కృష్ణాజలాలు – 5
నదీజలాలపైనా, నదీ లోయలలోని జలాలపైన రాష్ట్రాల మధ్య తలెత్తే విభేదాలు న్యాయవిచారణ ద్వారా పరిష్కరించేందుకు వీలు కల్పిస్తూ అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956ను తీసుకొని వచ్చారు. నీటి వివాదం అంటే ఏమిటి అనే ప్రశ్నపైన అత్యధికంగా వాదోపవాదాలు జరిగాయి. నీటి వివాదాలను విచారించే బాధ్యత నుంచి సుప్రీంకోర్టును ఆ చట్టం మినహాయిస్తుంది. కానీ ఫలానా వివాదం నీటి వివాదం అవునో కాదో నిర్ణయించే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు ఉన్నది. వివాదం తలెత్తినప్పుడు కానీ ఏదైనా రాష్ట్రం అభ్యర్థించినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. 1956 నదీజలాల మండళ్ళ (రివర్ బోర్డ్స్)చట్టం తీసుకురావడంలో ఉద్దేశం నదీజలాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలనే. ఈ విషయంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నదీ జలాల నియంత్రణ, అభివృద్ధి చేయవలసిన బాధ్యత కేంద్రానిదే. రివర్ బేసిన్ గా కేంద్రం దేనినీ గుర్తించలేదు. దేన్నీ శిరోధార్యంగా భావించలేదు. అలా చేసి ఉంటే రాష్ట్రాలకు సమాఖ్యస్ఫూర్తి కల్పించిన హక్కులకు భంగం కలిగి ఉండేది. చట్టం అమలు చేయలేదు కనుక దాని ఉద్దేశం కూడా నామమాత్రంగానే మిగిలిపోయింది.
Also read: నదులను కాజేయడం రాజ్యాంగబద్ధమా?
సమాఖ్య సూత్రాల ఉల్లంఘన
వివాదాల పరిష్కార క్రమంలో అస్పష్టత కారణంగానూ, సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించడం వల్లనూ అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదం సంక్లిష్టభరితంగానే తయారైంది. నాలుగైదు రాష్ట్రాలలో ప్రవహించే పొడవైన నదుల స్వభావాన్ని పరిశీలిస్తే రాష్ట్రాల మద్య సమన్వయం సాధించడానికి కేంద్రం పాత్ర అనివార్యం అవుతుంది. ఏకీకృత పర్యావరణ వ్యవస్థనూ, నదీజలాలనూ నిర్వహించవలసిన బాధ్యత కేంద్రంపైన ఉంటుంది. ఫలాలను ఇచ్చిపుచ్చుకోవడం, సమాలోచనల ద్వారా వివాదాల పరిష్కారానికి రాష్ట్రాలు సుముఖంగా ఉండాలి. కేంద్రానికి సకారాత్మకమైన పాత్ర ఉండాలనడం సహేతుకం, ఆచరణీయం. మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏది అనుకూలమో, ఏది ప్రతికూలమో నిర్ణయించాలి కనుక కేంద్రానికి అధికారాలు ఎక్కువే ఉంటాయి. అందుకే, కేంద్రం అనుమతించినంత వరకూ రాష్ట్రాలు నదీజలాలను వినియోగించుకోవచ్చు. రాష్ట్రాలు యధేచ్ఛగా నీటిని వినియోగించుకుంటే ఇతర రాష్ట్రాలు వివాదం సృష్టించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఒక రాష్ట్రాన్ని నదీజలాలు వినియోగించరాదని ఆదేశించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయా అన్నది ప్రశ్న.
Also read: నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం
ఎడతెగని, ఆవేశపూరితమైన వివాదాలు
అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలను పరిష్కరించడంలో పెద్దమనిషిగా వ్యవహరించవలసిన కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరితంగానూ, అక్రమంగానూ వ్యవహరిస్తోంది. కేంద్రం జోక్యం ఎంతవరకూ అనుమతించాలో పార్లమెంటు నిర్ణయించాలని సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. రాష్ట్ర జాబితా ప్రకారం అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాలన్నీ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. ఇది మరో గందరగోళం. కేంద్రం అధికారాలు పరిమితమైనవని ఇక్కడ అనిపిస్తుంది. 1956 అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదం చట్టాన్ని అనేక విడతల సవరించారు. కానీ నదీజలాల మండళ్ళ చట్టాన్ని (రివర్ బోర్డ్స్ యాక్ట్)ను ముట్టుకోలేదు. అమలు చేయనూ లేదు. మనకు రెండు రకాల నదీజలాల వివాదాలు ఉన్నాయి. ఒకటి దేశంలోనివి. ఉదాహరణకు తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ నదీజలాల వివాదం. ఇవి అంతరాష్ట్ర నదీజలాల వివాదాలు. రెండోది అందర్జాతీయమైనవి. ఉదాహరణకు చైనా, ఇండియాల మధ్య వివాదం. అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కారానికి ప్రవీణులతో సంఘాన్ని నియమిస్తే ఆ సంఘం నిర్ణయం (అవార్డు) ప్రకటిస్తుంది. కానీ ఈ చట్టంలోని సెక్షన్ 5(3) ప్రకారం ప్రవీణుల సంఘం ప్రకటించిన అవార్డును ఏ రాష్ట్రమైనా సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. ఈ అవకాశం లోపభూయిష్టమైనది కానీ, అనవరసరమైనది కానీ కాదు. నష్టపోయినట్టు భావించే రాష్ట్రానికి విషయాన్ని పున:పరిశీలించే వ్యవస్థ అంటూ ఒకటి ఉండటం అవసరం. ట్రిబ్యూనల్ కూడా న్యాయస్థానంలాగానే వివాదాన్ని పరిశీలించి న్యాయమైన తీర్పు చెబుతుంది. ట్రిబ్యూనళ్ళూ, కోర్టులూ వివాద పరిష్కారాన్ని ఏళ్ళూపూళ్ళూ వాయిదా వేయకుండా చూసేందుకు ఒక సంవత్సరంలోపు వివాదాన్ని పరిష్కరించాలని న్యాయస్థానాలకూ, మూడేళ్ళలోగా అవార్డు ఇవ్వాలని ట్రిబ్యూనళ్ళకూ నిబంధనలు విధిస్తూ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్టను 2002లో సవరించారు. తీవ్రమైన, అవేశపూరితమైన, జటిలమైన వివాదాల పరిష్కారాలకు గడువు విధించడం కూడా ఆచరణ సాధ్యం కాదు మరి.
Also read: విభజన రాజ్యాంగపరమైన అవసరం
Also read: జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి