సాయం సంధ్య వేళ… పశ్చిమాద్రి వాలులోకి
మెల్లగా జారుతున్న అలసిన అరుణార్కుడు…
…ఎవరో పిలిచినట్లు,
ఎదో మత్తు లో, తెలియని పరవశంలో
ఎంత దూరం నడచానో, ఎంత కాలం నడచానో…
పాదాల క్రింద మెత్తని ఇసుక తిన్నెలు…
ఎదురుగ ఆహ్వానిస్తున్న విశాలమైన జలనిధి…
మూతలు పడుతున్న కనులకు
అది సాగరమో, సరస్సో, నదో, పిల్ల కాలువో…
తెలియని స్థితి.
కొంచెం ముందుకు పొయి చూసా…
స్వచ్ఛమైన జలాలు…
వైతరణి కాదు కదా?!… నవ్వుకొన్న.
మెల్లగా ఇసుక పై వాలి నీటి లోనికి చూసా…
ఏదీ నా ప్రతిబింబం?
చిరుగాలి కే సుడులు తిరుగుతున్న నీరు…
అక్కడక్కడా రాలిన పండుటాకులు
అటు ఇటు తేలుతూ దారితప్పిన నావికులలా…
మరల తొంగి చూసా…
ఊహూ…ఈ నీరు మనిషి మనసులాగనే, చంచలం
చిన్న పాటి కలతకే కల్లోలితం అవుతుంది ..
నీటి అడుగున దశాబ్దాలుగా దాచిన, పేర్చిన
జ్ఞాపకావక్షేపాలు ఒక్కసారిగా పైకి లేచి
భేదిత పట్టకంలా…
ధూమ దూషిత నభస్సులా…
కలుష కాషాయమై…
గాఢమై, గాఢతరమై, కఠినమై, కర్కశమై
శిలా సదృశం అవుతుంది.
అవును, నీరు, మనసు ఒక్కటే…
నాకు మిగిలినదీ ఈ ఒక్కటే
…ఈ దర్పణం…
సూర్యుడు క్రుంగె లోపల, చీకటి పొరలు కప్పేలోపల
ఏదీ… చూసుకోనీ నా ప్రతిబింబం…
వణికే చేతులతో నీటిని తడిమా…
రామ, రా… మా… ఆక్రోశించా, అరిచా,
తిట్టా, బుస కొట్టా
అతనిపైనే నా ఆఖరు నమ్మకం
అతనిపైనే నాకు మొదటి నుండి సందేహం…
ఈ పరివేష్టిత ఘోర నిశ్శబ్దాన్ని భంగం చేయడానికన్నట్లు,
విసుగు చెంది నీటిపైకి చిన్న, చిన్న రాళ్లు విసిరా.
నా నిరీక్షణ ఫలిస్తుందా?
నేను ఇంక అక్కడే ఉన్న…
నీరు నిర్మలమవుతుందనే ఆశతో…
నీటి లో నా అసలు ‘నేను’ చూడాలనే కాంక్షతో…
ఈ ఆశ, కాంక్ష, కోరిక… కరిగితే గాని
అది తెలియదని…
‘మేను’ ను, ‘నేను’ ను మరచితే గాని
ఆ నేను కాని నేను అవగతం కాదని…
ఎదో లీలగా, ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా
ఒక విచిత్ర వాణి…
ఇంతలో నెలవంక నింగిని పొడిచింది…
మంత్రముగ్దమైనట్లు జలాలు జడమైనాయి…
నీటిలో చంద్ర బింబం… అందులో నా ప్రతిబింబం…
అంతలోనే వేయి వ్రక్కలై నీటిలో కరిగి కలిసి పోయాయి…
ఇప్పుడు ‘నేను’ లేను… అయినా ఉన్నాను…
నా ముఖం పై ఒక్కసారి చిరునవ్వు తళుక్కు మన్నది,
నెలరాజు నవ్వాడు… “చంద్రమా మనసో జాతః… “
అంటూ ఒక్కసారి గా ముందుకు కదిలా…
“పూర్ణ మదం, పూర్ణ మిదం… “
“తత్వమసి,
అహం బ్రహ్మాస్మి,
ఏకం బ్రహ్మ, అద్వితీయం… “
ఉపనిషద్ వాక్యాలు వినపడ్డాయి.
డు, ము, వు, లు, ఒడ్డునే వదిలి వేసి
నీటిలోనికి అడుగు పెట్టా.
Also read: ఆకాశ హర్మ్యం
Also read: బాస
Also read: సుదీర్ఘ ప్రయాణం
Also read: అట, అకటా
Also read: మందల