Monday, January 27, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

( జె. సురేందర్ కుమార్, ధర్మపురి )

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ తరుణంలో కొన్ని రాజకీయ పార్టీల కీలక నేతలు పార్టీ మార్పు పై తర్జన భర్జన పడుతూ, ఆచితూచి అడుగులు వేయడానికి సమాయత్తమవుతున్నారు.   కొందరు నేతలు ఎంచుకున్న విధానం ప్రస్తుత తరుణంలో చర్చనీయ అంశంగా మారింది. కొందరు నేతలు సీఎం కేసీఆర్ రాజకీయ గ్రహస్థితి పై ఆరా తీస్తుండగా , మరికొందరు నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బంధుగణం వివరాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన హేమాహేమీలు ఆయా రాజకీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలో రాజకీయ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఫైర్ బ్రాండ్ గా బండి సంజయ్ ఇటీవల గుర్తింపు పొందారన్న చర్చ నెలకొని ఉన్న జిల్లాలో ఆయన ఏ మేరకు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తారో  అంతుబట్టని అంశంగా మారింది.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకొని అప్రతిహతంగా పాలన కొనసాగిస్తోంది. ప్రతిఎన్నిక, ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలలో, టిఆర్ఎస్ పార్టీ విజయపరంపర సాధించింది. ఈ ఘనత కేసీఆర్ కే చెందుతుంద నే  అంశం అంగీకరించాల్సిందే.  ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానాన్ని బి జె పి పార్టీ గెలుచుకొని టిఆర్ఎస్ విజయపరంపర కు బ్రేక్ వేసిందని చెప్పాలి. డిసెంబర్ మొదటి వారంలో  జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలలో బిజెపి పార్టీ నాలుగు స్థానాల నుంచి ఎదిగి 48 కార్పొరేటర్ స్థానాలు కైవసం చేసుకోగా టిఆర్ఎస్ పార్టీ 99 స్థానాల నుంచి 56 స్థానాలకు దిగజారింది. ఎంఐఎం 44 స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా ఎంఐఎం కు మూడవ స్థానం కాంగ్రెస్ రెండు సీట్లు రాగా, టిడిపి పత్తాలేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో టి ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్న్యాయం బిజెపి  అనే సంకేతాలు ప్రజలకూ, రాజకీయ పార్టీలకూ వెళ్ళాయి. బీజేపీలో చేరడానికి పలు రాజకీయ పార్టీల లోని కీలక నేతలు తహతహలాడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ రాజకీయ  ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట,  రాజకీయ సమీకరణాలు ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఘన చరిత్ర కెసిఆర్ అనేది వాస్తవం . ప్రతిపక్ష నేతలు సైతం ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు.  అధికార పార్టీలో అసమ్మతి నేతలు,  మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీని  వీడి బీజేపీలో  చేరడమా?  2023 వరకు వేచి చూడటమా? అనే మీమాంసలో  ఉన్నట్టు సమాచారం.  ప్రత్యేకంగా కెసిఆర్ రాజకీయ గ్రహస్థితి ఎలా ఉందో అంటూ కొందరు ఆ పార్టీకి చెందిన నాయకగణం తో పాటు కాంగ్రెస్, టిడిపి, వామపక్ష పార్టీల నాయకులు ఆరా తీస్తున్నట్టు చర్చ జరుగుతోంది. దీనికి బలమైన కారణం సీఎం కేసీఆర్  సహజంగా దైవభక్తి పరాయణుడు. ఆయన  ముహూర్తాలు,  తిథి,  వార నక్షత్రాలు ఆధ్యాత్మిక చింతన ,  వాస్తు , నక్షత్ర బలం తారాబలం, తదితర అంశాల పట్ల అపారమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నవాడు  అనేది జగమెరిగిన సత్యం.  ప్రస్తుత కాలమానపరిస్థితులు కెసిఆర్ కు రాజకీయపరంగా  అనుకూలమా ?  ప్రతికూలమా ?  అనే మీమాంస తో కొందరు ఆయన రాజకీయ గ్రహస్థితి  గూర్చి జ్యోతిష్య పండితులు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ గ్రహస్థితి

పలువురు జ్యోతిష్య పండితులు గతంలో అనేక ప్రచార మాధ్యమాలలో  ప్రచురితమైన కథనాలు, టీవీ ఛానల్ లో కొనసాగిన చర్చాంశాల సారాంశం నేపథ్యంలో ఆయన గ్రహస్థితి వివరాలు ఇలా ఉన్నాయి:

కెసిఆర్ 17 ఫిబ్రవరి 1954న ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదం, కర్కాటక రాశిలో జన్మించారు. జన్మ లగ్నం మేషం.  ఆయన జాతక లగ్న  రాశి నుంచి ప్రధాన యోగకారకుడు గురువు దశమ స్థానంలో ఉన్నాడు. కెసిఆర్ విజయ పరంపరలో గురువు స్థితి అత్యంత కీలక యోగా కారకంగా మారింది. తన మాట తీరు,  ఆధ్యాత్మికత, సంతానం కెసిఆర్ కు గురు స్థితి కారణంగా మారింది అంటారు.  కేతువు తృతీయ స్థానంలో, చంద్రుడు  కర్కట రాశి లో ఉచ్చ స్థితిలో ఉన్న శని సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో స్వ క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉంటూ కేసీఆర్ కు విపరీతమైన రాజయోగాన్ని ఇవ్వడంతోపాటు భాగ్య స్థానంలో రాహువు స్థితి పొందాడు.  శుక్ర,  శని గ్రహాల మధ్యన పరివర్తన యోగం ఉండటంతో ఆయనకు విపరీతమైన జన ఆకర్షణ ఇస్తున్నది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలగడం ఆరోగ్య విషయంలో కూడా శుక్ర అంతర్దశ కొనసాగడం ఆయనకు కలసి వస్తుందనేది గత అనేక సందర్భాలలో  జ్యోతిష్య పండితులు చర్చల సారాంశం ఇది.

బండి సంజయ్ బంధుగణం పై ఆరా

ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, తదితర హిందూ ధార్మిక సంస్థల భావజాలంతో మిళితమై ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరికలపై టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి వామపక్షాల పార్టీల కు చెందిన కొందరు అసమ్మతి నాయకులు సంశయిస్తున్నారు.  సెక్యులర్ నాయకులుగా ముద్రపడిన తాము బీజేపీలో చేరితే తమకు తమ అనుచరగణానికి  ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందోనని ఆలోచిస్తున్నారు.  ఆ పార్టీలో తమకు ‘గాడ్ ఫాదర్’ ఎవరనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు అనే చర్చ నెలకొంది. బిజెపి పార్టీ అధ్యక్షుడు బంధుగణం,  రక్త సంబంధీకులు, సన్నిహితుల  వివరాలపై వారు ఆరా తీస్తూ వారి వద్దకు వెళ్లి తాము ‘ఆయా పార్టీలలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాము. తమకు ఇలా అన్యాయం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదు నామినేటెడ్ పదవుల లో మొండిచెయ్యి చూపారు తమ పట్ల తమ అనుచరగణం పట్ల ఆయా పార్టీల నాయకులు వివక్షతను ప్రదర్శించారు’ అంటూ తనపై నమోదైన కేసుల వివరాలు తాము పార్టీలో ఉండి ఆర్థికంగా నష్టపోయిన విషయాలు తదితర అంశాలు వారికి వివరిస్తున్నారు. ‘మీరు నా గురించి అధ్యక్షుడికి చెప్పాలి’ అంటూ వారిని అభ్యర్థిస్తూ ముందస్తుగా చేరికలకు స్థానాలను రిజర్వు చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరికొందరు నేతలు ఏకంగా స్వామీజీలు పీఠాధిపతుల వద్దకు వెళ్ళి సలహాలు అడుగుతున్నట్టు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో రాజకీయ స్తబ్దత

దుబ్బాక గ్రేటర్ ఎన్నికల విజయాలతో జోరుమీదున్న బీజేపా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్  రాష్ట్రంలో ‘ఫైర్ బ్రాండ్’ గా యువతలో ఇమేజ్ ని సంపాదించుకున్నారు.  ఆయన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.  ఉమ్మడి జిల్లాలో  ఆయా పార్టీల కీలక నేతలను పార్టీలో చేర్పించడం,  రాజకీయ సమీకరణాలు ఆశించిన మేరకు లేక స్తబ్దత నెలకొని ఉందని చెప్పవచ్చు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి:

కరీంనగర్

టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా గంగుల కమలాకర్ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తన పదవికి రాజీనామా చేసి రేపోమాపో బీజేపీలో చేరనున్నారు ఈయన బాటలోనే మరో పదిమంది కార్పొరేటర్లు ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థలలో టికెట్లు రాని వారు అసమ్మతి నాయకులు ఇతర పార్టీలకు చెందిన నాయకగణం  భారీగా బీజేపీలో చేరే  అవకాశం ఉన్నట్టు జిల్లాలో చర్చ కొనసాగుతున్నది.

సిరిసిల్ల

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసమ్మతి అసంతృప్తి అధికార పార్టీ నేతలు లో ఉన్నా వారు బయటపడడం లేదు . ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి క్యాడర్ ఉన్న లీడర్లు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి నుంచి వలసలు ఇతర పార్టీలోకి ప్రస్తుతానికి వెళ్లే అవకాశం లేదని చెప్పవచ్చు.

వేములవాడ

టిఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ బాబు కొనసాగుతున్నారు. ఆయన పౌరసత్వ వివాదం కోర్టులో కొనసాగుతున్నది. ఆయన   జర్మనీ నుంచి రాకపోకలు కొనసాగిస్తారని చెప్పుకుంటున్నారు. ఆయన ఇక్కడ లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అనేక గ్రూపులు ఉన్నాయి. వేములవాడ మున్సిపల్ లో అధికార కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీ గా  దిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం ప్రచార సాధనాల్లో వచ్చింది. ఇక్కడ  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నాయకులూ, కార్యకర్తలూ బలంగా ఉన్నారు. ఎమ్మెల్యే పౌరసత్వంపై కోర్టు తీర్పు మేరకు రాజకీయ సమీకరణాలు మారవచ్చు.

కోరుట్ల

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధానంగా కోరుట్ల మెట్పల్లి  మున్సిపల్ కౌన్సిల్లో అసమ్మతి  రాగాలు వినిపిస్తున్నాయి. కోరుట్లలో నలుగురు,  మెట్పల్లి లో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీ మారడంపై  ఊగిసలాడుతున్నట్టు  సమాచారం.  ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి బలమైన లీడర్లూ క్యాడర్లూ ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి  అనేప్రాంతీయ రాజకీయ ఆధిపత్యం పోరు ఆయా రాజకీయ నేతల్లో కొనసాగుతూనే ఉంటుంది.

జగిత్యాల

టిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జగిత్యాల రాయికల్ మున్సిపల్ టిఆర్ఎస్  తో పాటు స్థానిక సంస్థలలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. గతంలో కాంగ్రెస్, టిడిపి పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరితే తమకు గుర్తింపు లేదని అధికార పార్టీలో అసమ్మతి రాగాలు నెలకొన్నాయి.  ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ , లీడర్ ఉన్నారు. బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నా ఆ పార్టీ లీడర్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో కేడర్లో ఉత్సాహం లేదు. ఈ సెగ్మెంట్లో ఎంఐఎం పార్టీకి కొంతమేరకు బలమైన క్యాడర్ ఉందని చెప్పవచ్చు. నలుగురైదుగురు కౌన్సిలర్లూ, మాజీ ప్రజా ప్రతినిధులూ త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

ధర్మపురి

నూతనంగా 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా కొప్పుల ఈశ్వర్ గెలుస్తూ వస్తున్నారు.  ప్రస్తుతం ఆయన క్యాబినెట్ మంత్రి . ఈ సెగ్మెంట్లో టిఆర్ఎస్ క్యాడర్లోని గ్రూపులతో మంత్రి  సతమతమవుతున్నారు.  ఏకైక ధర్మపురి మున్సిపల్  ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలవగా  ముగ్గురు కౌన్సిలర్లు ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరారు.  ఇక్కడ కాంగ్రెస్ ,బీజేపీకి  బలమైన క్యాడర్ ఉంది. ఆయా పార్టీల లీడర్లు స్థానికంగా ఉండకపోవడంతో ఆశించిన స్థాయిలో ఈ కేడర్లో ఉత్సాహం లేదు. మంత్రి నియోజక వర్గం కాబట్టి  అసమ్మతి గ్రూపు రాజకీయ నాయకులు పార్టీని వీడక పోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనికితోడు 2023 నాటికి కొందరు నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.  ఇది ఇలా ఉండగా ఈ సెగ్మెంట్ ఎన్నికల పై రీకౌంటింగ్ పిటిషన్ న్యాయ స్థానంలో కొనసాగుతున్నది.

చొప్పదండి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అధికార పార్టీలో అసమ్మతి సెగలూ, గ్రూపు రాజకీయాలూ కొనసాగిస్తున్నాయి. చొప్పదండి మునిసిపల్ కోఆప్షన్ ఎన్నికలలో అధికార పార్టీ కో ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే సమక్షంలో అదే పార్టీకి చెందిన వారు ఓడించి, ఇతరులను గెలిపించుకోవడం తో ఈ సెగ్మెంట్లో ఏ మేరకు గ్రూపు రాజకీయ తగాదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బలమైన క్యాడర్, లీడర్లు ఉన్నారు . త్వరలోనే ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారనున్నట్లుసమాచారం.

పెద్దపల్లి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు  విపరీతమైన గ్రూపు రాజకీయాలతో పాటు ఆ క్యాడర్ లో అసమ్మతి పవనాలు  రాజ్యమేలుతున్నాయి. సుల్తానాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ లో అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి ఓటమి చెందడం దీనికి నిదర్శనం.  బీజేపీ, కాంగ్రెస్ లకు లీడర్లు క్యాడర్ల బలం ఉంది. త్వరలోనే ఈ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు మారవచ్చు.

రామగుండం

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్ గెలిచారు. ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మినీ ఇండియాగా పిలువబడుతున్న ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు బలమైన నాయకులూ, కార్యకర్తలూ ఉన్నారు  ఇక్కడ రాజకీయ నిశ్శబ్దం కొనసాగుతోంది. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికలు, ఎరువుల కర్మాగారం ప్రారంభం  పిదప ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మంథని

ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్ద పల్లి జెడ్పి చైర్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, శ్రీధర్ బాబు వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం  పోరు నెలకొని ఉంది. ఆయా పార్టీల నాయకులూ,కార్యకర్తలూ బలంగా ఉన్నారు. ఇక్కడ అత్యధిక శాతం అటవి గ్రామాలు. మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతం.  అటవీ గ్రామాలకు చెందిన యువత బీజేపీలో  చేరడంతో ఈ రెండు పార్టీల నాయకులకు ఈ వలసల ఉదంతం అంతుపట్టని మిస్టరీ గా మారిందని చెప్పవచ్చు. 2023 నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణలు మారే అవకాశం లేకపోలేదు.

హుజురాబాద్

టిఆర్ఎస్  ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ మంత్రిగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. అసంతృప్తులు నాయకులూ, కార్యకర్తలలో  ఉన్నా అవి బయటికి అగుపించటం లేదు. ప్రత్యేకంగా మంత్రి ఈటల ప్రతిపక్ష  పార్టీలతో, నాయకగణం తో కొనసాగిస్తున్న సంబంధాలు మంత్రి పట్ల వ్యక్తిగతంగా అన్ని వర్గాలు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్, బీజేపీలకు కార్యకర్తల బలగం  ఉన్నా లీడర్లు అందుబాటులో లేరు అనేది ఆరోపణ. గతంలో లో ఈ సెగ్మెంట్లు ప్రాతినిథ్యం వహించే బిజెపి లో కొనసాగుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కి ఈ సెగ్మెంట్లో గుర్తింపు ఉంది. ఆయన హయాంలోనే పట్టణంలో ఎనలేని అభివృద్ధి జరిగింది. వివాద రహితుడు గా ఈ సెగ్మెంట్లోని ప్రజలు లో పెద్ది రెడ్డి కి గుర్తింపు ఉంది.

హుస్నాబాద్

టిఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో  సిపిఐ, కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు. బీజేపీ ఉనికి నాయకులు ఆశించినంత మేరకు లేదు. ఇక్కడ అధికార పార్టీలో అసమ్మతి రాగాలు గ్రూపు రాజకీయాలు ఉన్నా అవి బయటికి అగుపించటం లేదు . ఎమ్మెల్యే సతీష్ కి వివాదరహితుడిగా పేరు ఉంది. 2023 నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి.

మానకొండూర్

టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ బిజెపి కేడర్ బలంగా ఉన్నా ఆ పార్టీ లీడర్ స్థానికేతరుడనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉంది. సోషల్ మీడియాలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు  కొనసాగుతున్నాయి. ఈ సెగ్మెంట్లో కీలక నాయకుడు అతడి అనుచరగణం 2023 నాటికి బిజెపి తీర్థం పుచ్చుకోవచ్చునంటూ చర్చ కొనసాగుతుంది.

ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు  ఇక్కడివారే

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన హేమాహేమీలూ, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యతలు నిర్వహిస్తున్నా జిల్లాలో రాజకీయ సమీకరణాలు స్థిరంగా లేవు. వివిధ సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో వారు వెనుకబడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా పార్టీల కంటే బిజెపి నాయకులూ, కార్యకర్తలూ కొంత మెరుగు అనే చర్చ ఉంది.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్ రమణ గత ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. బిజెపి పార్టీకి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పొన్నం ప్రభాకర్ ( కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అధ్యక్షుడు తరహాలోనే క్యాడర్ను నడిపించాలి ఉంటుంది) సీపీఐ పార్టీకి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శిగా బండా సురేందర్ రెడ్డి  కొనసాగుతున్నారు.  అయినా ఈ నాయకగణం ఆశించినంత మేరకు ప్రజా సమస్యలపై పై ఉద్యమాలు చేపట్టలేక పోతున్నారనే అపవాదు వీరిపై ఉంది.. అదే తరహాలో మంత్రి కేటీఆర్ ( టి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కొనసాగుతున్నారు, అంటే పార్టీ అధ్యక్షుడిగానే  క్యాడర్ భావిస్తున్నది) అధికార పార్టీ నాయకులు ప్రజా ఉద్యమాలు ఆందోళనలు ధర్నాలు  చేపట్టక పోవచ్చు కానీ పార్టీ క్యాడర్లో అసంతృప్తి , గ్రూపు రాజకీయాలు నివారించడం పై కేటీఆర్ దృష్టి సారించడం లేదని చర్చ నెలకొని ఉంది. ప్రస్తుతం  ‘డైనమిక్ లీడర్’ గా, ‘ఫైర్ ర్ బ్రాండ్’ గా బండి సంజయ్ ని  విద్యావంతులు ,నిరుద్యోగ యువత గుర్తిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ప్రజాఉద్యమం నిర్వహణకు ప్రణాళిక ?

మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల సెగ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున ఓ ప్రజా ఉద్యమానికి బీజేపీ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా మిడ్ మానేరు భూనిర్వాసితుల డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వేలాది మంది బాధితులతో ‘చలో హైదరాబాద్’ కు కాలినడకన వెళ్లి గవర్నర్  కి వినతిపత్రం ఇవ్వడం కోసం పథకాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇసుక రవాణా అడ్డుకున్న దళితులపై పోలీసుల దాడులు, వారిపై కేసులు తదితర అంశాలు చేర్చడంపై వారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఆందోళన కార్యక్రమం గూర్చి అధికారికంగా ఆ పార్టీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

టి పి సి సి అధ్యక్షుడి ప్రకటన తర్వాత సమీకరణాలు మారతాయా?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పలువురు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.  ప్రధానంగా ఎంపీ లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి లతో పాటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధుయాష్కి, వి హనుమంత రావు లు ఉన్నారు. సోనియాగాంధీ వీరిలో ఒకరి పేరు ప్రకటిస్తే వారి అనుచరగణంతో జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బిజెపి పార్టీ లోకి చేరడమా లేక మరో ప్రాంతీయ పార్టీకి పురుడుపోయడమా అతి చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఒక నిర్ణయం త్వరలో వెలుగుచూసే అవకాశం ఉందని అంటున్నారు.

పారిశ్రామికవేత్త ,ఎన్ఆర్ఐ పోటీకి  తహతహ

జిల్లాకు చెందిన ఓ ఎన్నారై ఇతర దేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గా గుర్తింపు పొందిన వ్యక్తి . బిజెపి పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. తాను పార్టీలో చేరుతానని తనకు ఎమ్మెల్యే టికెట్ తో పాటు మరో సెగ్మెంట్ అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా అప్పగించవచ్చుననీ, తన వంతు సహాయసహకారాలు అందిస్తాననీ ఆ పారిశ్రామికవేత్త సందేశం పంపినట్టు సమాచారం.  దీనికితోడు అధికార పార్టీలో కీలక పదవులు అనుభవించినవారూ, అనుభవిస్తున్నవారూ కొందరు బీజేపీ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ముగ్గురు నేతలు వారి వద్దకు వెళ్లి మంత్రాంగం జరపగా  బీజేపీ పార్టీకి చెందిన కొందరు దూతలు అధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతల వద్ద మంత్రాంగం జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. బలమైన సామాజిక వర్గం, ఆర్థిక బలం బలం ఉన్న ఈ ఎన్ ఆర్ ఐ సంక్రాంతి పండుగ తర్వాత లేదా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాతనో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles