Sunday, December 22, 2024

ఎటర్నల్ ఎండీ, రామకృష్ణ ప్రసాద్!

కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ గారు నాకు అత్యంత ఆత్మీయులు. శాసనమండలి మాజీ అధ్యక్షుడూ, స్వాతంత్ర్య సమరయోధుడూ గొట్టిపాటి బ్రహ్మయ్యగారి దౌహిత్రుడు (కూతురి కొడుకు). ‘ఉదయం’ దినపత్రిక మొదలు కాకముందు నుంచీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా ఆయన నాకు పరిచయం. ‘ఉదయం’ కుటుంబానికి ఆయన ఎప్పటికీ ఎండీగారే. ‘ఉదయం’ సంచలనాత్మకంగా ప్రారంభమై కొంతకాలం దేదీప్యమానంగా వెలిగి గడ్డుకాలం దాపురించి మూతపడింది. ఒక అర్ధ దశాబ్దంపాటు అప్రతిహతంగా సాగిన ‘ఉదయం’ ప్రభకు త్రిమూర్తులు నాయకత్వం వహించారు. సారథి దర్శకరత్న దాసరి నారాయణరావుగారు. సంపాదకుడు ఏబీకే ప్రసాద్ గారు. యాజమాన్యానికీ, ఉద్యోగులకూ మధ్య వారథి, మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ ప్రసాద్ గారు. దాసరి మద్రాసులో సినిమా దర్శకత్వం, నటన, రచన వగైరా కార్యక్రమాలలో నిర్విరామంగా ఉంటూ, మా జీతాల కోసం డబ్బు తెచ్చి ఇస్తూ,  అందరినీ పలకరించి మద్రాసు వెళ్తూ ఉండేవారు. ఏబీకే గారు తన సంపాదకీయ రచనలో, పరిశోధనాత్మక కథనాలపైన నిర్ణయాలు తీసుకునే పనిలో మునిగి తేలుతూ ఉండేవారు. ఉద్యోగులందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, వారి బాగోగులను విచారిస్తూ, వారితో చనువుగా మాట్లాడుతూ, వారిని ప్రోత్సహిస్తూ,కధ సాఫీగా నడిచేటట్టు చూసేవారు మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ ప్రసాద్ గారు. ఉద్యోగులకు అండగా ఉండేవారు.

విజవాడలో మొదటి కైనటిక్ హోండా నాదే

‘ఉదయం’ పత్రిక రెండు ఎడిషన్లతో- హైదరాబాద్, విజయవాడలో- 1984 డిసెంబర్ చివరి వారంలో ఆరంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావుగారు ఉండేవారు.  హైదరాబాద్ లో ఏబీకే, వాసుదేవరావు, పతంజలి వరుసగా సంపాదకుడిగా, సహాయ సంపాదకుడుగా (అసిస్టెంట్ ఎడిటర్), వార్తాసంపాదకుడిగా (న్యూస్ ఎడిటర్) ఉండేవారు. నన్ను విజయవాడ ఎడిషన్ ఇంచార్జిగా నియమించారు. నాతోపాటు చురుకైన, తెలివైన, సమర్థులైన యువకులను పంపించారు.  ఎండీగారి స్వగ్రామం కృష్ణా జిల్లా  ఘంటసాల. భార్యాపిల్లలూ విజయవాడలోనే మకాం. అందువల్ల ఆయన తరచుగా విజయవాడ వచ్చి ఆఫీసులో కూర్చుండేవారు. మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడేవారు. విజయవాడ ఎడిషన్ ప్రారంభించిన మర్నాడు దాసరిగారు విజయవాడ వచ్చారు. అదే ఆయనను నేను చూడటం, కలుసుకోవడం. విజయవాడ ఎడిషన్ దాసరిగారికీ, ఎండీగారికీ బాగా నచ్చింది. నాకు కైనటిక్ హోండా కొనిపెట్టమని ఎండీగారు సిఫార్సు చేస్తే దాసరిగారు వెంటనే ఆమోదించారు. విజయవాడలో మొదటి కైనటిక్ హోండా నడిపిన ఘనత నాదే. అన్ని ప్రమోషన్లూ అడగకుండానే ఇచ్చారు.

పరిశోధనాత్మక కథనాలకు ప్రోత్సాహం  

నిత్యం పత్రిక నిర్మాణంలో నిమగ్నమై హడావిడిగా ఉండే మాకు ఎండీగారు విజయవాడలో ఉంటే ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేది. సాయంత్రం అయిదున్నర, ఆరుగంటల ప్రాంతంలో ఎండీగారు రమ్మంటున్నారంటూ బాయ్ వచ్చేవాడు. వెళ్ళేసరికి మెరపకాయ బజ్జీలు తెప్పించేవారు. అంకబాబుగారు అందుబాటులో ఉంటే ఆయనను కూడా పిలిచి ఆ రోజు వార్తావిశేషాలు తెలుసుకునేవారు. పరిశోధనాత్మక కథనాలను ప్రోత్సహించేవారు. యాజమాన్యం తరఫున అభయం ఇచ్చేవారు. అరగంట ఆయన గదిలో కూర్చొని కబుర్లు చెప్పి టీ తాగి పైకి డిపార్ట్ మెంట్ లోకి వెడితే తెల్లవారుజాముదాకా పనిలో మునిగిపోయేవాళ్ళం. ఎంత శ్రమనైనా మరిపించే సమ్మోహన శక్తి ఎండీగారి చిరునవ్వుకు ఉండేది.

పద్మగారి సందడి

దాసరిగారూ, ఎండీగారూ ఇద్దరూ ఆఫీసులో ఉంటే మాకు పట్టలేని ఆనందం, ఉత్సాహం.  దాసరిగారు విజయవాడ వస్తే కాంధారి (ఇప్పుడు మురళీ ఫార్ట్యూన్)లో దిగేవారు. అప్పుడప్పుడ దాసరి పద్మగారు ఆఫీసుకు వచ్చి సందడి చేసేవారు. ఒకసారి ఆమె మేడమెట్లు ఎక్కి డెస్క్ దాటుకొని నా గదిలోకి వచ్చారు. వస్తూనే ‘ఏమిటి కుర్రవెథవలంతా సిగరెట్లు తాగుతున్నారు. ఇదేం ఆఫీసు. క్రమశిక్షణ లేదా? క్లబ్ లాగా ఉంది కానీ ఆఫీసు వాతావరణం లేదు’ అంటూ చిరాకు ప్రదర్శించారు. నేను ఎండీగారికి ఫోన్ చేశాను. ఆయన వెంటనే వచ్చి, ‘నవ్వు రా అక్కా. ఇదంతా మూర్తిగారి సామ్రాజ్యం. మనం ఇక్కడికి రాకూడదు. మూర్తిగారి తో పనుంటే రమ్మంటే ఆయనే వస్తారు కిందికి,’ అని చెప్పి ఆమెను కిందికి తీసుకొని వెళ్ళారు. ఏ సమస్య వచ్చినా తనదైన రీతిలో పరిష్కరించేవారు.

కొండంత అండ

‘ఉదయం’లో రోవింగ్ కరెస్పాండెంట్ల వ్యవస్థ ఉండేది. పరిశోధనాత్మక జర్నలిజం మంచి ఊపులో ఉన్న రోజులవి. ఏదైనా రిస్క్ తో కూడిన కథనం వేయాలంటే ఏబీకే గారితో పాటు దాసరిగారి ఆమోదం కూడా పొందవలసి వచ్చేది. మాకు తోడుగా ఎండీగారు ఉండేవారు. కొన్ని సందర్భాలలో ఆయనే నిర్ణయం చెప్పి ఆ తర్వాత దాసరిగారికి నచ్చజెప్పేవారు. అటువంటి అవగాహన, చనువు, విశ్వాసం ఉండేవి మా మధ్య. ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన వార్త వేయకపోయినా, పేజీలు ఇవ్వడం ఆలస్యమైనా, ఏజెంట్ ఎవరైనా ఫిర్యాదు చేసినా మా దగ్గరిదాకా వ్యవహారం వచ్చేది కాదు. వారితో ఎండీగారు మా పక్షాన వాదించేవారు. విజయవాడలో, కోస్తా నగరాలలో పరిశోధనాత్మక వార్తలు రాసి ప్రచురించే సందర్భాలలో ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా మా దాకా రానిచ్చేవారు. ‘ఆయన ఇష్టమయ్యా, ఆయనకు నేను చెప్పలేను. కాకపోతే రేపు ఖండన ఇవ్వండి. వేయమని రిక్వెస్టు చేస్తా’ అని చెప్పేవారు. అటువంటి స్వేచ్ఛ మాకుండేదని చెబితే నేటి తరం జర్నలిస్టులకు నమ్మశక్యం కాదు.  అందుకే ‘ఉదయం’ దాసరి సారథ్యంలో నడిచినంత కాలం సర్వస్వతంత్రంగా, నిర్భయంగా, నిజాయితీగా, నీతిగా ఉండేది. మాగుంట సుబ్బరామిరెడ్డిగారు 1989లో కొనుగోలు చేసిన తర్వాత పత్రిక నకడ మారింది. సుబ్బరామరెడ్డిగారు కాంగ్రెసె నేత. పార్లమెంటు సభ్యుడు. తిరుపతి ఏఐసీసీ సభలను దిగ్విజయంగా నిర్వహించి ప్రదాని పీవీ నరసింహారావుకు ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రాథమ్యాలు సహజంగానే భిన్నంగా ఉండేవి. దాసరి నడిపినంత కాలం ఎవ్వరితో  మొహమాటాలు లేవు. ఎవరన్నా భయం లేదు.  పార్టీల పట్టింపులు లేవు. కులాల ప్రస్తావన లేదు.  

ఉదయం’ ఆగిపోయినా అనుబంధం కొనసాగింది

‘ఉదయం’ నుంచి దాసరి నిష్క్రమించినా ఆయనతో, ఎండీగారితో మా సంబంధాలు కొనసాగాయి. దాసరి కుటంబ  సభ్యులుగానే మమ్మల్ని పరిగణించేవారు. ఎండీగారు దాసరితోనే ఉండేవారు. రామకృష్ణ ప్రసాద్ గారి  పిల్లలూ, మేనల్లుళ్ళూ అందరూ మాతో స్నేహంగా, ప్రేమగా ఉండేవారు. 25 మే 1995 నాడు ‘ఉదయం’ మూసివేసిన తర్వాత సుమారు సంవత్సరం కాలం ఆ  కాంపౌండ్ లోనే ఉన్నాం. మాగుంట సుబ్బరామరెడ్డిగారి హత్య తర్వాత రాయలసీమ పేపర్ మిల్లు యజమాని సత్యప్రసాద్ గారు ‘ఉదయం’ బాధ్యతలు తీసుకొని తిరిగి నడిపించే ప్రయత్నం చేశారు. సత్యప్రసాద్ గారి మిత్రుడు, ప్రస్తుతం వైఎస్ ఆర్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య చీఫ్ ఎడిటర్ గా, నేను ఎడిటర్ గా, నండూరి రామమోహన్ రావుగారు అడ్వైజరీ ఎడిటర్ గా పత్రిక నడపాలని సన్నాహాలు చేశాం. అప్పుడు రామకృష్ణప్రసాద్ గారు కొత్త యాజమాన్యంతో కలసి పని చేశారు. మళ్ళీ ఆయనతో రోజూ కలిసే అవకాశం కలిగింది. సుబ్బారాయుడుగారు జర్నలిజం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. మొత్తంమీద పత్రిక తిరిగి ప్రారంభం కాలేదు. అవాంతరాలు వచ్చాయి. అందరం ఎవరి దారిన వాళ్ళం వెళ్లిపోయాం.

ఉత్తమ జర్నలిస్టులను తయారు చేశారు

‘ఉదయం’లో పనిచేసే వాళ్ళందరూ ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నా ఆ పత్రిక గురించి, నాటి సంగతుల గురించి మాట్లాడుకుంటూ గంటలు గడపడం రివాజు. పేర్లు రాస్తే చాంతాండంత అవుతుంది. ఎవరి పేరు మరచిపోయినా క్షమించరాని నేరం అవుతుంది. అందుకని పేర్లు రాయడం లేదు.  ‘ఉదయం’ పత్రిక పదకొండు సంవత్సరాలు కూడా నడవకపోయినా, ఆ పత్రికలో పని చేసినవాళ్ళందరూ వివిధ పత్రికలలో అగ్రస్థానాలలో పని చేశారు. వృత్తిలో రాణించారు. స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయడానికి అవసరమైన వాతావరణం సృష్టించడంలో ఎండీగారిది ప్రధాన పాత్ర. అందరూ వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఉదయం’ కుటుంబం అంతటికీ పెద్దదిక్కుగా రామకృష్ణ ప్రసాద్ గారు వ్యవహరించేవారు. ఆయన కడవరకూ దాసరితోనే ప్రయాణం సాగించిన కారణంగా ఇద్దరితోనూ మా సంబంధాలు కొనసాగాయి.

కోలుకున్నారని అనుకున్నా

ఎండీగారి ఇద్దరు కొడుకులూ బుద్ధిమంతులు. బాగా చదువుకొని స్థిరపడ్డారు. పెద్ద కొడుకు అమెరికాలో ఐటీ ఉద్యోగం. రెండో కొడుకు హైదరాబాద్ లో వ్యాపారం. కొన్ని మాసాలుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆక్సిజన్ సిలిండర్ పక్కనే జీవితం. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే మంగళవారు తెల్లవారు జామున గుండెపోటు వచ్చి తుది శ్వాస వదిలారు. పెద్ద వయస్సు కాదు. 75 సంవత్సరాలే. కిమ్స్ హాస్పిటల్స్ అధిపతి డాక్టర్ భాస్కరరావు పాతికేళ్ళ కిందట రామకృష్ణ ప్రసాద్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించినప్పుడు నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో చాలా సేపు ఫోన్ లో అన్ని విషయాలూ సాకల్యంగా మాట్లాడారు. బాగానే కోలుకున్నారు కదా అనుకున్నా. కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత కలుసుకుందామని అనుకున్నాం.

‘ఉదయం’ పునరుద్ధరణ ప్రయత్నంలోనూ…

కోవిడ్ కారణంగా తరచుగా కలుసుకోలేకపోయినా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కొన్ని మాసాల కిందట నేనూ, ‘వార్త’ సంపాదకులు సాయిబాబాగారూ ఎండీగారింటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి రెండు, మూడు గంటలు కబుర్లు చెప్పుకొని వచ్చాం. మంగళవారంనాడు మధ్యాహ్నం ఎండీగారి పార్థివదేహాన్ని మహాప్రస్థానంలో చూసినప్పుడు దు:ఖం ఆగలేదు. ప్రతి ఉదయం మొబైల్ లో  శుభోదయం పెడుతూ సమాధానం ఇవ్వనక్కరలేదనీ, తన సంతోషం కోసం గ్రీటింగ్స్ పంపుతుంటాననీ చెప్పారు. ‘ఉదయం’ పత్రికను పున:ప్రారంభించాలన్న బలమైన ఆకాంక్ష ఉండేది. ఎప్పుడు కలిసినా దాని టైటిల్ గురించీ, మళ్ళీ నడపడం గురించీ మాట్లాడేవారు. ఆయన జీతితంలో ‘ఉదయం’ ఒక మరుపురాని అధ్యాయం. ‘ఉదయం’ జీవితంలో ఆయనది ముఖ్యమైన భూమిక. ‘ఉదయం’తొ ముడివడిన జీవితాలూ, అనుబంధాలూ మావి. ‘ఉదయం’ హృదయంగా బతికినవాళ్ళం. 1995 తర్వాత ఎవరు ఎక్కడ పని చేసినా ‘ఉదయం’ కుటుంబం మాత్రం అవిచ్ఛిన్నంగా ఉంది. అందుకు ప్రధాన కారకుడు ఎండీగారంటూ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకూ పిలుచుకునే రామకృష్ణప్రసాద్ గారే. ఆయన ఎటర్నల్ ఎండీ. ఆయన లేని లోటు తీరనిది. నాబోటివారికి ఆయన ప్రాంత:స్మరణీయుడు.  

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles