- అంతకంటే ముందుగా కష్టతరమైన విధి నిర్వహణకు భారతీయ భాషలను సమాయత్తం చేయండి.
- మనం సంస్కృతి తెలియని, సృజన లేని అగ్రశ్రేణులను (ఎలిట్) సృష్టించుకున్నాం. అందుకు ఇంగ్లీషుకు ధన్యవాదాలు చెప్పాలి.
ఇంగ్లీషు భాష గురించి మన దేశంలో బహిరంగంగా జరిగే చర్చ మన వివక్షాపూరితమైన మానసికస్థితిని సాకల్యంగా తెలియజేస్తుంది. లేకపోతే హేతుబద్ధంగా ఆలోచించేవారు కూడా తర్కాన్ని తలకిందులుగా నిలబెడతారు. అనుభవం స్థానంలో ఊహాగానం వచ్చి చేరుతుంది. సాక్ష్యాధారాలకంటే గతకాలపు జ్ఞాపకాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ప్రతిరంగంలో మౌలిక మార్పులు రావాలని కోరుకొని వాదించేవాళ్ళు మకిల అంటుతుందేమోనని భయపడుతూ అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. పాలకవర్గం, పాలక భావజాలానికి వ్యతిరేకంగా ఉండటం అంటే ఏమిటో మీకు తెలిసివస్తుంది.
Also read: భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు
తాజాగా ఉన్నత విద్యలో ఇంగ్లీషును తగ్గించాలనే విషయంపైన జరుగుతున్న చర్చ మనకు తెలిసిన, అలవాటైన పద్దతిలోనే సాగుతోంది. ఇంగ్లీషును తప్పించే అవకాశం గురించి ప్రస్తావించగానే మన ఖాన్ మార్కెట్ ముఠా – ఇంగ్లీషు మాట్లాడే అగ్రగణ్యులు కుడివైపు వారైనా, ఎడమవైపు వారైనా ఒకటే – గందరగోళంలో పడిపోతారు. ఇంటిభాషలో చదువు చెప్పడం అనే ఆచారం అంతర్జాతీయంగా ఉంది. అటువంటి ప్రక్రియను ఇక్కడ ప్రవేశపెడతారేమోనని దిగ్భ్రాంతి చెందుతారు. మన దేశంలో విద్యావిధానాలకు శాశ్వత పరిష్కారం త్రిభాషా సూత్రం. దాన్ని గుర్తు చేస్తే ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని అనుకుంటారు. హిందీని రుద్దుతున్నారని అంటూ దానిని హిందీ-భారతీయ భాషల మధ్య పోటీగా చిత్రీకరిస్తారు. మన వలసపాలకులువిభజించి పాలించే విధానాన్ని బలోపేతం చేసినట్టే భారతీయ భాషలలో ఉన్నత విద్యాబోధన అనే ఆలోచనను కొట్టిపారేస్తారు.అచ్చం ఆడవారికి ఓటు హక్కు ఎందుకంటూ పురుషులు వాదించినట్టే. వారు అమాయకంగా అడుగుతారు: ‘‘ఇంత బాగా పని చేస్తున్న వ్యవస్థ వల్ల వచ్చిన నష్టం ఏమిటి?’’ అని. అనుభవాలను విస్మరించలేని శ్వేత దక్షిణాఫ్రికా మనిషి అడిగినట్టు.
సరైన ప్రశ్నను గుర్తించండి
చర్చలో అసలు ప్రశ్న గురించి మనం స్పష్టంగా ఉండాలి. విధాన నిర్ణేతల గూఢమైన కుట్రపూరితమైన ఆలోచనల గురించి మనం చర్చించడం లేదు. మనం ఒక విధానంపైన చర్చిస్తున్నాం. ఇంగ్లీషు మాధ్యమాన్ని ఉన్నపళంగా రద్దు చేయడం మంచిదా, కాదా అని మనం మాట్లాడుకోవడం లేదు. అట్లా చేస్తే వ్యవహారం బెడిసి కొడుతుంది. అసలుకే మోసం వస్తుంది. ఇంగ్లీషుని క్రమబద్ధంగా, మెల్లగా సాగనంపడం గురించి చర్చిస్తున్నాం. ప్రస్తుతం అమలు జరుగుతున్న పద్ధతులలోని మంచి గురించి లేదా మన భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న బోధన సామగ్రి నాణ్యత గురించి కానీ చర్చించడం లేదు. ఉన్నదంతా చెత్త – ఇటీవల బయటపడిన మెడికల్ కోర్సులోని బోధనాంశాలను హిందీలోకి తర్జుమా చేసిన పాఠ్యపుస్తకాలతో సహా. ఒక విధాన ప్రతిపాదన మంచిచెడ్డల గురించి మనం చర్చించుకోవాలి.
