు పేరలింగం గారి 80 వ జన్మదినం సందర్భంగా శుభాభినందనలతో ఇలా ఈ చిన్న రైటప్)

గౌరవ్

అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్య

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles