- బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం
- హూజూరాబాద్ ఉపఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా ఈటల
హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిష్కృత నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలోకానీ, రాష్ట్రంలోకానీ ఉరిశిక్షపడ్డ వ్యక్తిని ఉరితీసే ముందు నీ చివరి కోరిక ఏంటని అడిగే సంప్రదాయం కొనసాగుతోంది. ఒక అనామకుడు ఉత్తరం రాస్తే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికి రాత్రే తనను శాఖ నుంచి తప్పించి, వెనువెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారని ఆయన ఆరోపించారు.
Also Read: పెరుగుట విరుగుటకొరకే
తెలంగాణ రాష్ట్ర సమితితో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెగ తెంపులు చేసుకున్నారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు. తనకు పదవులు త్రుణప్రాయమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశానని, ఎన్నికల బరిలో దిగిన ప్రతిసారి తెలంగాణ చిత్రపటంపై ప్రజలు గర్వపడేలా గెలిచివచ్చానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం నుంచే అవమానించడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రినైన తనకే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్, ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని, అంతిమ విజయం ధర్మానిదేనని అన్నారు.
తనను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న హరీశ్‌రావుకు కూడా అవమానం జరిగిందని ఈటల వివరించారు. ప్రగతి భవన్ బానిసల నిలయంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా లేరని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంలో ఉన్నవారిని అణిచివేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఈటల విమర్శించారు.
Also Read: తెలుగుకు విశేషరూపం ఎన్టీఆర్!
అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సీఎం ఎస్సీ అని చెప్పారు. సీఎంవో కార్యాలయంలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారి ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఈటల రాజేంద్ర ఇటీవల దిల్లీ వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డానూ కలసి సమాలోచనలు జరిపి వచ్చిన సంగతి తెలిసిందే. తనపైన వేటు పడిన తర్వాత ఈటల కాంగ్రెస్ నాయకులతోనూ, బీజేపీ నాయకులతోనూ సమాలోచనలు జరిపారు. సొంతంగా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. చివరికి బీజేపీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, టీఆర్ఎస్ పై పోరాటానికి కాంగ్రెస్ కంటే బీజేపీ బలమైన పార్టీగా ఈటల భావించి ఉంటారని అనుకోవాలి. ఆయన కొద్ది రోజులలో దిల్లీ వెళ్ళి అగ్రనాయకుల సమక్షంలో బీజేపీలో చేరతారు. హుజూరాబాద్ నుంచి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ పైన విజయం కోసం ఈటల ఇప్పటి నుంచే పరిశ్రమించవలసి ఉంటుంది.
Also Read: నిశ్శబ్ద గీతిక