మరీ ముఖ్యంగా, ఇంగ్లీషును నేర్చుకోవడం గురించి మనం చర్చించబోవడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించినవారు ఇంగ్లీషుపైన పట్టు లేకుండానే ఇంగ్లీషులో ఏదో ఒక పరీక్షలోఉత్తీర్ణులై ఉంటారు. ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని ప్రోత్సహించవలసిందే. బోధన, అభ్యాసం ఇంగ్లీషు భాషలోనే విధిగా జరగాలనడం మంచిదా, కాదా అనే విషయం మనం చర్చించుకుంటున్నాం. విద్యార్థులు ఇంగ్లీషులో ఉన్న పాఠ్యాంశాలు చదవాలా, వద్దా అన్నది చర్చనీయాంశం కాదు. ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడాన్ని నిషేధించాలని కూడా మనం అనడం లేదు. మన వంటి భిన్నత్వం ఉన్న దేశంలో అల్పసంఖ్యాకుల గురించి ఆలోచించాలి. ఇంగ్లీషులో మాట్లాడగలవారు కూడా అల్పసంఖ్యాకులే. మనం సర్వసాధారణమైన అంశాన్ని చర్చించుకుంటున్నాం. అరుదైన అంశం గురించి కానేకాదు.
ఉన్నత విద్యారంగంలో పాఠ్యాంశాలు, పరీక్షలు, తరగతి గదిలో విద్యా బోధన, చర్చ అంతా ఇంగ్లీషులో మాత్రమే జరగాలా, అక్కరలేదా అన్నదే నిజమైన చర్చనీయాంశం. ఉన్నత విద్యారంగం అంతటి గురించి కాకుండా సాంకేతిక విద్య గురించే ప్రధానంగా చర్చ. కొన్ని అగ్రశ్రేణి విద్యాద్వీపాలు మినహాయిస్తే, ఉన్నత విద్యను బోధించే సంస్థలలో అత్యధికంగా భారతీయ భాషలోనే వ్యవహారం సాగుతోంది లేదా భారతీయ భాషలోనే బోధనను అనుమతిస్తున్నారు. ఉదాహరణకు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులలోఅత్యధికులు తమ పరీక్షలను హిందీలో రాస్తారు. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలలోనూ, కేంద్రీయ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలోనూ, వృత్తిపరమైన, సాంకేతిక పరమైన విద్యాసంస్థలలోనూ ఇంగ్లీషు మాధ్యమం కొనసాగుతోంది. ప్రస్తుత చర్చ ప్రధానంగా ఈ విషయంపైననే.
బోధనలో నరకయాతన
ఉన్నత విద్యలో బోధనాభాషగా ఇంగ్లీషును క్రమంగా తప్పించాలనే వాదనకు మద్దతుగా ఇక్కడ ఒక విషయం మనవి చేస్తాను. ఉన్నత విద్య కోర్సులలో చేరుతున్న విద్యార్థులలో అత్యధికులకు పాఠశాల స్థాయిలో భారతీయ భాషలలో ఏదో ఒక భాషలోనే బోధన జరిగేది. పాఠశాలలో ఇంగ్లీషు కొద్దిగా చదివి ఉంటారు. ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఇంగ్లీషు మాట్లాడేవారు అంతగా ఉండరు. వారికి ఇంగ్లీషు మాట్లాడటం కానీ, చదవడం కానీ రాయడం కానీ అంత బాగా రాదు. ఉన్నత విద్య అభ్యాస సమయంలో ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం ఒక నరకయాతన. సబ్జెక్టు నేర్చుకోవడానికి ఎంత శక్తిని వెచ్చిస్తారో, ఇంగ్లీషు మాధ్యమంలో నెగ్గుకు రావడానికీ అంతే శక్తిని ఖర్చు చేస్తారు. ఇంగ్లీషును అవగాహన చేసుకోవడం విషయం (సబ్జెక్టు) తేలికగా అర్థం చేసుకోవడానికి అవసరం. ఇంగ్లీషు బాగా రాయడంపైన పట్టు సాధించినవారికి మంచి డిగ్రీ సంపాదించుకునే అవకాశం ఉంది. సమాజంలో ఆత్మవిశ్వాసంతో గౌరవంగా సాగిపోవాలంటే ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడగలగాలి. ఫలితం ఎడ్యుసైడ్ (సుయీసైడ్ లాగానే). ఇంగ్లీషు మాధ్యమంలో చదువు అనే రాక్షస విద్యాభ్యాస ప్రక్రియ కారణంగానే లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు లేదా విఫలమనోరథులై నిష్క్రమిస్తున్నారు.
రకరకాల సామాజికవర్గాలకు ఈ భీభత్సం గురించి రకరకాల అనుభవాలు ఉంటాయి. ఈ ఎడ్యుసైడ్ లో చాలా బాగా బాధపడేవారు అననుకూల నేపథ్యం నుంచి వచ్చినవారు. ఆర్థికంగా లేనివారు, చదువులో మొదటి తరంవారు (అంటే తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనవారు),చారిత్రకంగా చదువుకునే అవకాశం లేని దళితులు, ఆదివాసులు, వెనుకబడిన (ఓబీసీలు) తరగతుల వాళ్ళు బాగా నష్టపోతారు. భారత దేశంలో కుల, వర్గ పరమైన అసమానతలు కొనసాగించేందుకు ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం, అధికారం నిశ్చయంగా దోహదం చేస్తాయి.
Also read: బీహార్ మోదీ కొంప ముంచుతుందా?
చివరిగా, ఇంగ్లీషు సాంస్కృతికంగా పరాయీకరణకు మాధ్యమం. సాంస్కృతిక నిరక్షరాస్యులనూ, సృజనాత్మకత బొత్తిగా లేని అగ్రగణ్యులను మనం సృష్టించుకున్నాం. ఇందుకు ఇంగ్లీషుకు ధన్యవాదాలు చెప్పాలి. అనవసరమైన ఆధిక్యభావన సొంత మనుషుల నుంచి మనలకు దూరం చేస్తుంది. అదే సమయంలో పాశ్చాత్యులను చూసి న్యూనతాభావానికి లోనుకావడం వల్ల వారిని అనుకరించడమో, అనుసరించడమో చేస్తాం.
ముక్తాయింపు: ఇంగ్లీషు ఆధిక్యం బోధన, అభ్యాసాలలోనూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ విచ్ఛిన్నరకమైనది. దానిని తెలివిగా, క్రమంగా తొలగించుకోవాలి. నేర్చుకోవడంలో నాణ్యత పెరిగే విధంగా, సృజనాత్మకంగా, సామాజిక సమానత్వం దిశగా అడుగులు వేసే విధంగా ఇంగ్లీషు ప్రభావం నుంచి బయటపడాలి.
ఏ విధంగా ఆ పని చేయాలి?
ఇదంత తేలిక పని కాజాలదు. ఉన్నత విద్యాబోధన, అభ్యాసం అనే సవాలును ఎదుర్కొని నిలిచే విధంగా భారతీయ భాషలను తయారు చేయడం ఇంగ్లీషును తప్పించేందుకు ఏకైక మార్గం. జాతీయ ఉద్యమం తప్ప మరొకటి ఈ పని చేయజాలదు. ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠ్యపుస్తకాలనూ, సాంకేతికపదాలకు నిఘంటువులనూ, రిఫరెన్సు పుస్తకాలనూ అనువదించడం, ఇ-లైబ్రరీని సిద్ధం చేసుకోవడం, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం అవసరం. విద్యార్థుల నైపుణ్యం కూడా పెరగాలి. ప్రస్తుతం చాలామంది కళాశాల విద్యార్థులు వారి ఇంటిభాషలో సైతం సవ్యంగా రాయలేరు.
అంటే ఇంగ్లీషును పూర్తిగా నిషేధించమని అర్థం కాదు. ఆధునిక పరిశోధన సారం అంతా ప్రస్తుతానికి ఇంగ్లీషులోనే ఉంది. ఇతర భాషలలో ఉన్న పరిజ్ఞానానికి ఇంగ్లీషు విలువైన వారధి. అందువల్ల ఇంగ్లీషును నేర్చుకోవడానికీ, అవగాహన పెంచుకోవడానికీ విద్యార్థులందరికీ శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం ఇంగ్లీషు మాట్లాడటంపైనా, రాయడంపైనా అవసరానికంటే ఎక్కువ శ్రద్ధపెడుతున్నాం. ఉన్నత విద్య బహుభాషలలో సాగాలి. భారతీయ భాషలలోనే తరగతి గదులలో చెప్పాలి. ప్రాథమికంగా చదవాలి. ఉన్నతమైన రిఫరెన్సు గ్రంధాలు ఇంగ్లీషులో ఉంటాయి. వాటిని చదివి అర్థం చేసుకోగలగాలి. పరీక్ష ఏ భాషలో రాయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలి.
భారతీయ భాషలంటే ప్రామాణికమైన భాషలు… తెలుగు, కన్నడ, బెంగాలీ, హిందీ లాంటివి. ఈ భాషలు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యాకులు ఉన్నారు. గ్రంథాలయాలూ, వార్తాపత్రికలూ, విశ్వవిద్యాలయాలూ, తదితర మౌలికమైన హంగులన్నీ ఈ భాషలకు ఉన్నాయి. ప్రాథమిక విద్యాభ్యాసం ప్రామాణిక భాషల (షెడ్యూల్డ్ లాంగ్వెజెస్) ఉపభాషలైన తులు, కొంకణి, భిలీ, భొజ్ పురి వంటి భాషలలో జరగాలి. ఎందుకంటే ఈ భాషలలో ఉన్నత విద్య పాఠ్యాంశాలు రూపొందించడానికి చాలా కాలం పట్టవచ్చు.
ఇంగ్లీషు నుంచి ఇంటిభాషకు మారడానికి కృషి విద్యాసంస్థలలో కంటే ఉద్యోగ కల్పన వ్యవస్థలో జరగాలి. ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం పట్ల వెర్రివ్యామోహానికి కారణం ఇంగ్లీషు భాష గొప్పదనం కాదు. సామాజిక గౌరవానికీ, జీతాలు ఎక్కువగా వచ్చే ఉద్యోగాలకు ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం పాస్ పోర్టుగా పని చేస్తోంది. అందుకే ఇంగ్లీషు మాధ్యమాన్ని అందరూ కోరుకుంటారు. వీటిలో అనివార్యత కానీ సహజత్వం కానీ గొప్పదనం కానీ ఏమీ లేదు. ఉద్యోగార్హతలలో ఇంగ్లీషు మాధ్యమంలో చదవడం అన్నది ముఖ్యమైన అంశం కాకపోవచ్చు. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడటం అవసరమైన ఉద్యోగార్థులకు అదనంగా శిక్షణ ఏర్పాటు చేయవచ్చు. ఏటా కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. వాటికోసం లక్షల మంది విద్యార్థులను నరకయాతన పెట్టనవసరం లేదు. శక్తిమంతుల నుంచి అందే సామాజిక, సాంస్కృతిక సంకేతాలకు ఉద్యోగదాతలు స్పందిస్తారన్న విషయం సరేసరి.
ఉద్యోగాల విషయంలో భాషాదాస్యం, వివక్షను ఛేదించలేకపోతే సామాన్యులకు ఇంగ్లీషు అందకుండా చేయడం క్రౌర్యం. వారు అనుభవిస్తున్న వివక్ష మరింత బలపడుతుంది. ఉద్యోగాలకూ, అధికారానికీ, గౌరవానికి ఇంగ్లీషు పాస్ పోర్టుగా ఉన్నంతకాలం ఇంగ్లీషు మాధ్యమం అందరికీ అందుబాటులో ఉండాలి. అటువంటి పరిస్థితులలో సైతం మనకు ఇంగ్లీషు బోధనప్రమాణాలు పెరగాలి. కేవలం ఇంగ్లీషు మాధ్యమం సరిపోదు.
నేటి భారతంలో ఇంగ్లీషు ఒక భాషకు సంబంధించిన సమస్య కాదు. ఇది ఒక రాజకీయ ప్రశ్న. ఈ దేశాన్ని ఎవరు పాలిస్తారు? ఏ షరతులపైన వారి పాలన సాగుతుంది? ‘అస్థిత్వాన్ని పోగొట్టుకొని తిరిగి సంపాదించడం అనేది వలస పాలనలో మొదలై ఇప్పటికీ ప్రధానమైన సాంస్కృతిక సవాలుగా కొనసాగుతున్నది’ అని ఆషీస్ నందీ మనకు గుర్తు చేశారు. భారతీయ ఆధునికతకు బ్రిటిష్ రాణిగారి ఇంగ్లీషు భాష వాహకం కాజాలదని నిరూపించి దాని స్థానానికి దాన్ని పరిమితం చేసే దాకా మనం ఇంగ్లీషుతో సమాధానపడలేము.
Also read: ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?