- బలవంతపు ఏకగ్రీవాలే మంచిది కాదన్న నిమ్మగడ్డ
- రాజ్యాంగ వ్యవస్థలపై వైఎస్ కు విశ్వాసం
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కలెక్టరు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్ ఎస్ఈసీకి వివరించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని అన్నారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం, ఎన్నికల సంఘం “ఢీ” అంటే “ఢీ”
వైఎస్ తో విడదీయరాని అనుబంధం:
అధికారుల సమీక్షా సమావేశం అనంతరం నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి సత్సంబంధాలున్నాయని అన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేసినట్లు తెలిపారు. వైఎస్సార్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదని అన్నారు. ఎవరికీ భయపడనని సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ జరగడం రాజ్యాంగ హక్కని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం పట్ల అపార నమ్మకం ఉందని నిమ్మగడ్డ తెలిపారు. తాను ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదని ప్రజాస్వామ్యంలో బలవంతపు ఏకగ్రీవాలు మంచి కాదని మాత్రమే చెబుతున్నానని అన్నారు. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: సర్కార్ జీవోతో నిమ్మగడ్డ అప్రమత్తం
ఎస్ఈసీని కలిసిన టీడీపీ నేతలు:
గత పరిషత్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో జరిగిన అక్రమాలపై టీడీపీ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.