- ధిషణాహంకారి, నవనీత సమానుడు
- సాటీలేని సాహితీసేద్యం ప్రత్యేకం
- తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత
మాట్లాడే వెన్నెముక -పాటపాడే సుషుమ్న… అంటూ విశ్వనాథ సత్యనారాయణను మహాకవి శ్రీశ్రీ అభివర్ణించాడు. శ్రీశ్రీ వంటి విప్లవభావ కవితామూర్తులను కూడా వెంటాడిన కవితావతారుడు విశ్వనాథ. సెప్టెంబర్ 10వ తేది విశ్వనాథ జయంతి. తెలుగుదనాన్ని, భారతీయతను ప్రేమించేవారంతా విశ్వనాథను ప్రేమిస్తారు. తెలుగుదనాన్ని ఆణువణువూ నింపుకొని కవిత్వం సృష్టించిన ఆంధ్రపౌరుషుడు. విశ్వనాథ ముట్టని సాహిత్యప్రక్రియ లేదు. ప్రతి క్షేత్రంలోనూ అద్భుతమైన పంటలు పండించాడు. కల్పవృక్షాలు వేశాడు. కావ్యాలు,శతకాలు, నవలలు,నాటకాలు,పీఠికలు, విమర్శనా వ్యాసాలు, కథలు, గాథలు అన్నీ రాశాడు. రాసిన ప్రతి చోటా బంగారుబాటలు వేశాడు. భారతదేశ సాహిత్యలోకంలో తెలుగుభాషా గౌరవాన్ని చాటి చెప్పాడు. తెలుగువారిలో మొట్టమొదటి ‘జ్ఞానపీఠం పురస్కారం’ పొందిన ఘనుడు విశ్వనాథ. ఆ కాలంలో తెలుగు ఉపాధ్యాయుడు లేదా ఉపన్యాసకుడు ఎవరూ ప్రిన్సిపాల్ పదవిని అలంకరించలేదు. దానిని కూడా సాధించిన ఘటికుడు. సారస్వత ప్రభ – లౌకిక ప్రతిభ రెండూ సమానంగా ఉన్న సవ్యసాచి.
Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ
ఎన్టీఆర్ లో నటుడిని గుర్తించి వెలికితెచ్చినవాడు
తదనంతర జీవితంలో మహానటుడుగా అవతరించిన ఎన్టీఆర్ లో నటుడు దాగి ఉన్నాడని గుర్తించి, మొట్టమొదటిసారిగా నాగమ్మ పాత్ర వేయించి, ప్రోత్సహించినవాడు విశ్వనాథ. ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వీరి విద్యార్థి, శిష్యుడు. ఎన్టీఆర్ లో ఆంధ్రపౌరుషాన్ని, భాషాభినివేశాన్ని రగిల్చినవాడు విశ్వనాథ. ఎందరికో ఫీజులు కట్టి, ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి విద్యాదానం చేసిన మహనీయుడు. ఇంగ్లీష్ కు వ్యతిరేకి అనే ముద్ర విశ్వనాథకు ఉంది. కానీ, ఆయన ఇంగ్లీష్ బాగా చదువుకున్నాడు. పైకి కోపంగా కనిపించినా, గర్వంగా అనిపించినా, లోపల మెత్తని మనిషి ఉన్నాడని విశ్వనాథతో బాగా పరిచయం ఉన్నవాళ్లు తరచూ చెబుతుంటారు. బహుభాషావేత్త పివి నరసింహారావుకు విశ్వనాథ నవలాశిల్పం అంటే ఎంతో ఇష్టం. అందుకే, వేయిపడగలు నవలను ‘సహస్రఫణ్‘ పేరుతో హిందీలోకి ఆయనే స్వయంగా అనువదించారు. విశ్వనాథకు సంగీతమంటే కూడా చాలా ఇష్టం. అంతేకాదు,బాగా పాడుతారు కూడా. కొన్ని రాగాలు సజీవ నదులై ఆయనలో ప్రవహిస్తాయి. విశ్వనాథ పద్యగానంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని విన్నవాళ్ళు చెబుతారు. విశ్వనాథ ప్రతిభ అసామాన్యమైంది. గొప్ప జ్ఞాపకశక్తి. మేధాశ్రమ చాలా ఎక్కువ. బాగా చదవడం, రాయడం దైనందిన చర్య.
అసాధారమైన సాహిత్య సృజన
జీవితాంతం అక్షర సేద్యంలోనే గడిపాడు. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. రామాయణ కల్పవృక్షం,వేయిపడగలు వంటి అసాధారణమైన సాహిత్య సృష్టి చేశాడు. విశ్వనాథ హృదయమే ఒక జ్ఞానపీఠం, సారస్వత జలపాతం.అలవోకగా సాహిత్య సృష్టి చేస్తాడు. ఈ ప్రతిభ అనన్య సామాన్యం. గొప్ప ఉపాధ్యాయుడు. మహాకవి. మహా చతురుడు. విశ్వనాథను చూడడం, వినడం ఆ కాలంలో పెద్ద మోజు. ఒంటిచేత్తో అంతటి సాహిత్య సృష్టి చేసిన ఆధునిక కవి విశ్వనాథ తప్ప ఇంకొకడు లేడు. వారి ప్రతి రచనా సుప్రసిద్ధమే. రసగుళికల వంటి రచనలు చేశాడు. భారతీయ చరిత్రను బ్రిటీష్ వాళ్లు తప్పుల తడకగా రాయించారనే కోపం ఉండేది. మన విద్యావిధానం, సంస్కృతి భ్రష్టు పట్టడానికి ఇంగ్లిష్ వాళ్లే కారణమంటూ జీవితాంతం వారిని ద్వేషించాడు. ఏ రచనా ప్రక్రియ చేపట్టినా, ఏ వస్తువు ఎంచుకున్నా, తెలుగుదనం, భారతీయత వైపే దాన్ని తీసుకెళ్ళేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా…. రాత్రికి గూటికి ఎలా చేరుతుందో, మనం ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి భారతీయత దగ్గరికి రావాల్సిందే, రావాలి అని వ్యాఖ్య చేశాడు. అంతగా,తన రచనల ద్వారా భారతీయతను అడుగడుగునా నింపేవాడు. అదే ఆయన శ్వాస, ధ్యాస. ఛాందసుడని కొందరు తిట్టుకున్నా ఆయన లెక్క చేయలేదు. సంప్రదాయ, సనాతన మార్గాలలోనే జీవితమంతా నడిచాడు.
Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల
ఎన్నో కీర్తి కిరీటాలు
పదునైన భాష, రసవంతమైన రచనా శిల్పం, వర్ణనా నైపుణ్యం విశ్వనాథను ఆధునిక కాలంలో అగ్రపీఠంలో నిలబెట్టాయి. విశ్వనాథ సిగలో ఎన్నో కీర్తి కిరీటాలు చేరాయి. పద్మభూషణ్, కళాప్రపూర్ణ, డి.లిట్ వంటి గౌరవాలు, జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడెమి వంటి పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవి వంటి పదవులు,గజారోహణాది ఘన సత్కారాలు పొందిన వైభవశ్రీ విశ్వనాథ. ఇంతటి మహాకవుల పుట్టుక అరుదైన వేడుక. వీరి పుట్టుకతో తెలుగుపుడమి పులకించింది. విశ్వనాథ జీవితం విజయవాడతో, కృష్ణాతీరంతోనే ఎక్కువగా పెనవేసుకుని సాగింది. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోనూ విశ్వనాథకు వీరాభిమానులు ఉన్నారు. తెలుగుదనాన్ని ప్రేమించే వారంతా విశ్వనాథను పూజిస్తారు.తెలుగు వెలుగైన విశ్వనాథ మనకు నిత్య స్మరణీయుడు. ఆ సాహిత్యం నిత్య పఠనీయం.ఈ అనంత తేజోమూర్తికి జోతలు సమర్పిద్దాం.
(సెప్టెంబర్ 10, విశ్వనాథ జయంతి)
Also read: నిలిచి వెలిగేది తెలుగే!
Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు