Sunday, November 24, 2024

సినీ `ఈవీవీ`యం

సినిమాల్లోకి వెళ్లాలి…ఏదో కావాలి. ఏం కావాలో తెలియదు. సినిమా రంగంలో ఉన్నాననిపించుకోవాలి.అంతే.. సినిమాల ముందు చదువు నిలవలేదు. పుట్టిన ఊరు దొమ్మేరు నుంచి  మిత్రులతో కొవ్వూరు, రాజమహేంద్రవరం వెళ్లడం. రోజంతా సినిమాలు చూసేయడం.  ఆ మోజుతోనే ఇంటర్మీడియట్ తప్పి చదువుకు చుక్క పెట్టేశాడు. నాన్న మాట కాదనలేక వ్యవసాయంలో దిగాడు. కొన్నాళ్లకు పరిస్థితులు తారుమారై  పొలం  కాస్తా చేతులు మారింది. పది మందితో పని చేయించుకున్న కుటుంబసభ్యులే పది మందిలో ఒకరికిగా పనికి  వెళ్లవలసిన పరిస్థితి. చదువు ఒంటబట్టలేదు. ఇతర పనులు చేతకావు. ఇక  సినిమాయే శరణ్యం. మదరాసుతోనే తన భవిష్యత్ ముడిపడి ఉంది. అక్కడే తేల్చుకోవాలి. అంతే రైలెక్కేశాడు.  కానీ ఏం చేయాలో తోచ(లే)దు. సినిమాల్లో `అసిస్టెంట్ డైరెక్టర్` అనే హోదా ఉంటుందని ఎవరి మాటల్లోనే విన్న ఆయనకు `దాంట్లో`చేరితే పోలా? అనిపించిందట.అలా ఆశ నిరాశల నుంచి ఎగిసిన దర్శక కెరటం. రెండు దశాబ్దాల్లో ఐదు పదులకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, సొంతంగా చిత్రాలు తీసిన వ్యక్తి. ఈవీవీ అనే  ఈదర  వీరవెంకట  సత్యనారాయణ.

మరోసారి  కాస్త వెనక్కి వెళితే….తన సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచన రావడంతోనే   స్నేహితుడు  సుబ్బరాజు (నిర్మాత `నవత` కృష్ణంరాజు మేనల్లుడు) సిఫార్సు లేఖతో మదరాసు రైలెక్కారు ఈవీవీ. `రాజు`గారిని కలిశారు. సినిమా రంగం గురించి  ఈవీవీకి గల   అవగాహనపై   `రాజు`గారు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు.`సినిమారంగ ప్రవేశం, అందులో నిభాయించుకురాగలగడం అంత సులువు కాదు. ఊరెళ్లి ఏదో చేసుకోవడం మంచిది`అని  కృష్ణంరాజు హితవు చెప్పినా, తిరుగు ప్రయాణానికి మనస్కరించలేదు.  ఉన్న పొలం కాస్త అమ్ముడైపోయింది.ఇప్పుడు వెళ్లి చేసేదేముంది?అనుకొని..రోజూ మద్రాసు వీధుల్లో చక్కర్లు కొడుతూ రాజుగారి కార్యాలయం గేటు దగ్గర నిలబడటం రోజువారీ కార్యక్రమంగా మారిందట. దాదాపు నెల రోజులపాటు  ఆయన తీరు, పట్టుదలను గమనించిన కృష్ణంరాజుకి ఏదైనా  సహాయం చేయాలనిపించింది. దర్శకత్వ శాఖలో పనిచేయలన్న కోరికను మన్నించి  తాను నిర్మిస్తున్న `ఓ ఇంటి బాగోతం` (దేవదాసు కనకాల దర్శకత్వం) చిత్రానికి  అవకాశం  కల్పించారు. అటు తర్వాత దాసరి నారాయణరావు,  బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరేందుకు ఈవీవీ ప్రయత్నించారు. వారి ఖాళీలు లేక మళ్లీ `నవత`రాజు గారినే ఆశ్రయించారు.

జంధ్యాలతో అనుబంధం

జంధ్యాల దర్శకత్వం వహించిన `నాలుగు స్థంభాల ఆట`సినిమాతో  ఈవీవీ ఆయన సహాయకుడిగా చేరారు. దీనికి నవతా కృష్ణంరాజు ఆ సినిమాకు నిర్మాత కావడంతో  తన దగ్గర అవకాశం లేకపోయినా  ఆయన ఒత్తిడి లేదా మొహమాటం కారణంగా  ఈవీవీని ఆరవ సహాయ దర్శకుడిగా తీసుకోవలసి వచ్చింది. చిత్రనిర్మాణం పూర్తయ్యేలోగా ఈవీవీ ఆయనకెంతో దగ్గరయ్యాడు. దాంతో జంధ్యాలకు ప్రతి పనికి `సత్యం` గుర్తుకొచ్చేవారు. ఈవీవీ పనితనంనచ్చి తన దర్శకత్వ జట్టులో శాశ్వత సభ్యునిగా తీసుకున్నారు.అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చీఫ్ అసోసియేట్ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు.దర్శకుడు (చెవిలోపువ్వు)అయ్యేంత వరకు  జంధ్యాల వద్ద 22 చిత్రాలకు  పనిచేశారు ఈవీవీ. `నాకు చదువు లేదు. సాహిత్యంపై అంత పట్టు,ప‌రిజ్ఞానం కూడా లేదు. సినిమాకు సంబంధించినంత వరకు పాండిత్యం కంటే సామాన్య ప్రేక్షకుడికి కావల్సింది ఇవ్వగలగడంలోనే విజయం దాగుంది.జంధ్యాల  గారి నుంచి దానిని గ్రహించాను.ఆయన నుంచే అనేక అంశాలు నేర్చుకున్నాను. జంధ్యాల గారితో పరిచయం, ఆయనతో  పనిచేయడం అపురూప అనుభవం. నాలో పాండిత్యం లేకపోయినా   మంచి పరిశీలన శక్తి ఉందని, చెప్పిన వెంటనే అల్లుకుపోతాననే నమ్మకం ఆయనకు ఉంది. అందుకే ఆత్మీయంగా చేరదీసి మెళకువలు నేర్పారు` అని ఈవీవీ తరచూ అనేవారు.  గురుశిష్యులు యాభయ్యే పడిలోనే కాలం చేయడం `హాస్య చిత్రప్రియుల`కు అశనిపాతం లాంటిది.

హాస్యంలో ఈవీవీ ప్రత్యేకత

సినిమాలలో కథానుగుణంగానో, వినోదం కోసమో ఎంపిక చేసిన  హాస్యనటులు ఉండడం సహజం. 1980 దశకం వరకు  అదే సాగింది. నాటక, సినిమా రచయితగా  జోరు మీదున్న జంధ్యాల దర్శకుడిగా మారిన తరువాత  సినిమాలలో హాస్యనటుల ప్రమేయం పెరిగింది. ప్రత్యేకించి హాస్యమే ప్రధానంగా చిత్రాలు తీసిన సంగతి  తెలిసిందే. ఆయన శిష్యుడు ఈవీవీ  దానిని అందిపుచ్చుకుని  మరింత ముందుకు తీసుకువెళ్లారు. అయితే గురువు కంటే శిష్యుని సినిమాలలో హాస్యం కొంత ఘాటుగా  ఉండేదని విశ్లేషకుల మాట. తెలుగు సినిమా రంగంలోని హాస్యనటుల నటనానైపుణ్యాన్ని   ఒకేసారి వినియోగించుకోగలగడం  ఈవీవీ ప్రత్యేకతగా చెబుతారు.  అంతమందిని విదేశానికి తీసుకువెళ్లిన ఘనత కూడా ఆయనదే.    

ఇదీ చదవండి:సంక్రాంతి సోగ్గాడు శోభన్ బాబు

`విధి`పాత్రలో….

`నాలుగు స్థంభాల ఆట` సినిమాలో మూడు సందర్భాల్లో (ప్రారంభం, విరామం, పతాక సన్నివేశం) కనిపించే `విధి` పాత్ర ధరించారు ఈవీవీ. వాస్తవానికి ఆ పాత్ర కోసం ఒక జూనియర్ అర్టిస్టును అనుకున్నారట. అయితే  రవాణా సదుపాయం అందుబాటులో లేక అతను సకాలంలో  చేరలేకపోవడంతో జంధ్యాల  ఆ పాత్రను శిష్యుడితో వేయించేశారట.

ఇదీ చదవండి: సినిమాపాటల రచయిత వెన్నెలకంటి కన్నుమూత

రెండు దశాబ్దాలలో…

రాజేంద్రప్రసాద్ నాయకుడిగా `చెవిలోపువ్వు`(1990)తో దర్శకత్వం ప్రస్థానం ప్రారంభించిన ఈవీవీ రెండు దశాబ్దాల్లో 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటి సినిమా నిరుత్సాహ పరచినా, నిర్మాత రామానాయుడు `ప్రేమఖైదీ`తో ఇచ్చిన అవకాశంతో  వెనుతిరిగి చూడనవసరంలేకపోయింది. నటనకు స్వస్తి చెప్పే దశలో  ఉన్న శొభన్ బాబుతో పాటు అగ్రనటులు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లతో సినిమాలు తీశారు. ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేష్, నరేశ్ లను కథానాయకులుగా పరిచయం చేశారు.  రెండవ కుమారుడు నటించిన చిత్రాలలో  తొమ్మిదింటికి   దర్శకత్వం వహించారు. `ఈవీవీ పిక్చర్స్` సొంత పతాకంపై  చిత్రాలు తీశారు. వివిధ అంశాలతో సినిమాలు తీసినా గురవు జంధ్యాల మాదిరిగా హాస్య చిత్రాల దర్శకునిగానే  ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.

(ఈ  నెల 21న దర్శక నిర్మాత ఈవీవీ వర్ధంతి సందర్భంగా…)

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles