Thursday, November 7, 2024

బృహన్నల రంగప్రవేశం

మహాభారతం: శ్రీమద్విరాటపర్వం-4

ఆతడు రెండుచేతులా విల్లువంచి శరసంధానము చేయగల సవ్యసాచి. వింటినుండి బాణం వెలువడితే వైరిగుండెల్లో మంటలే. కంటినుండి చూపుల బాణాలు వెలువడితే, ఆ అభినయానికి చూపరుల మనసులో కోవెల గంటలే..

ఒక పేడి (క్లీబుడు) విరాట సభాభవన ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. శరీరం పురుషుడిది కానీ లక్షణాలు స్త్రీవి. ఇలాంటి రూపం చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది. పరికించి చూశాడు, సాముద్రిక లక్షణాలనుబట్టిచూస్తే ఎవరో మహాపురుషుడు వినోదంకోసం ఈ రూపంలో వచ్చాడేమో అనుకొని సభాసదులను కూడా పరిక్షించమన్నాడు.

Also read: శ్రీమద్విరాటపర్వం-1

ఈ లోగా ఆ మానిసి రాజు వద్దకు వచ్చాడు. “రాజా!నా పేరు బృహన్నల. నాకు నాట్యశాస్త్రంలో ప్రవేశం ఉన్నది. అంతఃపుర కన్యలకు ఆటపాటలు నేర్పుతాను. అయితే, నేను నపుంసకుడిని“ అని బృహన్నల అంటుంది.

ఉదాత్తమైన రూపంతో మన్మధుని తలదన్నే సౌందర్యంతో, విశాల వక్షస్థలం, పొడవైన చేతులు, విశాల నేత్రాలు, సకల సాముద్రిక లక్షణాలు ప్రస్ఫుటంగా మహాపురుషుడని సూచిస్తున్నాయి. ఇన్ని అమర్చిన బ్రహ్మ చివరకు ఇతడిని నపుంసకుడిని చేశాడేటాని లోలోపల చింతించాడు విరాటరాజు.

రాజు ఆలోచనలను గమనించిన బృహన్నల ఇలా అన్నది, ‘‘రాజా! నపుంసకత్వము నాకు శాపము వలన సంక్రమించినది. ఆ పేడితనంవల్ల ఏ పనీచెయటానికి వీలులేకుండా పోయింది. చిన్నతనం నుండీ దండలాసకం, కుండలి, ప్రెక్కణం,పేరణం అనే నృత్యరీతులు నేర్చకున్నాను. ప్రసిద్ధ వాద్యాలు వాయించగలను. రస భావ ఆశ్రయాలైన అభినయాలు నాకు తెలుసు. అంతే కాకుండా అభినయించేటప్పుడు వేసుకునే వస్త్రాలంకారం (costume designing) కూడా నాకు తెలుసు,’’

Also read: శ్రీమద్విరాటపర్వం-2

ఈ విధంగా చెప్పగనే విరాటరాజుకు కుతూహలం హెచ్చి అంతఃపుర దాసదాసీ జనంతో ఆతని పేడితనాన్ని పరీక్షింపచేశాడు. మోసంలేదని గ్రహించి రాకుమారి ఉత్తరకు నాట్యగురువుగా నియమించాడు.

సూర్యోదయమవుతూ ఉంటే మెల్లగా కొలనులోని తామరపూవులు ఒక్కొక్కరేకు విచ్చుకుంటూ  సూర్యుడు ప్రాగ్దిశవేదికమీద ఆసీనుడవగనే పూర్ణవికాసంతో కళకళలాడుతూ కనపడతాయి.

అల్లంత దూరంలో ఒక స్ఫురద్రూపము, సూర్యమండలవర్ఛస్సుతో సభాసదులకు లీలగా గోచరమవుతున్నది. ఆ రూపము చూస్తున్న వారి ముఖకమలములు మెల్లగా విచ్చుకొంటున్నాయి.

ఆయన పూర్తిగా దగ్గరకు రాగానే ఆ సౌందర్య దర్శనంతో వారి మోములు వికసిత జలజములైనాయి. అంత అద్భుత సౌందర్యమూర్తి ఆయన. ఆయనే నకులుడు.

ఆ సమయంలో విరాటరాజు అమ్మకానికి వచ్చిన అశ్వాలను పరీక్షగా చూస్తున్నాడు. ఆయనకు కొంత అశ్వలక్షణాలు, వాటిహృదయం తెలుసు. కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి రాజు సమీపంలో నిలబడి తాను కూడా రాజు మునుపెన్నడూ విననిరీతిలో ఆయనకు తెలియని అశ్వరహస్యాలు చెప్పసాగాడు.

(ఇక్కడ మనకొక అనుమానం వస్తుంది, అదేమిటి రాజు అడగకుండా చెప్పే సాహసం చేశాడా! అది ఔచిత్యభంగంకాదా అని. ప్రక్కింటివాడిని పట్టించుకోకుండా పదేళ్ళయినా బ్రతికేయగలిగే నాగరీకపు అపార్ట్‌మెంట్ సంస్కృతి లేదు ఆ రోజుల్లో.

ఈ రోజు కూడా పల్లెటూళ్ళలో మనం ఏదయినా బేరమాడుతున్నప్పుడు ఆ వస్తువుగూర్చి తెలిసినవాడు మన ప్రక్కన ఉన్నాడనుకోండి, వాడు మనం అడక్కపోయినా దాని గురించి మనతో చర్చిస్తాడు. ఇదే సహజీవనము, సహజజీవనము. అది దాదాపు కోల్పోయాము మనం. ఎవరికి వారు ఒక personal zone సృష్టించుకొని ఏకాకిజీవితం గడుపుతూ అదే నవనాగరకత. అది కాపాడుకోవడమే మర్యాద అనే భ్రమలో బ్రతుకీడుస్తున్నాం)

సరే…. రాజు, ఈ క్రొత్త వ్యక్తి చెప్పిన విషయాలు ఆమూలాగ్రం శ్రద్ధగా విన్నాడు. ఇతడెవరో అసాధారణ ప్రజ్ఞాశాలి అని అనుకొన్నాడు.

(మనతో పాటు అసాధారణ ప్రజ్ఞావంతులు ఎంతో మంది మసులుతూ ఉంటారు, వారిని మనం కనుక్కోలేము! ఎందుకంటే వారి ప్రజ్ఞ గుర్తించాలంటే ముందు మనలో ప్రజ్ఞ ఉండాలి!  లేక పోతే ఆ ప్రజ్ఞావంతుడు అందరిముందు ఒక పిచ్చివాడుగా పరిగణింపబడతాడు! Allwyn Toffler తన Future Shock అనే పుస్తకంలో ఇదేవిషయాన్ని చాలా అద్భుతంగా చర్చిస్తాడు)

అప్పుడు విరాటరాజు ఆ వచ్చిన క్రొత్త వ్యక్తిని ఆతని పరిణతి ఆధారంగా ఒక మండలాధీశుడుగా చేయాలని సంకల్పించాడు. అదే విషయాన్ని చెప్పగా…

ఆ క్రొత్తమనిషి, “రాజా నాకు ప్రవేశమున్న విద్య అశ్వశిక్షణ, అశ్వరక్షణ, నాకు వాటి హృదయం తెలుసు. నేను నీకు ఒక అశ్విక దళాన్ని తయారు చేయగలను, నాశక్తికి అనుగుణంగా నన్ను వాడుకో’’ అని వినమ్రంగా ప్రార్ధించాడు (Please allow me to work on my strength.)

ఎవరితో ఏపని చేయించుకోవాలో తెలిసిన వాడే నిజమయిన నాయకుడు. విరాటరాజు నకులుడిని అశ్వరక్షకుడిగా నియమించాడు.

గమనిక:

ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. పిల్లలను పాఠ్యపుస్తకాలకే పరిమితంచేసి బయట ప్రపంచం ఎంత ఉన్నది? ఎన్ని విద్యలున్నాయి అని వారికి తెలిసే అవకాశం లేకుండా ఒకటే రుద్దుడు రుద్దుతున్నాం. అంతేనా!!  అలా పిల్లలను రుద్దే చండామార్క సంతతివారు పెట్టిన పాఠశాలలకు పంపుతున్నాం. ఏమవుతున్నది? పిల్లల ప్రతిభ unidirectional అవుతున్నది.

అలా కాకుండా ఏదో ఒక లలిత కళ అభ్యసిస్తే అది ఎప్పడో అప్పుడు అక్కరకు ఉపయోగిస్తుంది. కనీసం మన పనిలోని వత్తిడి తగ్గించటానికైనా ఉపయోగపడుతుంది. అందుకే రెండు అట్టల (text books) మధ్య ఉన్నదే విజ్ఞానం కాదు.

Also read: శ్రీమద్విరాటపర్వం-3

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles