సమాజంలో నేతికీ అంటరానితనం ఉన్నదనీ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా అంటరానితనం అమలులో ఉన్నదనీ గుజరాత్ నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మార్టిన్ మక్వాన్ అన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను అపహాస్యం చేస్తూ, గుజరాత్ లో అభివృద్ధి జరిగినప్పటికీ అసమానతలు కూడా పెరుగుతున్నాయని అన్నారు.
‘’దళితుల ఊహల్లో స్వతంత్ర భారతం’’ అనే అంశంపైన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ‘‘గుజరాత్ లో దళితులు రోజువారీ హింసను ఎదుర్కొటున్నారు. భారత దేశంలో దళితులపై అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉన్నది. గుజరాత్ లోని 1489 గ్రామాలలో మా సంస్థ నవసర్జన్ ట్రస్ట్ నిర్వహించిన సర్వేలో 98వేలమందిని ప్రశ్నించాం. వారిలో 90.2 శాతం గ్రామాలలో దళిత హిదువులను దేవాలయాలలోకి ప్రవేశించనీయడం లేదు. 98 శాతం మంది దళితేతరులు దళితులకు ఉపయోగించని గ్లాసులు, కంచాలు ఉపయోగిస్తారు. 64శాతంమంది దళిత సర్పంచ్ లకు కూర్చోడానికి కుర్చీలు ఉండవు. గుజరాత్ ప్రభుత్వం పెడుతున్న మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో 53.78 దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారు. వారిని విడిగా కూర్చోబెడుతున్నారు.’’ అని వివరించారు.
దేశంలో అంటరానితనం, వివక్షను ఎదుర్కోవడానికి దళితులు, వెనుకబడిన సామాజిక వర్గాలతో చేతులు కలపాలని మక్వాన్ పిలుపునిచ్చారు. ‘‘దళితులపట్లా, వెనుకబడినవర్గాల పట్లా సమాజం, ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. ఈ రెండు వర్గాలు చేతులుకలిపితే సమాజం నుంచి అంటరానితనాన్ని తరిమివేయగలరు. ఈ రోజున దేశంలో జరుగుతున్న ఉద్యమాలలో అత్యంత శక్తిమంతమైనది దళిత ఉద్యమం. వోబీసీలు కూడా దళితులతో చేతులు కలిపితే వారు తమ లక్ష్యాలను సాధించగలరు.’’ అని చెప్పారు.
మనం దళితులకూ, ఇతర కులాలవారికీ మధ్యనే కాకుండా దళితులలోనే వివిధ ఉపకులాల మధ్య అంటరానితనం ఉన్నదనీ, దాన్ని కూడా రూపుమాపాలని మక్వాన్ ఉద్బోధించారు. దళితుల ప్రధాన సమస్య ఆర్థికాభివృద్ది కాదనీ, సామాజికాభివృద్ధి అనీ మక్వాన్ చెప్పారు. 1974-2020 మధ్య కాలంలో 25,947 మంది దళితులను హత్య చేశారనీ, 54,903 దళిత మహిళలపై అత్యాచారం జరిగిందనీ, ఇతర రకాల అత్యాచారాలకు గురైన దళితుల సంఖ్య పదిలక్షలకు మించే ఉంటుందనీ మక్వాన్ వెల్లడించారు. ఆదివాసీల విషయం కూడా అంతేననీ, అదే కాలంలో 22,004 గిరిజన మహిళలపైన అత్యాచారాలు జరిగాయనీ, 2.25 మంది గిరిజనులపైన దాడులు జరిగాయనీ, అయిదు వేల మంది గిరిజనులను ఇతరులు అహంకారంతో హత్య చేశారనీ మక్వాన్ వెల్లడించారు.
గుజరాత్ ఎన్నికలకోసం తాము వినూత్న కార్యాచరణ చేపట్టామనీ, 90 మీటర్ల బ్యానర్ తయారు చేస్తున్నామనీ, అంటరానితనం నిర్మూలనకు హామీ ఇచ్చినవారికే ఓటు వేస్తామనీ మక్వాన్ అన్నారు. ఈ విషయం వివిధ పార్టీలు తమ మేనిఫెస్టోలలో స్పష్టం చేయాలని ఆయన చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత దళితుల ఎట్లా ఉన్నారో, వారి స్థితిగతులు ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉన్నదనీ, అందుకు ఉపన్యాసపరంపరను ఏర్పాటు చేస్తున్నామనీ, ఈ ఉపన్యాసాలను పుస్తక రూపంలో తీసుకొని వచ్చే ఆలోచన కూడా ఉన్నదని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తెలియజేశారు.
సీడీఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణ సభకు అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, డాక్టర్ కనకరాజు. కె. వినయకుమార్ సభలో పాల్గొన్నారు. తొంభై ఏళ్ల వయసు దాటిన ప్రొఫెసర్ భూషి కూడా హాజరై ప్రసంగించారు.