- ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించే యోచన
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా జిల్లాల కూర్పుకు తుది రూపం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి రెండో కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి మూడో కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగో సబ్ కమిటీ ని ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లాగా రాజమహేంద్రవరం?
ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కేంద్రంగా గోదావరి జిల్లా ఏర్పాటు చేయాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని భరత్ రామ్ తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజక వర్గ పరిథిలో తూర్పుగోదావరి జిల్లా నుంచి 4 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని రాజమమేంద్రవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటయితే పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నడుమ ఉన్న రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయితే గోదావరి ఉన్నతిని, ప్రాశస్త్యాన్ని కాపాడినట్లవుతుందని భరత్ రామ్ అభిప్రాయపడ్డారు.
పరిపాలన వికేంద్రీకరణ
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టి పాలనావిధులను వికేంద్రీకరించడంతో మంచి ఫలితాలను సాధించింది. అక్కడ ప్రజలకు ప్రభుత్వాధికారులతో పనులు త్వరగా పూర్తవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికీ 9 జిల్లాలే ఉన్నాయి. వాటిని విభజించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు చేయాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు కూడా రావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త జిల్లాల ప్రతిపాదనలపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.