అరుదైన అధ్యాపకుడు, విద్యార్థులకు ప్రేరకుడు, ఉపాధ్యాయులకు ఆదర్శమూర్తి చుక్కారామయ్య ఆదివారంనాడు 98వ ఏట అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మట్టి సాక్షిగా, తెలంగాణ తల్లితోడుగా, చదువులతల్లి ముద్దుబిడ్డగా చుక్కారామయ్య ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది విద్యార్థులకూ, వారి కుటుంబాలకూ ఎనలేని ఉపకారం చేశారు. తన కుటుంబం కన్నా తరగతి గదినీ, విద్యార్థులనూ ఎక్కువగా ప్రేమించారు. విద్యార్థులకు కేవలం లెక్కలు బోధించడమే కాకుండా జీవితంలో విలువలు నేర్పారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దారు.
చిన్నతనంలోనే వరంగల్లు జిల్లాలో గూడూరు ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. రెండేళ్ళు కారాగారవాసం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను సమర్థించారు. ఒక వైపు కమ్యూనిస్టు పార్టీలకి మద్దతు ఇస్తూనే, ఉఫాధ్యాయ సంఘాలకు చేదోడువాదోడుగా ఉంటూనే తరగతి గదిని వదిలిపెట్టకుండా విద్యార్థులకు నూటికి నూరు శాతం న్యాయం చేసేవారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కోచింగ్ కేంద్రం పెట్టి ఐఐటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థినీవిద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. ఆ విధంగా కొన్ని వేలమందిని ఐఐటీ పట్టభద్రులను తయారు చేశారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో లెక్కలు తీస్తే రామయ్య సారు విద్యార్థులే అధిక సంఖ్యలో తేలతారు. ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో శిష్యులు ఉన్నత ఉద్యోగాలలో కుదురుకున్న ఏకైక అధ్యాపకుడు రామయ్యగారేనని సగర్వంగా తెలుగువారు చెప్పుకోవచ్చు. అంత ఘనకార్యం సాధించినా ఎంతో నిరాడంబరంగా జీవించే రామయ్య సిద్ధాంతాలకూ, నియమాలకూ కట్టుబడి జీవించే ఆదర్శమూర్తి.
పాత మెదక్ జిల్లాలో, హైదరాబాద్ లో, నాగార్జునసాగర్ లో ఉపాధ్యాయుడుగా, అధ్యాపకుడుగా ఆయన పని చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తన ఇద్దరు కుమారులూ, ఇద్దరు కుమార్తెలూ ఇంజనీరింగ్ చదువుకున్నారు. అమెరికాలో ఉద్యోగాలలో స్థరపడ్డారు. రామయ్య సారు మాత్రం విద్యానగర్ లోని పాత క్వార్టర్ లోనే ఉంటున్నారు. అయిదారేళ్ళ కిందట రామయ్యగారి భార్య కాలధర్మం చేశారు. ఒక్కరే ఉండకుండా కొందరు శిష్యులో కలిసి జీవిస్తున్నారు. పిల్లలు తరచుగా అమెరికా నుంచి వచ్చిపోతూ ఉంటారు. ఆయన నివాసం మాత్రం హైదరాబాద్ లోనే. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే ఉదయం, సాయంకాలం నడుస్తారు. అప్పుడప్పుడు తొర్రూరుకు వెళ్ళివస్తారు. కొన్నేళ్ళ కిందట అయితే ఒక రోజు అనంతపురం, మరుసటి రోజు ఆదిలాబాద్ లో కార్యక్రమాలు ఉండేవి. కొద్ది మాసాలుగా ఆరోగ్యం అంతగా సహకరించక నడవడం లేదు కానీ కొన్ని దశాబ్దాలుగా ఆయన ఉస్మానియా క్యాంపస్ లో నడుస్తూ కనిపించడం నిత్యసత్యమైన దృశ్యం.
రామయ్యగారు 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం, నవంబర్ 20న, పుట్టినరోజు ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఆయన చిన్న కుమారుడు అచ్యుత్ అమెరికా నుంచి వచ్చారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ పదిహేను రోజుల కిందటే హైదరాబాద్ లో దాదాపు రెండు వారాలు ఉండి అమెరికా వెళ్ళారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మంత్రులూ, మిత్రులూ, శ్రేయోభిలాషులూ అనేకమంది ఆరుదైన అధ్యాపకుడికి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ వెనక అడ్కిమెట్టు బ్రిడ్జి దాటగానే తార్నాకా వెళ్ళే దారిలో ఎడమచేతి వైపున జి రామిరెడ్డి డిస్టెన్స్ఎడ్యుకేషన్ సెంటర్ లో ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ ఈ సభ జరుగుతుంది.