- 31వ తేదీ దళిత బంధు ఇవ్వకపోతే
పోరాటం మొదలు పెడతానంటూ హెచ్చరిక
- కెసీఆర్ వెన్నుపోటు పొడిచారు.
- వాడుకొని వదిలి వేశారు.
- కళ్ళల్లో మట్టి కొట్టారు.
- ఈటెలరాజేందర్ బయటికి నెట్టిన కెసీఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి : డికె అరుణ
- ఈటల రాజేందర్ ను గెలిపిద్దాం,
- తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ భవిష్యత్తును మార్చుకుందాం
హుజూరాబాద్ నియోజకవర్గంలో శనివారంనాడు జరిగిన ఎన్నికల సభలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా, టీఆర్ఎస్ పైనా నిశితమైన విమర్శలు చేశారు.
‘‘కెసిఆర్ అహంకారం అణగాలి అంటే ఈటెల రాజేందర్ గెలవాలి. తెలంగాణలో అభివృద్ధి చెందింది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ప్రజల తరపున మాట్లాడుతున్నారు అని ఈటెల రాజేందర్ కి మంచి పేరు వచ్చింది అని కెసిఆర్ కి కడుపుమండింది. ఈటెలరాజేందర్ బయటికి నెట్టిన కెసిఆర్ నీ తెలంగాణ నుండి బయటికి నెట్టాలి. లేందంటే మనకు భవిష్యత్తు ఉండదు’’ అంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు డికె అరుణ అన్నారు.
‘‘ఈటలరాజేందర్ అహర్నిశలు అభివృద్ధి కోసం కృషి చేశారు. మీ అండగా ఉండే ఈటల ను గెలిపించుకుందామా? కెసిఆర్ నిలబెట్టిన డమ్మీనా? నియంత పాలన అంతానికి మంచి అవకాశం ఇది. తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ భవిష్యత్తును మార్చుకుందాం. నియంతకు ముక్కు తాడు వేద్దాం’’ అని పిలుపునిచ్చారు.
‘‘తుమ్మనపల్లి సరస్వతి నిలయం. కానీ దీనిని బార్ సెంటర్ గా మార్చారు హరీష్ రావు. అవకాశాలు ఇచ్చారు. తమ్ముడు అన్నారు. నా జీతం కూడా ఈటల రాజేందర్ ఇస్తా అన్నవాడు. ఎందుకు గొంతునులినారు?’’ అని హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
‘‘ఎర్రబెల్లి,మల్లారెడ్డి, సబితా లాగా మధ్యలో వచ్చిన వాన్ని కాదు. సొంత పార్టీ నేతలని కొన్న నీచపు పార్టీ తెరాసా. పొమ్మనలేక పోగపెట్టారు. వెన్నుపోటు పొడిచారు.వాడుకొని వదిలి వేశారు. కళ్ళల్లో మట్టి కొట్టారు. మొన్నటి ఎన్నికల్లో శత్రువుకి డబ్బులు ఇచ్చారు. ఇంటిమీద రైడ్ చేశారు. అయినా ప్రజలు నన్ను గెలిపించారు,’’ అంటూ ఈటల విమర్శించారు.
‘‘2012లో నేను, తుమ్మల, హరీష్ మొదటి ధిక్కార స్వరం డబుల్ బెడ్ రూం మీద వినిపించినం. ఎవరి జాగాలో వారు ఇల్లు కట్టుకొనే అవకాశం ఇవ్వాలి అని చెప్పినం. నేను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ సొమ్ము పేదలకు మాత్రమే చేరాలి అన్నాను. రైతు బంధు డబ్బున్న వారికి ఇవ్వొద్దు, కౌలు రైతులకు ఇవ్వాలని అన్నాను అది తప్పా? ధిక్కారం కాదు,ప్రజల అభిప్రాయం అది. పదవులకోసం పెదవులు మూయవద్దు అని జెండాకి ఓనర్లం అని చెప్పిన. కెసిఆర్ రాసి రంపాన పెట్టిండు. కెసిఆర్ వారసత్వం వస్తుంది అని అవమానాలు భరించి అయినా అక్కడే ఉంటున్నారు హరీష్’’ అని ఈటల వివరించారు.
‘‘కేటీఆర్ ఎన్నికలు చిన్నవి అంటున్నారు. చిన్నవే అయితే. 350 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎన్ని దావతులు ఇచ్చినా..తాగుతున్నారు..బయటికి రాగానే జై ఈటల అంటున్నారంట. ఇప్పుడు కెసిఆర్ దగ్గర ఉన్న మంత్రులు మంత్రులే కానీ గడ్డి పోసలు. బెల్లం ఉన్నదగ్గర ఈగలు ముసురుతాయి.అధికారం ఉంటేనే చుట్టూ ఉంటారు. కానీ అధికారం లేకుండానే ఇన్ని సంక్షేమాలు నా వల్ల వచ్చాయి,’’ అని చెప్పారు.
‘‘దళితబంధు వస్తది అంటే దళిత బిడ్డల రుణం తీర్చుకుంటున్న అని గర్వపడ్డాను. వెంటనే ఇవ్వాలి అని, కలెక్టర్ అజమాయిషీ ఉండవద్దు అని చెప్పింది నేను. బట్టకాల్చి మీద వేసినట్టు నా నెపం పెట్టీ దళిత బంధు ఇవ్వకుండా కెసిఆర్ తప్పించుకుంటున్నారు. కెసిఆర్ కి అల్టిమేటం ఇస్తున్నా. 31వ తేదీ దళిత బంధు ఇవ్వకపోతే పోరాటం మొదలు పెడతా’’ అంటూ అల్టిమేటమ్ ఇచ్చారు ఈటల రాజేందర్.
గుజ్జుల రామకృష్ణ రెడ్డి, మండల అధ్యక్షుడు కుమార్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు.