అశ్వినీకుమార్ ఈటూరు
- మహిళలు, యువత ముందడుగు
- నిశ్శబ్ద ఓటింగ్ తో ప్రజల నాడి దొరకడం లేదంటున్న ప్రవీణులు
- టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు
- ఇది 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ అంటున్నారు
- బీజేపీ వైపు మొగ్గు
తెలంగాణలో ఇంత ఉత్కంఠ రేపిన ఉపఎన్నిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఉత్కంఠకు తెరబడాలంటే నవంబర్ రెండో తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కావాలి. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టే లెక్క. డబ్బు, లిక్కర్ ప్రవాహం యథావిధిగా సాగింది. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థి కనుక గెలిస్తే టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అవుతుందని ప్రజల నమ్ముతారని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ గెలుపొందితే టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం తథ్యమని కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు.
టీఆర్ఎస్ కి పనికివచ్చిన అంశాలు ఏమిటి?
దళిత బంధు పథకం వల్ల లబ్ది చేకూరిందని టీఆర్ఎస్ నాయకులు నమ్మకంగా చెబుతున్నారు. ఉపఎన్నిక సమీపించిన తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రకటించిన దళితబంధు పథకం దళితులకు ప్రయోజనం చేకూర్చుతుందనీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 40 వేలమంది దళిత ఓటర్లు ఉన్నారనీ, దీని వల్ల టీఆర్ఎస్ కు ఆధిక్యం లభిస్తుందనీ అధికారపార్టీ నాయకులు అంటున్నారు. రైతు బంధు పథకంతో పాటు ప్రజాబలం కలిగిన నాయకుడు హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి విజయంకోసం విశ్వప్రయత్నం చేశారు. 12 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారు సాధారణంగా టీఆర్ఎస్ కు అనుకూలం. అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.
బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏమిటి?
అధికారపార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి చాలా ముందుగానే ఈటల రాజేంద్ర ప్రచారం ప్రారంభించారు. ఆయన అరు సార్లు అసెంబ్లీకి ఎన్నికైనారు. ఏడు సంవత్సరాలు మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల కంటే ఈటల ఈ నియోజకవర్గంలో ప్రజలకు చిరపరిచితుడు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకుల ప్రచారం ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉండనే ఉన్నదనీ, దానికి తోడు రాజేందర్ పట్ల ప్రజలలో సానుభూతి కూడా ఉన్నదని నాంపల్లి బీజేపీ కేంద్ర కార్యాలయంలోని నాయకుడు ఒకరు చెప్పారు.
‘సకలం’ ప్రతినిధి గమనించిన అంశాలేమిటి?
చివరి నిమిషం వరకూ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. ఫలితం ఊహించడం కష్టం. పోలింగ్ కు ముందు జరిపిన సర్వేలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రకటించిన సంస్థలు శనివారంనాడు పోలింగ్ సరళి చూసిన తర్వాత సందిగ్థంలో పడిపోయాయి. ఓటర్ల నాడి దొరకడం లేదని అంటున్నారు. మా ప్రతినిధి అంచనా ప్రకారం బీజేపీకి జమ్మికుంట, వీణవంకలో ఆధిక్యం రావచ్చుననీ, హుజూరాబాద్, కమలాపురం, ఇల్లంతకుంట మండలాలలో టీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తుందనీ అంచనా. జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్ ఓట్లలో 15 శాతం వరకూ ఈటల తనకు అనుకూలంగా చీల్చుకున్నారని అంటున్నారు.
రెడ్డి సామాజికవర్గం, బీసీలు రాజేందర్ కు అండగా నిలిచారు. మహిళలూ, యవత కూడా ఆయనకు మద్దతుగా ఓటు చేసినట్లు చెబుతున్నారు. ఉదయం ఓటింగ్ 50:50 కాగా మధ్యాహ్న తర్వాత సాయంకాలం వరకూ బీజేపీకి మొగ్గు ఎక్కువగా కనిపించింది.
కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని రంగంలో దింపడం కూడా రాజేందర్ కు కలసి వచ్చింది. టీఆర్ఎస్ సైతం రాజేందర్ కు దీటైన అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. యాదవ్ సామాజికవర్గం ఓట్లు సంపాదించవచ్చుననే లెక్కతో యాదవ్ యువకుడు గెల్లి శ్రీనివాస్ ను నిలబెట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని అంటున్నారు. కులం, సానుభూతి, కాంగ్రెస్ ఓట్లు బీజేపీ వైపు మొగ్గడం రాజేందర్ కి కలిసివచ్చిన అంశాలు. బీజేపీ పెద్ద మెజారిటీతో గెలుస్తుందంటూ చెప్పిన జోస్యం నిజం కాకపోవచ్చు. ఏ పార్టీ గెలిచినా మెజారిటీ స్వల్పంగానే ఉంటుంది. బీజేపీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.