Sunday, December 22, 2024

తెలంగాణ ప్రజల ఎనిమిదేళ్ళ అనుభవం ఏమిటి?

తెలంగాణ స్వప్నం సాకారమై ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంకోసం పుష్కరానికిపైగా ఉద్యమం సాగడం, ఉద్యమానికి సరైన నాయకత్వం లభించడం, అన్ని రంగాలకు చెందిన ప్రజలూ కదం కలపడం, సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) చిత్తశుద్ధితో, ఉద్యమస్ఫూర్తితో సకారాత్మకంగా పని చేయడం, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కు అంగీకరించాలన్న స్థిరమైన నిర్ణయం తీసుకోవడం తెలంగాణ కల నిజం కావడానికి దోహదం చేసిన అంశాలు.

తెలంగాణ ప్రజల ఎనిమిదేళ్ళ అనుభవం ఏమిటి? ఇది  ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్ళ అనుభవానికి భిన్నంగా ఉందా? మెరుగ్గా ఉందా? అదే (సమైక్యరాష్ట్రమే) నయమని అనిపిస్తోందా?  

స్ఫూర్తీ, నేర్పూ కలిగిన నాయకుడు కేసీఆర్

ఉద్యమస్ఫూర్తి, రాజకీయ నేర్పూ కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం (కల్వకుంట్ల చంద్రశేఖరరావు-కేసీఆర్) అంతకు ముందు ఊహించినట్టు కాంగ్రెస్ లో విలీనం కాకుండా ప్రత్యేక పార్టీగా మనుగడ సాగించడం, కాంగ్రెస్ తో పొత్తుకూడా పెట్టుకోకుండా 2014లో ఒంటరి పోరు చేయాలని నిర్ణయించడం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులలో చొరవ, సాహసం ఉన్నవారు ఒక్కరు సైతం లేకపోవడం కేసీఆర్ కి కలిసి వచ్చిన అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2014ను రాజ్యసభ ఆమోదించిన వెంటనే ఒక వారం రోజుల్లో నిజాం కాలేజి ఆవరణంలోనైనా ఒక బహిరంగ సభ నిర్వహించి సోనియాగాంధీని ఆహ్వానించి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్నితామే ఇచ్చినట్టు చాటుకునే అవకాశం ఉండేది. అంతకంటే సోనియాగాంధీ, చిదంబరం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఆ ప్రకటన చేసి ఉంటే కాంగ్రెస్ కు ఇంకా అనుకూల వాతావరణం ఉండేది. ఇటువంటి పనులు ఏవీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులనూ, తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకులనూ, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులనూ తప్పుపట్టాలి. కేసీఆర్ అదృష్టం ఏమంటే బిల్లు ఆమోదం పొందిన తర్వాత రెండు వారాల పైబడి దిల్లీలోనే ఉండి పథకం ప్రకారం బ్రహ్మాండమైన స్వాగత సన్నాహాలు చేసుకొని హైదరాబాద్ వచ్చారు. కార్లూ, ఏనుగులూ,గుర్రాలూ, ద్విచక్రవాహనాలతో హైదరాబాద్ వీధులలో పర్యటించారు.  తెలంగాణ రాష్ట్రం తెచ్చాను అన్నారు. ప్రజలు నమ్మారు. తప్పంటూ ఉంటే అది ప్రజలది కాదు. కాంగ్రెస్ నాయకత్వానిది. తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసొచ్చిన కాలం. 2014లో తెరాస అత్తెసరు సీట్లతో గెలిచింది. కానీ పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ సభ్యులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ విధంగా చేరినవారిలో తెలంగాణవాదాన్ని అవహేళన చేసినవారూ, వ్యతిరేకించినవారూ, తెలంగాణవాదులను తరిమికొట్టినవారూ ఉన్నారు. తెలంగాణ సమాజం ఇదేమి రాజకీయం అని కేసీఆర్ ను నిలదీయలేదు.

