Thursday, November 21, 2024

అంతా అంతే!

కాలంతో పాటు కాకినాడ మారినట్టే

జ్ఞాపకాలూ మారిపోతాయి

భావనారాయణుడి గుళ్ళో

నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు

వరి కంకుల కోసం పోయి పోయి

వరదలో చిక్కుకున్నట్టు – అంతా అంతే!

వెక్కిరించాడంటే సమాజాన్ని

వెంకటచలానిదా తప్పు!

నేరేడు చెట్టు కింద  పళ్ళేరుకుందికి

పందెం వేసుకుని పరుగులు పెట్టిన

కాలేజీ అమ్మాయిలు ఎందరో

నవ్వులన్నీ ఇగిరి పోయి

ఉప్పుమళ్ళై పేలిపోయి

వంట రుచుల్లో కరిగిపోయారు.

వెయ్యగా వెయ్యగా గులకరాళ్ళు

నీళ్ళెప్పటికో పైకొస్తాయని

వెతుకుతూ వెతుకుతూ వెర్రి కాకులమై

ఎండ పడ్డ కలలతో

ఎంత దాహంతో ఉన్నాం! ఏమై పోతున్నాం!

మామిడి తోటలొదిలేసి

ఇసక మేటలొదిలేసి

ఓ అయ్య చేతిలో పెట్టి

ఇల్లు కట్టుకోమన్నారని కదా

ఇంత దూరాలొచ్చేసాం.

ఏం చేస్తున్నారంటే

పిల్లలతో గిన్నెలతో

మీరు మాత్రం ఏం చెప్తార్లెండి!

మన ఆశలు కాలవగట్టు పొలాలు కావుగా

ఏటి పొడవుతా పచ్చగా ఏదో ఒకటి పండటానికి!

మరెలాగంటే చెప్పలేం.

పొడుపు కథలు విప్పలేం!

ఏమీ తెలియని తనంలో ఎంత సుఖం!

సపోటా చెట్ల మీద చదువుల  సన్నాహాలు

సర్పవరం పూతోటల్లో పుప్పొడి సరాగాలు

ఏమర్రా!

చండామార్కుల వారింకా ట్యూషన్లే చెబుతున్నారా?

మెక్లాన్ హైస్కూలు మలుపులూ

గోదావరి కాలవ దాటి

పాత జగన్నాథ పురంలో

తాతల నాటి సందులూ!

వెంట బడిన కుర్రాళ్ళని చూసి వెక్కిరింతలూ

కంటి కొనల కవ్వింతలూ కేరింతలూ

అంతేలే!

పారిపోయిన పదహారో ఏడు మరి తిరిగి రాదు.

తన పని తాను చేసుకుంటూ

బల్ల కట్టు మాదిరి ఆ గట్టూ ఈ గట్టూ తిరుగుతుంది జీవితం!

తొలి యవ్వనం మళ్ళి పోయింది.

కాలంతో పాటు కాకినాడ మారినట్టే

జ్ఞాపకాలూ మారిపోయాయి!

Also read: అమ్మా, నీకు వందనమే!

Also read: శరీరం!

jayaprabha

Jayaprabha Anipindi
Jayaprabha Anipindi
జయప్రభ ప్రఖ్యాత కవి, స్త్రీవాద రచయిత్రి. విమర్శకురాలు. కథలూ, వ్యాసాలూ అనేకం రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles