* తొలి టీ-20లో ఇంగ్లండ్ ఝలక్
* భారత్ 124, ఇంగ్లండ్ 130/2
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను రెండోర్యాంకర్ భారత్ ఓటమితో ప్రారంభించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ 8 వికెట్లతో భారత్ ను అలవోకగా ఓడించింది.
రోహిత్ కు రెస్ట్, ధావన్ కు చాన్స్
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు పలు మార్పులతో బరిలోకి దిగింది. పవర్ పుల్ ఇంగ్లండ్ ను ఎదుర్కొనటానికి తుదిజట్టులో ఎక్కువమంది యువఆటగాళ్లకే అవకాశమిచ్చింది. డాషింగ్ ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి…వెటరన్ శిఖర్ ధావన్ ను తుదిజట్టులోకి తీసుకొంది. పేసర్ శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ , రాహుల్, రిషభ్ పంత్ లకు అవకాశమిచ్చింది.
Also Read : 10 వేల పరుగుల మిథాలీ రాజ్
రాహుల్ 1, విరాట్ డకౌట్
లక్ష్యం చేదనలో దిట్టగా పేరుపొందిన భారతజట్టు ఈ మ్యాచ్ లో మాత్రం ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. రాహుల్-శిఖర్ ధావన్ లతో ఇన్నింగ్స్ మొదలుపెట్టి…రెండో ఓవర్లలోనే రాహుల్ వికెట్ నష్టపోయింది.
ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో రాహుల్ నాలుగు బాల్స్ ఎదుర్కొని ఒకేఒక్క పరుగుకు వెనుదిరిగాడు. రాహుల్ స్థానంలో క్రీజులోకి దిగిన కెప్టెన్ విరాట్ కొహ్లీ ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ ఎదురీత మొదలుపెట్టింది.
Also Read : విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ముంబై
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం 12 బాల్స్ ఎదుర్కొని 4 పరుగుల స్కోరుకే బౌల్డ్ కావడంతో…భారత్ మొదటి ఆరు ఓవర్లలోనే 3 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.
అయ్యర్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ
రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రిషభ్ పంత్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ నాలుగో వికెట్ కు 28 పరుగులు, అయ్యర్- పాండ్యా కలసి 5వ వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్ తేరుకోగలిగింది. రిషభ్ 23 బాల్స్ లో రెండు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 21 పరుగులు,పాండ్యా 21 బాల్స్ లో ఓ సిక్సర్ , బౌండ్రీతో 19 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో భారత్ ఆశించిన స్కోరు సాధించలేకపోయింది.
శ్రేయస్ అయ్యర్ ఒక్కడే పోరాడి ఆడి 48 బంతుల్లో ఓ సిక్సర్, 10 బౌండ్రీలతో 67 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మాట్లో అయ్య్రర్ కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
Also Read : టీ-20 రికార్డుల వేటలో కొహ్లీ,రోహిత్
లోయర్ ఆర్డర్లో శార్దూల్ డకౌట్ కాగా…సుందర్ 3, అక్షర్ 7 పరుగులతో నాటౌట్ గా నిలువగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 3, మార్క్ వుడ్ , రషీద్, స్టోక్స్, జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు. భారతజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగిన గత ఆరు టీ-20 మ్యాచ్ ల్లోనూ పరాజయాలు చవిచూడటం విశేషం.
బట్లర్- రాయ్ ధూమ్ ధామ్
125 పరుగులు లక్ష్యంగా చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్- జేసన్ రాయ్ మొదటి వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేయడంలో భారత పేసర్ భువనేశ్వర్, స్పిన్నర్లు అక్షర్,చహాల్ విఫలమయ్యారు.
Also Read : టీ-20 ల్లో భారత్ ను ఊరిస్తున్న టాప్ ర్యాంక్
ఇన్నింగ్స్ 8వ ఓవర్లలో బట్లర్ ను స్పిన్నర్ చహాల్ పెవీలియన్ దారి పట్టించాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ 32 బాల్స్ లో 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 49 పరుగుల స్కోరుకు ఆఫ్ స్పిన్నర్ సుందర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో ఇంగ్లండ్ రెండో వికెట్ నష్టపోయింది.
Also Read : సమఉజ్జీల సమరానికి అంతా సిద్ధం
వన్ డౌన్ డేవిడ్ మలాన్ 20 బాల్స్ లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 24, బెయిర్ స్టో 17 బాల్స్ లో ఓ బౌండ్రీ, 2 సిక్సర్లతో 26 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో… ఇంగ్లండ్ 16.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికే లక్ష్యాన్నిచేరుకోగలిగింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ డేవిడ్ మలాన్ సిక్సర్ తో ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశాడు. భారత బౌలర్లలో చహాల్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్…మోడీ స్టేడియం వేదికగానే మార్చి 14న సూపర్ సండే ఫైట్ గా జరుగుతుంది.
Also Read : టీ-20 సిరీస్ లో అతిపెద్ద సమరం