కాంగ్రెస్ ను బలహీనపరిస్తే సరిపోదు

కాంగ్రెస్ ను బలహీనపర్చితే టీఆర్ఎస్ కి ధోకా లేదనే విశ్వాసంతో కేసీఆర్ ఆ పార్టీని బలహీనపరచడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకున్నారు. అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న శాసనసభ్యులూ, ఇతర నాయకులూ కాంగ్రెస్, టీడీపీలలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమైంది. కేంద్ర నాయకత్వానికి తెలంగాణలో పరిణామాలు పట్టించుకునే వ్యవస్థ కానీ, తీరిక కానీ, సోయి కానీ లేవు. ఈ కారణంగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ గెలుపొందింది. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన దోహదం గొప్పది. ఎన్నికల ప్రచారంలో  ఇతివృత్తం లేకుండా వాక్చాతుర్యంతో నడిపించుకుంటూ వస్తున్న కేసీఆర్ కి చంద్రబాబునాయుడు ప్రచారఘట్టం మధ్యలో లడ్డూలాగా దొరికారు.

చంద్రబాబునాయుడు చేసిన సహాయం

నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకొని నరేంద్రమోదీపైనా, బీజేపీపైనా ధ్వజమెత్తారు. 2019 ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం ఖాయమని తప్పుడు అంచనావేశారు. దశ,దిశలేని కాంగ్రెస్ పార్టీకి నిధులూ, నాయకత్వం  సమకూర్చుతానంటూ చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ మెడలో కండువా కప్పారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్-టీడీపీ కూటమికి ప్రచారం మొదలు పెట్టారు. అప్పుడు కేసీఆర్ కి ఇతివృత్తం దొరికింది. అమరావతి నుంచి చంద్రబాబునాయుడు రిమోట్ గా నడిపే ప్రభుత్వం కావాలో, ఉద్యమ నాయకుడు కేసీఆర్ నడిపే ప్రభుత్వం కావాలో కోరుకోవలసిందిగా ప్రజలను కేసీఆర్ బహిరంగసభలలో పదేపదే కోరారు. టీఆర్ ఎస్ ప్రచారం ఊపందుకున్నది. గెలుపు సులువైంది. అంతవరకూ కాంగ్రెస్ కో, బీజేపీకో ఓటు వేద్దామనుకున్నవారు సైతం టీఆర్ఎస్ కు వేశారు. ఇది 2019 లోక్ సభ ఎన్నికల నాటికి వీగిపోయింది. చంద్రబాబునాయుడు తెలంగాణలో ప్రచారానికి రాలేదు. బీజేపీకి నాలుగు స్థానాలూ, కాంగ్రెస్ కు మూడు స్థానాలూ, ఏఐఎంఐఎంకి ఒక స్థానం, తక్కిన తొమ్మిది స్థానాలూ టీఆర్ ఎస్ కి దక్కాయి. ఆరు మాసాల కిందట అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్థానాలు గెలుచుకున్నది. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన జి. కిషన్ రెడ్డి సికిందరబాద్ లోక్ సభ నియోజకవర్గంలో గెలుపొంది కేంద్రమంత్రిమండలిలో సభ్యుడు కాగలిగారు. అంటే చంద్రబాబునాయుడు ‘ఎఫెక్ట్’ లేకపోయుంటే 2018లో బీజేపీకీ, కాంగ్రెస్ కీ ఎక్కువ సీట్లు వచ్చేవి. టీఆర్ఎస్ కి తక్కువ సీట్లు దక్కేవి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి స్వస్తి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి స్వస్తి చెప్పి కేవలం రాజకీయ ఎత్తుగడల ద్వారా పార్టీని పటిష్ఠం చేసుకున్న కేసీఆర్ ఎనిమిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబునాయుడు తర్వాత ఒక తెలుగు రాష్ట్రానికి ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత కేసీఆర్ దే. సచివాలయంలో అడుగుపెట్టకుండా, ఎక్కువ రోజులు ప్రగతిభవన్ లో కూడా లేకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటూ పరిపాలన సాగించిన ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ ప్రత్యేకత నిరూపించుకున్నారు. అంతేకాదు, పెద్దగా చర్చ లేకుండా ఏకపక్షంగా రీఇంజనీరింగ్ పేరిట కాళేశ్వరం అనే బహుళార్థ సాధక ప్రాజెక్టును రూ. 1.25 లక్షల కోట్ల ఖర్చుతో తక్కువ సమయంలో నిర్మించిన ఘనత కూడా కేసీఆర్ దే. ఈ ప్రాజెక్టును ఎక్కువ కాలం కొనసాగించలేరనీ, చాలా ఖర్చుతో  కూడిన పని అనీ, నాలుగైదు సంవత్సరాలలో దీన్ని నిరుపయోగంగా ఉంచవలసి వస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల ఫిబ్రవరి నెలకు మాత్రమే రూ. 500 కోట్ల విద్యుచ్ఛక్తి బిల్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎత్తిపోయడానికి సంబంధించి వచ్చిందని తెలుస్తోంది. మొత్తం మీద దృష్టి యావత్తూ కాళేశ్వరంపైన పెట్టడంతో అప్పుల భారం పెరగడమే కాకుండా దక్షిణ తెలంగాణలో, పశ్చిమ తెలంగాణలో ప్రాజెక్టులపైన నిధులు ఖర్చు చేయలేదు. నిర్మాణాలు జరగలేదు. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఆగ్రహోదగ్రులై ఉన్నారు.

నిధులు పరిమతం, హడావిడి అపరిమితం

విద్యా, ఆరోగ్య రంగాలపైనా దృష్టి పెట్టలేదు. ఈటల రాజేంద్ర నిష్క్రమణ తర్వాత హరీష్ రావుకు ఆరోగ్యశాఖ అప్పగించిన తర్వాత కొంత చలనం వచ్చి జోరందుకున్నది.  కానీ నిధుల కేటాయింపులో ఈ రెండు రంగాలపైనా చిన్నచూపే. ప్రచారం, ఆర్భాటం ఎక్కువ. నిధులు పరిమితం. ఆంధ్రప్రదేశ్ కూ, తెలంగాణకూ తేడా హైదరాబాద్ మహానగరం. భాగ్యనగరం ఉన్నది కాబట్టి ఈ మాత్రం నిధులైనా సమకూరుతున్నాయి. మనది సంపన్న రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు అప్పులు చేయడానికి అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు.  సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితి. నేల వదిలి సాము చేయడం అలవాటైంది. గురుకుల పాఠశాలలు దళితులకూ, ఆదివాసులకూ, బీసీలకూ, మైనారిటీల విద్యార్థులకూ విస్తరించడం మాత్రం చెప్పుకోదగిన పరిణామం. కానీ ప్రభుత్వ కళాశాలలనూ, పాఠశాలనూ పట్టించుకోలేదు. పేరెంట్స్ కమిటీల చేత చురుకుగా పని చేయించడం, బోధనా ప్రమాణాలు పడిపోకుండా చూసుకోవడం వంటి కనీస కార్యక్రమాలు సైతం అమలు జరగలేదు. మెడికల్ కాలేజీలను పెంచడం, ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పడం మంచిదే. కానీ విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బందిని నియమించకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించకపోవడంతో ఈ రంగంలో రాష్ట్రం వెనుకబడే ఉన్నది. పత్రికా ప్రకటనలలో, విలేఖరుల గోష్ఠులలో ‘చెప్పింది వినండి, చరిత్ర అడగవద్దు’ అన్న చందంగా అన్నిటిలో మనమే నంబర్ ఒన్ అని చాటుకోవడంతో సరిపోదు. ఐటీ వంటి కొన్ని రంగాలలో అభివృద్ది జరుగుతున్న మాటను ఎవ్వరూ కాదనలేదు. వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రంపైన సుదీర్ఘ ఉద్యమం, దిల్లీ ధర్నాలు అనవసరం. చివరికి రాష్ట్రమే కొనుగోలు చేయవలసి వచ్చింది. మహేంద్ర టియాత్ మెచ్చుకోవచ్చు కానీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దేశం మొత్తానికి విధానరూపకల్పన చేయాలన్న గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్న కేసీఆర్ ముందు తెలంగాణలో రైతుల సమస్యలను పట్టించుకోవాలి. ‘రైతు బంధు’ మంచిదే. కానీ అదొక్కటే చాలదు. పైగా కౌలు రైతులు ఇవ్వకుండా హైదరాబాద్ లోనూ, అమెరికాలోనూ ఉన్న యజమానులకు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు.బ రైతును చేయిపట్టుకొని నడిపించవలసిన అవసరం ఉంది. ఆత్మహత్యలకు వడిగట్టకుండా రక్షించవలసిన అవసరం ఉంది.

శాంతిభద్రతలు విపరీతం

శాంతి,భద్రతల పైన దృష్టి పెట్టడం పేరుతో పౌరహక్కులను అనుమతించని రాష్ట్రంగా తెలంగాణ పేరుమోసింది. అధికారంలోకి రాగానే పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయడం, ధర్నా చౌక్ ను మూసివేయడం, నోరుమెదిపితే, కాలు కదిపితే పోలీసులు జోక్యం చేసుకోవడం ఎవ్వరూ ఊహించని పరిణామం. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా హక్కులను కాలరాస్తే తెలంగాణ ఉద్యమం సాగేదా? విజయం సాధించేదా? తాను ఆఖరి బంతివరకూ ఆడతానంటూ క్రికెట్ ప్రియుడైన నాటి ముఖ్యమంత్రి మాట్లాడారే కానీ పోలీసులతో ఉద్యమాన్ని అణచాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. అధికారంలో ఉండగా కొంత ఉదారంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైంది. హక్కుల హననం జరుగుతుంటే ప్రతిఘటించిన దాఖలా లేదు. టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పలుకు కలిగిన నాయకులందరూ టీఆర్ఎస్ లో చేరిపోయి ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. టీడీపీ తెలంగాణలో నామమాత్రంగానే ఉంది. కాంగ్రెస్ కు పట్టిన జాడ్యం కొనసాగుతూనే ఉంది. నాయకత్వ సమస్య నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. ఐక్యత ఎండమావిగానే కనిపిస్తోంది. వామపక్ష పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రెండు పార్టీలూ (సీపీఐ, సీపీఎం) కలిసినా ఒక్క సీటు కూడా గెలుచుకోనంతగా బలహీనపడినాయి. వామపక్ష కార్యాచరణ కానరావడం లేదు. వారికీ ఇతర పార్టీలవారికీ తేడా అంతగా కనిపించడం లేదు.

బీజేపీ పైన కేసీఆర్ ధ్వజం

ఆరేడు మాసాలుగా కేసీఆర్ బీజేపీ వ్యతిరేకతను పెంచుకున్నారు. 2018లో చంద్రబాబునాయుడు చేసిన పొరబాటే కేసీఆర్ 2022లో చేస్తున్నారు. నరేంద్రమోదీ 2024లో ఓడిపోతారనే అంచనా తప్పు. ఆ అంచనా ఆధారంగా చేస్తున్న కార్యక్రమాలన్నీ నష్టదాయకమైనవే. కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫ్రంటు కడతామంటూ దేశం పట్టుకొని తిరగడం వృధా. ప్రతిపక్షాలలో ఎవ్వరూ కేసీఆర్ కు నాయకత్వం ఇవ్వడానికి సుముఖంగా ఉండదు. 17 లోక్ సభ స్థానాలు కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత బాగా హిందీ మాట్లాడుతున్నానని అనుకున్నా, రాజకీయంగా ఎంత తెలివితేటలు ఉన్నాయని అనుకున్నా నెగ్గుకొని రావడం కష్టం. నలభై స్థానాలూ, అంతకంటే ఎక్కువ స్థానాలూ కలిగిన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల నాయకులు కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తారనుకోవడం కేవలం భ్రమ. చనిపోయిన రైతులకు సహాయం చేస్తానంటూ చెక్కులు పట్టుకొని వెడితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కాదంటాడు. మీ రాష్ట్రంలో స్కూళ్ళు పని చేస్తున్న తీరు చూడాలని ఉందంటూ ఒక ముఖ్యమంత్రి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు కాదంటాడు. అంతమాత్రాన కేసీఆర్ చెప్పే రాజకీయ విశ్లేషణకు తక్కిన ప్రతిపక్ష నాయకులంతా మంత్రముగ్ధులైపోయారనుకుంటే, వారంతా ఫిదా అయ్యారనుకుంటే పొరబాటు. పత్రికలలో రాసుకోవచ్చు. ఉన్నదున్నట్టు రాయడానికి సంకోచించే లేదా భయపడే పత్రికలు కూడా రాయవచ్చు. వాస్తవం ఏమంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది మిథ్య. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేని ఫెడరల్ ఫ్రంట్ పెట్టినా అది బీజేపీ విజయానికే దోహదం చేస్తుంది. మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చుతుంది. బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న పనే ఫెడరల్ ఫ్రంట్ సమర్థంగా చేయగలుగుతుంది.

ఫెడరల్ ఫ్రంట్ కన్వీనర్

ఫెడరల్ ఫ్రంట్ పెట్టి, దాని కన్వీనర్ గా ఉంటూ జాతీయ స్థాయిలో పని చేయాలని కేసీఆర్ సంకల్పం కావచ్చు. కన్వీనర్ గా కేసీఆర్ ఉంటే ఇతర ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరం ఉండకపోవచ్చు. కాకపోతే ప్రధాని పదవిపైన ఆశలేదని ఒకటికి రెండు సార్లు స్పష్టం చేయాలి.  కాంగ్రెస్ పొడ గిట్టని మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి నాయకులు కేసీఆర్ కన్వీనర్ గా ఉండటానికి అంగీకరించవచ్చు. అప్పుడు హైదరాబాద్ లో పగ్గాలు పూర్తిగా తనయుడు కె. తారకరామారావు (కేటీఆర్)కు అప్పగించి కుటుంబ సభ్యులను సంతృప్తిపరచవచ్చు. అది జరిగే వరకూ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా కేటీఆర్ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. బుద్ధవనం వంటి పెద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా కేటీఆర్ చేతులమీదుగానే జరిపించారు.

బీజేపీపైన పోరాటం చేయాలన్న సంకల్పం కారణంగా రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనే భావం కలిగించే విధంగా కేసీఆర్ వాగ్దాడులు కొనసాగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, అతడి ఉనికినే గుర్తించకుండా బీజేపీ నాయకులు బండి సంజయ్ పైనా, కిషన్ రెడ్డిపైనా విమర్శలు గుప్పిస్తూ రాజకీయం చేశారు కేసీఆర్. రెండు ఉపఎన్నికలూ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సాధించిన విజయాలతో ఊపందుకున్న బీజేపీ 2023లో విజయం సాధించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణమీద దృష్టి సారించారు. జులై మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారనీ, మోదీ, అమిత్  షాలే కాకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, 19 బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, కేంద్రమంత్రులూ, పార్టీ జాతీయ నాయకులూ అనేకమంది హైదరాబాద్ లో రెండు, మూడు రోజులు మకాం పెట్టి హడావుడి చేయబోతున్నారనీ అంటున్నారు. ప్రస్తుతానికి కొన్ని జిల్లాలలో అభ్యర్థులు దొరికే అవకాశం లేకపోయినా గెలిచిపోతామన్న ధోరణిలో బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సమైక్యంగా పోరాటం చేస్తే బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని ప్రస్తుత అంచనా. భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చు. తెలంగాణపైన బీజేపీ శక్తియుక్తులు  కేంద్రీకరించినంతగా కాంగ్రెస్ కేంద్రీకరించలేదు. బీజేపీకి ఉన్న నిధులు లేవు. కేంద్ర నాయకత్వ పటిమ కాంగ్రెస్ కు లేదు. బీజేపీకి అభ్యర్థులు సైతం లేరనుకున్న జిల్లాలలో కాంగ్రెస్ నుంచో టీఆర్ఎస్ నుంచో గట్టి నాయకులను పార్టీలో చేర్చుకుంటే ఆ లోటూ తీరవచ్చు. బీజేపీ రెండో స్థానానికి ఎగబాకవచ్చు. ఇంకా ఎదిగి విజయం సాధించినా ఆశ్చర్యం లేదు.  లేదా బీజేపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును సమంగా చీల్చుకుంటే అధికారపార్టీ బయటపడి, బతికి బట్టకట్టవచ్చు. సంవత్సరన్నర తర్వాత జరగబోయే ఎన్నికలలో ఏమి జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. కానీ బీజేపీనీ, మోదీనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ ఎదిరించి ఒక ప్రాంతీయ పార్టీ నాయకత్వంలోఉన్న చిన్న రాష్ట్రం ఏమి సాధిస్తుందనేది ప్రశ్న.

ఆ అవసరం ఉంది

అయితే, బీజేపీనీ, మోదీని జాతీయ స్థాయిలో ఎదిరించాల్సిన అవసరం ఉంది. మత ప్రాతిపదికపైన సమాజాన్ని రెండుగా చీల్చడాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఉపా, సెడిషన్ వంటి దుర్మార్గమైన చట్టాలను దురుపయోగం చేసి తమను ప్రశ్నిస్తున్నవారిని దేశద్రోహులుగానో, పాకిస్తాన్ తొత్తులుగానో చిత్రించి వారిని జైళ్ళలో కుక్కడం, సంవత్సరాల తరబడి విచారణలేకుండా జైళ్ళలో మగ్గపెట్టడాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. మోదీ-షా నాయకత్వంలో బీజేపీ 2024లో మూడోసారి గెలిస్తే దేశం ఎటు పోతుందో, ఏమైపోతుందో అన్న భయాందోళనలు ఉన్నవారు అనేకమంది. వారి తరఫున మోదీని వ్యతిరేకించి కేసీఆర్ నిజంగా పోరాడగలిగితే చరితార్థుడవుతారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంతకాలం ప్రతిఘటించి, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు పెట్టే ఒత్తిళ్ళకు తట్టుకోలేక మోదీకి లొంగిపోతే రెండింటా చెడిన రేవడి చందం అవుతుంది. ఇటు రాష్ట్రానికీ, తనకీ తీరని నష్టం జరుగుతుంది. అటు తనకు కీర్తి దక్కకుండా పోతుంది.

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ దారిలో…

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ వెలుపల నుంచి బలపర్చితే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం వాదనకోసమైనా ఉంది. అప్పటి జనతా పార్టీ లేదా జనతాదళ్ అంత బలహీనంగా బీజేపీ లేదు. బీజేపీ కార్యకర్తలు కూడా లేని చోట మోదీ అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్ ను కలుపుకొని పోతేనే ప్రతిపక్ష కూటమి (అది యూపీఏ కావచ్చు మరేదైనా పేరు కావచ్చు) గెలుపొందడం అనుమానం అనుకుంటే కాంగ్రెస్, ఫెడరల్ ఫ్రంట్ విడివిడిగా పోటీ చేసి మోదీ వ్యతిరేక ఓటు చీల్చితే బీజేపీ విజయం ఖాయం అవుతుంది. ఇవన్నీ కేసీఆర్ కి కానీ ప్రశాంత్ కిశోర్ కి కానీ తెలియవని కాదు. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఏదో చేయాలని ప్రయత్నిస్తే ప్రత్యర్థికి మేలు జరిగే అవకాశాలే ఎక్కువ. దిల్లీలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఫాంహౌస్ లో ఉన్నా కేసీఆర్ ఆలోచనలు రాజకీయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అందులో సందేహం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దేశ పర్యటనలు చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ ను నిర్మించే కార్యక్రమం పెట్టుకుంటే కేటీఆర్ ని ముఖ్యమైన మంత్రిగా కొనసాగించవచ్చు. ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ వైదొలగాలంటే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన పదవి రావాలి. ఏ పదవీ లేకుండా ఉండటం కష్టం. ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరితే అటువంటి ఫ్రంట్ కు కన్వీనర్ గా ఉంటూ ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి, విధానాల గురించి కసరత్తు చేస్తూ దిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ భవన్ నుంచి పని చేయదలచుకుంటే చేతినిండా పని ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి పదవి కొడుకు చేతిలో పెట్టవచ్చు. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందా, తర్వాతా అనేది మరో కీలకమైన నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికలను కేటీఆర్ నాయకత్వంలో ఎదుర్కొనగలరా? కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కన్వీనర్ హోదాలో బీజేపీని వ్యతిరేకించి పోరాడినట్టు ఉంటుంది. ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా మోదీ-షా ద్వయం బలహీనపడితేనే. లేకపోతే అంతా వృథా ప్రయాస. టీఆర్ఎస్ పై కత్తికట్టిన మోదీ ప్రధానిగా, అమిత్ షా హోంమంత్రిగా కొనసాగితే కేసీఆర్ కష్టాలపాలు కావలసి వస్తుంది. అన్నీ ఆలోచించుకొనే ముందడుగు వేయడం మంచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles