- కర్ణాటక తర్వాత తెలంగాణలో జయభేరి, ధర్మేంద్రప్రధాన్
- పార్టీ విజయం కోసం కృషి చేస్తా, రవీందర్
- ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమష్ రాథోడ్, బాబయ్య చేరిక
దిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద్ర సోమవారంనాడు బీజేపీలో చేరారు. శాలువా కప్పి కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈటలకు పార్టీలోకి సాదరంగా స్వాగతం చెప్పారు. రాజేందర్ తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ రాథోడ్, అందె బాబయ్య, కరీంనగర్ జిల్లా పరిషత్తు మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, తదితరులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, తదితర బీజేపీ నేతలు ఈ సందర్భంగా హాజరైనారు. బీజేపీలో చేరిన వెంటనే తెలుగు ప్రముఖులతో కలసి ఈటల రాజేందర్ తదితరులు బీజేపీ జాతీయ అద్యక్షుడు జెపీ నడ్డా ఇంటికి వెళ్ళి ఆయనతో భేటి అయ్యారు.
బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజేందర్ తెలంగాణలో బీజేపీ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ విజయపతాకను ఎగురవేస్తుందనీ, ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనీ దర్మేంద్రప్రధాన్ అన్నారు. బండి సంజయ్ కూడా అదే రకమైన ధీమాను వెలిబుచ్చారు.