- ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చలు
- ససేమిరా అంటున్న ఉద్యోగులు
- న్యాయం చేయాలని డిమాండ్
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేష్ కుమార్ రెండో రోజు చర్చలు జరిపారు. ఇప్పటివరకు గుర్తింపు పొందిన 8 సంఘాలతో చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం 13 ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు జరపనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని 7.5 శాతం ఫిట్ మెంట్ కు ఆమోదం తెలపాలని ఉద్యోగసంఘాలకు సీఎస్ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సీఎస్ ప్రతిపాదనలకు ఉద్యోగసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి దగ్గరే తాడో పేడో తేల్చుకుంటామని చెబుతున్నారు.
రాష్ట్ర వేతన సవరణ సంఘం సిఫారసులను పీఆర్టీయు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన ఏడున్నర శాతం ఫిట్ మెంట్ ఎంత మాత్రం ఆమోదయోగ్యంకాదని 45 శాతంతో వేతన సవరణ ప్రకటించాలని పీఆర్టీయు డిమాండ్ చేసిది. కేంద్రం తరహాలో పిల్లల చదువుకోసం నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని గృహవసతి సౌకర్యాం కోసం పాత స్లాబులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఒప్పంద ఉపాధ్యాయులు లేకుండా నియామకాలు చేపట్టాలని కోరారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగులను సంతోషపెట్టకుండా బంగారు తెలంగాణ కల ఎలా సాకారమవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 45 శాతం ఫిట్ మెంట్ తో 2018 జులై 1 నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఆర్సీపై ఉత్తమ్ విమర్శలు:
తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక నిరాశను కలిగించిందని అన్నారు. కేసీఆర్ ఆదేశాలమేరకే 7.5 శాతం ఫిట్ మెంట్ నిర్ణయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
చర్చలపేరుతో కాలయాపన చేస్తున్న కేసీఆర్:
పీఆర్సీపై సీఆర్ బిస్వాల్ కమిటీ సమర్పించిన నివేదిక ఉద్యోగులను నట్టేట ముంచేటట్లు ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ విమర్శించారు. ప్రణాళిక ప్రకారం కమిటీ పేరుతో టీఆర్ఎస్ అనుకూల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు.