* నువ్వానేనా అంటున్న భారత్, ఇంగ్లండ్
* అభిమానులు లేకుండానే మూడో టీ-20
భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ మూడో మ్యాచ్ కే రసపట్టుగా మారింది. ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ భారత్ చెరోమ్యాచ్ నెగ్గి 1-1 తో సమఉజ్జీలుగా నిలవడంతో…ఈ రోజు జరిగే మూడోమ్యాచ్ రెండుజట్లకూ కీలకంగా మారింది.
అహ్మదాబాద్ నరేంద్ మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి. సిరీస్ లోని తొలిపోరులో ఇంగ్లండ్ 8 వికెట్లతో నెగ్గితే….రెండోసమరంలో భారత్ 7 వికెట్ల విజయంతో సమఉజ్జీగా నిలిచింది.
Also Read : రెండో టీ-20లో భారత షాన్… ఇషాన్
రెట్టించిన ఆత్మవిశ్వాసంతో విరాట్ సేన
నెగ్గితీరాల్సిన రెండో మ్యాచ్ లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ విరాట్ కొహ్లీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు… బౌలింగ్ దళం పూర్తిగా ఫామ్ లోకి రావడంతో భారతజట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సమరానికి సై అంటోంది.
భారత టీమ్ మేనేజ్ మెంట్ కు ..మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమైన కెఎల్ రాహుల్ ను పక్కన పెట్టి వైస్ కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను తుదిజట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తోనే మరోసారి పవర్ పుల్ ఇంగ్లండ్ ను కట్టడి చేయగలమన్న ధీమా భారతజట్టులో కనిపిస్తోంది.
Also Read : నవశతాబ్దిలో సరికొత్త రికార్డు
రోహిత్, ఇషాన్, కొహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, పాండ్యాలతో భారత టాపార్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. రెండోమ్యాచ్ లో కనబరచిన పోరాట స్ఫూర్తినే మూడో మ్యాచ్ లోనూ విరాట్ అండ్ కో కొనసాగించగలిగితే… ఇంగ్లండ్ కు మరోషాక్ తప్పదు.
నెగ్గితీరుతాం- జేసన్ రాయ్
రెండోమ్యాచ్ లో ఓటమితో తాము కొత్తపాఠాలు నేర్చుకొన్నామని, స్లో వికెట్ల పైన ఎలా ఆడాలో తమజట్టుకు అనుభవమయ్యిందని, మంగళవారం జరిగే మూడో పోరులో నెగ్గితీరగలమన్న విశ్వాసాన్ని ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ వ్యక్తం చేశాడు.
పిచ్ ను బట్టి ఆటతీరు మార్చుకోవాలన్నది తమకు తెలిసి వచ్చిందని తెలిపాడు. ఇంగ్లండ్ జట్టు ఒకే ఒక్కమార్పుతో బరిలోకి దిగనుంది. టామ్ కరెన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి రానున్నాడు.
Also Read : విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై
ఓపెనర్లు జోస్ బట్లర్, జేసన్ రాయ్, వన్ డౌన్ డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో, కెప్టెన్ వోయిన్ మోర్గాన్, ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరెన్ లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత భీకరంగా కనిపిస్తోంది. పేస్, బౌన్సీ పిచ్ లపైన చెలరేగి ఆడే ఇంగ్లండ్ టాపార్డర్ కు…భారత స్లో పిచ్ లపైన ఆడటం కత్తిమీద సాము చేయటంలానే అనిపిస్తోంది. మొదటి ఆరుగురిలో ఏ ఇద్దరు భారీఇన్నింగ్స్ ఆడినా భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
క్యూరేటర్ చేతిలోనే మ్యాచ్ ఫలితం
ఒకే వేదికలో ఐదు టీ-20 మ్యాచ్ ల సిరీస్ ను నిర్వహించడంతో పిచ్ ల తీరుతెన్నుల పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. ప్రస్తుత సిరీస్ లోని తొలి పోటీకి పేస్-బౌన్సీపిచ్ ను తయారు చేయటంతో ఇంగ్లండ్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిస్తే…రెండోపోరు కోసం సిద్ధం చేసిన మందకొడి పిచ్ పైన భారత్ స్పిన్ ద్వయంతో పాటు స్లో మీడియం పేస్ బౌలింగ్ తో దెబ్బకు దెబ్బకు తీయగలిగింది. అయితే…ప్రస్తుత మూడోమ్యాచ్ కు క్యూరేటర్ ఎలాంటి పిచ్ ను సిద్ధం చేస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : లెజెండ్స్ సిరీస్ లో మాస్టర్ క్లాస్
మరోసారి ఆతిథ్యజట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్లో పిచ్ నే అందుబాటులో ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుత సిరీస్ లోని ట్రెండ్ ను బట్టి చూస్తుంటే ముందుగా టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా చేజింగ్ వైపే మొగ్గు చూపే వ్యూహాన్ని అనుసరిస్తూ ఉండడంతో…మరోసారి టాస్ నెగ్గిన జట్టే ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలున్నాయి.
Also Read : భారత్ కు నేడే అసలు పరీక్ష
భారత్ 8- ఇంగ్లండ్ 8
ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల వరకూ…ఈ రెండుజట్లు భారత గడ్డపై ఎనిమిదిసార్లు తలపడితే చెరో నాలుగు మ్యాచ్ లు నెగ్గి 4-4తో సమఉజ్జీలుగా నిలిచాయి. ఓవరాల్ గా మొత్తం 16సార్లు ముఖాముఖీ తలపడి చెరో 8 విజయాలు చొప్పున నమోదు చేశాయి.
భారత్ వేదికగా ఈ రెండుజట్లూ ఆరుమ్యాచ్ ల్లో తలపడితే…చెరో మూడు మ్యాచ్ లూ నెగ్గి 3-3తో సమఉజ్జీలుగా ఉన్నాయి.
2012 పూనే, 2017 నాగపూర్, 2017 బెంగళూరు మ్యాచ్ ల్లో భారత్ పై ఇంగ్లండ్ జట్టే పైచేయి సాధించింది.2011 కోల్ కతా, 2012 ముంబై, 2017 కాన్పూర్ టీ-20 మ్యాచ్ ల్లో భారత్ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా ఇప్పటి వరకూ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో ఉన్నాయి.
Also Read : విజయ్ హజారే టోర్నీలో టైటిల్ సమరం
ఖాళీ స్టేడియంలోనే పోటీ
మొదటి రెండు టీ-20లకు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించిన గుజరాత్ క్రికెట్ సంఘం…సిరీస్ లోని చివరి మూడుమ్యాచ్ లను గేట్లు మూసి …ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించింది.
గుజరాత్ లో రోజు రోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
రెండుజట్ల ఆటగాళ్లు, సిబ్బంది..బయోబబుల్ వాతావరణంలోనే గడుపుతూ ఉండడంతో కరోనా భయం లేకుండానే మ్యాచ్ ల్లో పాల్గొనగలుగుతున్నారు.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు