- బీజేపీ గెలిస్తే ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పొంగుతుంది
- తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉద్వేగం పెరుగుతుంది
- 2023 నాటి ఎన్నికలకు రోడ్ మ్యాప్ బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద సిద్ధం
- ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
- బండి సంజయ్, కిషన్ రెడ్డి సంగతేమిటి?
అశ్వినీకుమార్ ఈటూరు
హైదరాబాద్ : మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సంపాదించి గణనీయమైన వ్యత్యాసంతో గెలుపొందుతే ఆయన జాతకం మారే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ లో, ఈశాన్య రాష్ట్రాలలో చేసిన ప్రయోగాన్నే తెలంగాణలో కూడా చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్టు భోగట్టా. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రణాళిక వేసుకున్నది. హుజూరాబాద్ ఉపఎన్నికే ప్రాతిపదికగా ఒక వ్యూహరచనకు బీజేపీ శ్రీకారం చుడుతుంది.
ఈటల రాజేంద్రను భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీలో ఇంతవరకూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ కానీ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుడుగు వేస్తారని ఇంతకాలం భావించారు. కానీ ఈటల రాజేంద్ర రాజకీయ వ్యక్తిత్వం ఎదుట ఇద్దరూ తేలిపోతారు. ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావడం, ఏడేళ్ళు మంత్రిగా ఆరోగ్య, ఆర్థిక వంటి ముఖ్యమైన శాఖలు నిర్వహించడం, బీసీ నాయకుడు కావడం, అన్ని ఒడ్డిపోరాడిన టీఆర్ఎస్ ను హుజూరాబాద్ లో ఓడించడం మరెవ్వరికీ లేని అర్హతలు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా సంగ్రామం కేసీఆర్, ఈటల మధ్య సాగినట్టుగానే భావించాలి. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ హుజూరాబాద్ లో ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినప్పటికీ అర్థబలం పూర్వకంగా కానీ, అంగబలం పూర్వకంగా కానీ సర్వశక్తియుక్తులనూ కేసీఆర్ వినియోగించారు. అనేక యుద్ధముల ఆరితేరిన మేనల్లుడు హరీష్ రావును కొన్ని నెలలపాటు హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేసి విస్తృతంగా ప్రచారం చేయించారు. ఎన్నికల కమిషన్ ఆంక్ష విధించకపోతే కేసీఆర్ హుజూరాబాద్ సమీపంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. అందుకనే హుజూరాబాద్ లో కనుక ఈటల రాజేందర్ గణనీయమైన మెజారిటీతో గెలుపొందుతే అతడి ప్రతిష్ఠ అమాంతంగా పెరుగుతుంది. దీన్ని వినియోగించుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన సువేందు అధికారిని పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టే అనివార్య పరిస్థితులలో టీఆర్ఎస్ నుంచి వైదొలిగి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజేందర్ ను తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపే అవకాశాలు ఉన్నాయని దిల్లీ వర్గాలు అంటున్నాయి. బీసీ నాయకుడిని కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలిపితే బీజేపీ ప్రాబల్యం పెరుగుతుందని దిల్లీ పెద్దలు భావిస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ గెలుపొందుతే అధికారపార్టీకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ సూచించినట్టు ఈటల రాజేంద్ర విజయం సాధిస్తే అధికారపార్టీలో చీలిక వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢంకా బజాయించి చెపుతున్నారు. టీఆర్ఎస్ ఎంఎల్ ఏలు తనతో సంపర్కంలో ఉన్నారనీ, వారు కొద్ది రోజులలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారనీ రేవంత్ బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా అధికారపార్టీపైనే ఉన్నది. వందమంది ఎంఎల్ఏలు బయటికి పోకుండా కాపాడుకోవాలి. ప్రభుత్వంపట్ల సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదుర్కోవాలి. నవంబర్ 14న వరంగల్లు విజయోత్సవాన్ని టీఆర్ఎస్ అట్టహాసంగా ఏర్పాటు చేయబోతున్నది. మంగళవారంనాటి ఫలితం అనుకూలంగా ఉంటే టీఆర్ఎస్ కు ఎదురు లేదు. వ్యతిరేకంగా ఉంటే మాత్రం దాని ప్రభావం విజయోత్సవంపైన ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపైనే ఈ మూడు పార్టీల భవిష్య ప్రణాళికలూ ఆధారపడి ఉన్నాయి.