నేను ఒకనాడు ధైర్యం చేసి “మాష్టారూ వేయిపడగలలో ధర్మారావు మీరేనంటారు
అది సత్యమేనా” అన్నాను.
ఆయన నవ్వి “ధర్మారావు ఎవరోగాని కిరీటి ఫలానా, సూర్యపతి ఫలానా, కుమారస్వామి ఫలానా, రాఘవరావు ఫలానా అని అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు” అన్నారు. వారికి కూడా తెలుసు అన్నారు. (ధర్మారావు తండ్రి) రామేశ్వరశాస్త్రిగారికి కట్టుకొనుటకు ధోవతి యొక్కటియే యుండెను. పైనుత్తరీయము కూడా లేదు. అంగవస్త్రము కలదు. అవి రెండే యాయనకు గల సర్వవస్త్రములు… శాస్త్రి పై యంగవస్త్రము ధరించి ధోవతి వానికిచ్చి యింటికి వచ్చెను”
వేయిపడగలలోని ఈ శాస్త్రిగారు “దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన” శోభనాద్రిగారే ధర్మారావు ఎవరని వేరే అడగాలా?” అని నేనన్నాను. మాష్టారు నవ్వి వూరుకున్నారు. తాను చిన్నప్పుడు చాలా చాయగా ఉండేవారని దబ్బపండువలె ఉండేవారని చెప్పారు. క్రమంగా ఆ చాయ అంతా మారింది.
నా దస్తూరి ముత్యాల కోవలాగా ఉండేది. అది కూడా పెద్దదయిన తర్వాత చెడిపోయింది అన్నారొకసారి.
“సామాన్యముగా జీవితము మొదలి దినములలో కష్టపడినను జివరినాళ్ళలో
భాగ్యమనుభవించిన వారిదే మంచి జాతకము” అన్న లక్ష్యాన్ని ఆయన సాధించారు.
ప్రాత దినములు పోవుచు క్రొత్త దినములు వచ్చుచున్న సంధివేళ పుట్టి పెరిగిన వాడాయన. ఆయన “ప్రతి దినము రాత్రులందు భోజనము చేసి తలవైపున బ్రక్కవద్ద దీపము పెట్టి చదువుట కారంభించుచు ఆ చదువుట చదువుట తెల్లవారి కోడికూయువరకట్లే చదువును.
ఈ రీతిగా (ఆయన) ఇంగ్లీషు నవలలు, కావ్యములు చదివెను. తెలుగు వానికన్న నవి చాలా బాగున్నవని యూహించెను”. “వేయి పడగలతో నేల దాల్చినవాడు రెండు పడగలతో దంపతుల పాలించువాడు. ఒక్క పడగ విప్పి పైరు పచ్చకు గొడుకు పట్టినవాడు. త్రిమూర్త్యాకృతి, శూలము నాలుక యందు, శంఖచక్రములు ఫణాగ్రములయందు దాల్చిన దేవుడు, ధర్మమయ తనువు,
కరుణాతరంగితాంతరంగుడై తన్ను గూడ తన పితరుల వలెనే సంప్రదాయమునకు
దూరము గాకుండ కాపాడువాడు నాకు ప్రసన్నుడగును గాక! నన్ను సర్వదా రక్షించుగాక’’
ఈ ప్రార్ధనకు లక్ష్యభూతుడైన సర్పాకృతియైన స్వామి ఆయనను పిలిచిన పలికిన
దైవమనుటలో నాకేమీ సందేహం లేదు.
ఒకనాడు మధ్యాహ్నం ఒంటిగంట వేళ నేను వారి యింటి వరండాలో కూర్చొని వుండగా కొబ్బరిచెట్టు వైపుగా ఒక పెద్ద గోధుమ వన్నెపాము బంగారపు తళతళతో బైట కనిపించింది.పావనీ పావనీ అని నేను భయపడుతూ పిలిచాను. అప్పుడు మాస్టారు నిద్రపోయేవేళ పావని నా మాట వినిపించుకోలేదు. పాము
మళ్ళా కనిపించలేదు.
ఇలా అని చెప్తే మాష్టారు
“అది మనలనేమీ చేయదు” అన్నారు నమస్కారముద్రతో.
పావని “అదా అప్పుడప్పుడూ కనిపిస్తూనే వుంటుందిలే అన్నయ్యా” అన్నాడు.
ఆయన తన చిన్ననాటి కవితా వ్యవసాయాన్ని గూర్చి చెప్తూ ఒకసారి యిలా అన్నారు.
“భరతశర్మా! నేను చిన్నప్పుడు పద్యాలు వ్రాసేవాణ్ణి. ఎన్నాళ్ళైనా వాటికి ఒక పాటు కుదరలేదు.
మా నాయనగారికే నచ్చేవి కాదు. పింగళి బాగా వ్రాసేవాడని మా నాయనగారు మెచ్చుకొనేవారు. నాకూ అవి బాగానే వుండేవి. నేను పట్టుబట్టి అభ్యాసం గాఢంగా
చేశాను. ఒక్కొక్క దశలో నా కవితలో ఒక్కొక్క వైచిత్రి బైటపడుతూ వచ్చింది.
అసలు నేనూ పింగళీ జంటకవులం కావలసింది. ఇద్దరం బందరులో రాత్రి ప్రొద్దుపోయేదాకా గుళ్ళచుట్టూ గుళ్ళల్లో కలిసి తిరిగేవాళ్ళం. ఒక కంచములో తిని ఒక మంచములో పండుకొని పెరిగిన వాళ్ళం. అతనిలాగా మెత్తగా వ్రాసే పద్దతి నాకు అలవడలేదు. అది నాకు కొఱతగానే వుండేది. రాను,రాను నా కవితలో ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క విలక్షణత కనిపిస్తూ వచ్చింది. నా గుండెలోనుండి వస్తున్న మాటల్లో ఒక కూర్పు వినూత్నంగా నాకు తోచింది.
అప్పుడు నాకు తెలిసింది నా శైలి ఒకటి వున్నది; అది సకల పూర్వాంధ్ర కవుల కోవలోనిదే కాని వానికంటె యిది చాలా విలక్షణమైనది. భగవంతుడు నాకిచ్చిన యీ శైలి సహస్రముఖమైనది. విచిత్రమైనది. ఇది యింకొక శైలితో లగించదు. కొన్నివేల పద్యాలు వ్రాసి, నాకు నచ్చక చింపిపారవేశాను. బహుశా అచ్చులో పడినన్ని చింపివేశానేమో!
నాకొక పరినిష్ఠితమైన శైలి ఏర్పడిన తరువాత నాకు అంతంత మాత్రపు కవితలపై మోజుపోయింది. ఒక మహాకావ్యము వ్రాయాలి. అది నా జీవితానికి చరితార్థత. ఆ ప్రతిజ్ఞ భగవంతుడు చెల్లించినాడు” అని.
(రసజ్ఙభారతి సౌజన్యంతో)
-మాశర్మ