- జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు
- వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు
బల్దియా ఎన్నికలకు సకల ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల కమిషనర్ పార్థ సారథి తెలిపారు. బ్యాలెట్ పెట్టెలు సర్కిళ్ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకున్నాయి. ఏ డివిజన్లో నైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి, పరిశీలన తర్వాత ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అథారిటీ డీఎస్ లోకేష్ కుమార్ ప్రకటించారు.
ఎన్నికల బరిలో 1122 మంది అభ్యర్థులు
నగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 44 వేల 260 కాగా అందులో పురుష ఓటర్లు 38 లక్షల 76 వేల 688 అని మహిళా ఓటర్లు 35 లక్షల 65వేల 896 మంది అని, ఇతరులు 676 మంది ఓటర్లు అని ఎస్ఈసీ తెలిపారు. మొత్తం 150 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 1122 మంది బరిలో ఉన్నారు. వీరిలో అధికార టి.ఆర్.ఎస్ నుంచి 150 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బిజెపి నుంచి 149 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 146 మంది, టి.డి.పి నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సి.పి.ఐ 17మంది, సి.పి.ఎం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76 మంది కాగా, స్వతంత్ర అభ్యర్థులు 415 ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
పోలింగ్ విధుల్లో సిబ్బంది
పోలింగ్ విధుల్లో 48,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఉంటారు. అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించేందుకు 34 మంది వ్యయ పరిశీలకులను ఎన్నికలను గమనించేందుకు 14 మంది సాధారణ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. 1729 మంది మైక్రో అబ్జర్వర్ లను నియమించిన ఎన్నికల సంఘం, తొలిసారి 2277 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పోలింగ్ కు 28 వేల 683 బ్యాలెట్ బాక్స్ లను ఉపయోగిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 2831 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
నగర వ్యాప్తంగా మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగాను, 2934 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవి గాను, 4415 పోలింగ్ కేంద్రాలను సాధారణమైనవి గాను గుర్తించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ జరిగే ప్రాంతాలలో 450 పోలింగ్ ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి గా గుర్తించారు. 921 పోలింగ్ ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగాను గుర్తించారు. 1548 పోలింగ్ ప్రాంతాలను సాధారణమైనవిగాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు..
ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండేందుకు 52,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 30 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లను వినియోగించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేశారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి చేయడం జరుగుతుంది.
ప్రత్యేక క్యూ లైన్లు
కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులలో ఏ ఒకటి ఉన్నా ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు.
డిసెంబర్ 1న ఉదయం 5:30 గంటల కల్లా ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఎస్ఈసీ తెలిపింది. ఉదయం 6గంటలకు పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలలో హాజరుకావాల్సిఉంటుంది. ఉదయం 6గంటల నుండి 6:15గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేస్తారు. ఉ 7గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది.
Thanks for sharing this wonderful information I really enjoyed to reading it. Keep up the good work. If you have time, please visit our posts on.