- టీకా పంపిణీకి విస్తృత ఏర్పాట్లు
- పేర్లు నమోదుకు అవకాశం
- ప్రాధాన్యతా క్రమంలోనే వాక్సిన్
కొవిడ్-19 టీకా అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ ను సక్రమంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి అన్ని అంశాలను ఈ కమిటీలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఎన్ సీసీ ఎన్ ఎస్ ఎస్, రైల్వే, రక్షణ విభాగాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రాధాన్యతా క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన డేటా బేస్ సిద్ధం చేయడం, వ్యవస్థను ఏర్పాటు చేయడం, వసతులు ఆర్థిక పరమైన ఏర్పాట్లను స్టీరింగ్ కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది.
శాఖల సమన్వయం తప్పనిసరి
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ కోసం ఏర్పాట్లు పంపిణీని పర్యవేక్షించాలి. టైమ్ లైన్లు నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలి. అదే తరహాలో కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎంపీడీవో నేతృత్వంలోని మండల టాస్స్ ఫోర్స్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సహాయంతో వ్యాక్సిన్ పంపిణీ సక్రమంగా జరిగేటట్లు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
టాస్క్ ఫోర్స్ కమిటీ విధి విధానాలు
వ్యాక్సినేషన్ సమయంలో ఇమ్యునైజేషన్ వంటి నిత్య ఆరోగ్య సేవలకు అవాంతరాలు లేకుండా పరిస్థితులను సమన్వయపరచుకోవాలి. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, వదంతులు ప్రచారం కాకుండా ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. ఆరోగ్య సంరక్షణ సిబ్బందితో పాటు పలు రంగాలకు చెందిన వారికి టీకాలు ఇవ్వనున్నందున క్రమానుగత సరఫరా, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలకు టీకా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.