నా కాళ్ల క్రింది రోడ్డు నల్ల త్రాచులా
జరాజర వేగంగా ముందుకు జారిపోతోంది.
భవనాలు బూడిదై లోకమంతా పరచుకుని
చిమ్మ చీకట్లు ముసిరాయి.
తల పైకెత్తి చూసా!
శూన్యమంతా ఒక సూపర్ కంప్యూటర్ లా కనపడింది.
ఎవరివో వేళ్ళు హడావిడిగా కీ బోర్డ్ మీద నాట్యం చేస్తున్నాయి.
నన్ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న
రణ గొణ ధ్వనిని ఛేదిస్తూ బిగ్గరగా అరిచా!
“హేయ్… ఎం చేస్తున్నావ్?”
“మార్పులు…తప్పనిసరి మార్పులు!”
నా వైపు తల తిప్పకుండానే అన్నాడు.
“కలి రెండు, మూడు పాదాలను రద్దు చేస్తున్నా!
నాల్గో పాదాన్ని కుంచింపచేస్తున్నా!”
నా పాదాల క్రింది రహదారి వేగం పెంచింది.
మనుషులు పొట్టిగా నేలకు మూడడుగుల ఎత్తులో
అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు.
డబ్బు మూటలు మోసుకొని పోతూ ఆయాసంతో మగవాళ్లు
అసహ్యపు పరిహాసాలు చేసుకొంటూ,
ఆకారణ వైరంతో ఒకరిని ఒకరు చoపుకొంటున్నారు.
అర్ధనగ్నంగా స్త్రీలు అశ్లీల సంభాషణలో మునిగి
వికారపు నవ్వులు నవ్వుతూ అటూ ఇటూ పరుగెడుతున్నారు.
ఆశ్చర్యంగా అటూ ఇటూ పరికిస్తున్న నన్ను
ఒక్కసారిగా వేయి సూర్యుల వెలుగు ముంచెత్తింది.
కళ్ళు నులుపు కుంటూ చూసా… అంతా కొత్తగా అనిపించింది!
ఇంతలో వెనకనుండి గుర్రపు సకిలింపులు…తెల్లని వెండిమెరుపులు…
ఎవరో కత్తి ఝులిపిస్తున్న ఝణ ఝణ ధ్వని.
ఎదో అర్థమైనట్లు కళ్ళు మూసుకొని నిశ్శబ్దం లోనికి జారిపోయా …
నా శరీరం సహస్ర కోటి ఖండాలై ధూళిగమారి
ప్రళయపూర్వ ప్రచండ పవనాలతో కలిసి
విశ్వమంతా నిండి పోయి
నిర్గుణ, నిశ్చల, నిర్వికార, నిరంజన సాక్షిగా
వేయి కళ్లతో విశ్వవిలయారంభాన్ని వీక్షించడం ప్రారంభించింది.
Also read: విజేతలు
Also read: పూలవాడు
Also read: రాగాలు
Also read: జీవితం
Also read: సముద్రం
సంధి యుగంలో ఉన్నామనే విషయాన్ని బాగా చెప్పారు.