- తెలుగు భాషంటే మక్కువ ఎక్కువ
- పల్లెలన్నా, రైతులన్నా మహాప్రేమ
- తెలుగువారి ఉన్నతిని ఆశించే విశాల హృదయం
తెలుగుతల్లి బిడ్డలు జీవితంలో ఎంతో పైకొచ్చి, లోక విఖ్యాతి చెందితే, ఆ తల్లికి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? “దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే”….. ఈ మాటలన్నది ఎవరో కాదు, మన పీవీ నరసింహారావు. ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొత్తల్లో, ఒక సందర్భంలో ఈ పసిడిపలుకులు పలికారు. నేడు భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా సర్వోన్నతమైన పదవిలో విలసిల్లుతున్నారు జస్టిస్ ఎన్ వి రమణ. స్వగ్రామంలో జరిగిన ఘన సత్కార సందర్భంలో తను చేసిన తాజా ప్రసంగం పీవీ మాటలను గుర్తు చేస్తోంది. ఇద్దరూ తెలుగుతల్లి ముద్దుబిడ్డలే. ఇద్దరూ కుగ్రామం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి మహోన్నత శిఖరాలను చేరుకున్నవారే. వారిద్దరి మాటల్లో ఎంతటి తెలుగుదనం ఉంటుందో, అంతటి పల్లెదనం ఉంటుంది. ఎప్పుడో 55 ఏళ్ళ క్రితం (1966-67) మన తెలుగువాడైన కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించి తెలుగువారికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టారు.
Also read: యూపీ ఎన్నికల కురుక్షేత్రంలో అతిరథమహారథులు
ఇన్నేళ్ళకు మళ్ళీ తెలుగువ్యక్తికి సర్వోన్నత పదవి
మళ్ళీ ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఆ సర్వోన్నతమైన పదవి మన తెలుగుబిడ్డకు దక్కింది. ఇంతటి మహోన్నతమైన పదవి మనవాడికి దక్కినందుకు ఎల్ల తెలుగువారు మురిసిపోయారు. అభినందనలు వెల్లువెత్తాయి. నేడు ఎన్ వి రమణకు సొంత ఊరులో విశేషమైన సత్కారం జరిగింది. ఈ సత్కార ఘట్టంలో ఆద్యంతం తెలుగుదనం, భారతీయత వెల్లివిరిసాయి. ఎన్ వి రమణ దంపతులను ఎడ్లబండిపై ఊరేగింపుగా తోడ్కొని రావడం, పిల్లలు గుర్రాలపై ముందు వరుసలో నడుస్తూ జేజేలు కొడుతూ ఆహ్వానం పలకడం, పండితులు వేదస్వస్తితో పూర్ణకుంభంతో శుభస్వాగతం పలుకుతూ ఆశీస్సులు అందించడం, ఎల్ల పల్లె ప్రజలు బారులుతీరి నడుస్తూ పండుగ వాతావరణాన్ని తలపింపజెయ్యడం ఇంతవరకూ ఏ ప్రధాన న్యాయమూర్తికి వారి స్వగ్రామంలో జరుగలేదు. ఈ ఘన గౌరవాన్ని పొందిన భాగ్యశాలి జస్టిస్ ఎన్ వి రమణ. ఆయన పుట్టిపెరిగిన పొన్నారం ( పొన్నవరం) కృష్ణాజిల్లాలోని చాలా చిన్నఊరు. ఆ ఊరి జనాభా కేవలం 2000లోపే. పట్టుమని 500 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఊరి జనాభాలో ఎక్కువమంది దళితులే ఉన్నారు. అక్షరాస్యత కేవలం 56.65 శాతం. పై చదువులు చదవుకోవాలంటే పైఊర్లకు వెళ్ళాల్సిందే. ఇప్పటికీ అదే పరిస్థితి.జస్టిస్ ఎన్ వి రమణ సుమారు ఆరు దశబ్దాల క్రితం ఇటువంటి కుగ్రామం నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి, దేశంలోనే అత్యున్నతమైన పదవుల్లో ఒకటైన ప్రధాన న్యాయమూర్తి సింహాసనాన్ని అధిరోహించడం సాధారణమైన విషయం కాదు. ఈ మహోన్నతికి తెలుగువారంతా గర్వపడాల్సిందే.
తెలుగును నమ్ముకొని ఎదిగిన వ్యక్తి
తెలుగును నమ్ముకొని ఎదిగిన పెద్దలలో ఆయన ఒకరు. డిగ్రీ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నానని ఆయన గర్వంగా చెప్పుకుంటారు. మాతృభాష పట్ల, మాతృభూమి పట్ల, తెలుగువారి పట్ల, తెలుగుసంస్కృతి పట్ల ఆయన పెంచుకున్న అనురాగం, ఆత్మాభిమానం కడు ఆదర్శప్రాయం. తెలుగులో చదువుకున్నందుకు గోరంత ఆత్మన్యూనత లేకపోవడం వారి మాతృభాషాత్మగౌరవానికి మచ్చుతునక. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆ అభిమానం అలాగే ఉంది. అది క్షణక్షణం పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ సినిమాలు, అందులోని పౌరాణిక పాత్రలు, పద్యాలు ఆయన భాషానురక్తిని పెంచుకుంటూ వచ్చాయి. సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత న్యాయవిద్యలో చేరారు. అదుగో! అప్పటి నుంచే ఇంగ్లిష్ సంపర్కం పెరుగుతూ వచ్చింది. ఆ అభ్యాసాన్ని కొనసాగిస్తూనే, సమాంతరంగా తెలుగు సాహిత్యాన్ని, గొప్పవాళ్ళ జీవితాలను చదువుకుంటూ వచ్చారు. తెలుగుభాషకే చెందిన ‘ అవధాన ప్రక్రియ’ అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అవధాన కవులను విశేషంగా ప్రేమిస్తారు. వారి అవధానాలతో పాటు, ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారు. ఆ విధంగా, పద్యం పట్ల, అవధానం పట్ల ప్రత్యేకమైన ప్రేమను పెంచుకున్నారు. కేవలం పద్య సమన్వయమే గాక, మొత్తంగా అవధాన విధానమంటేనే జస్టిస్ ఎన్ వి రమణకు ఎంతో ఇష్టం. అచంచలమైన ఏకాగ్రత, అసాధారణమైన ధారణ (జ్ఞాపకశక్తి), అనుపమానమైన సమయస్ఫూర్తి, సర్వవిషయ పరిజ్ఞానం, రస రంజితమైన ఆశుకవితా ధార, అడుగడుగునా తెలుగుదనం, ఆత్మవిశ్వాసం కలగలసి సాగే సర్వోన్నతమైన సాహిత్య ప్రక్రియ ‘అవధానం’. అందులో తెలుగువారే అగ్రేసరులు. అందుకే, జస్టిస్ ఎన్ వి రమణకు అంతఇష్టం. సంప్రదాయ కవులైన కవిత్రయం, పోతన్న, శ్రీనాథుడు అంటే ఎంత ఇష్టమో! ఆధునిక ప్రగతిశీల కవులైన గురజాడ, శ్రీశ్రీ వంటివారిపైనా వారికి అదే ఇష్టం. ఘంటసాల భగవద్గీత ఇష్టం, కూచిపూడి నాట్యహేల ఇష్టం, జానపదాలు, జ్ఞానపథాలు, పల్లెపదాలు ఇష్టం.
Also read: కర్ణాటక పీఠం కదులుతోందా?
తెలుగుదనం ఇష్టం
మొత్తంగా తెలుగుదనమంటేనే చెప్పలేనంత ఇష్టం. వారు ఏ సమావేశాల్లో పాల్గొన్నా, ఆ విషయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి, నోట్స్ రాసుకొని సభలకు వచ్చి, ప్రసంగం చేస్తారు. తను చేసే ప్రసంగం ఉత్తమంగా ఉండాలనే ఉన్నతమైన క్రమశిక్షణ వారికి మొదటి నుంచీ ఉంది. ఇక తెలుగు భాషాసంస్కృతులకు సంబంధించిన సభలు, సమావేశాలైతే? రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు. న్యాయానికి న్యాయం జరగాలనే సంకల్పం, రాజ్యాంగ హక్కులకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, ధర్మానికి గ్లాని కలుగకూడదనే భయభక్తులు, సామాన్యుడికి, పేదవాడికి, బలహీనులకు, అతివలకు సమున్నతమైన న్యాయం అందాలనే సదాశయం, సత్యనిష్ఠ,ధర్మనిరతి, నిస్పక్షపాతం, సూక్ష్మగ్రాహ్యత, సహేతుకత మొదలైనవి ఉత్తమ న్యాయమూర్తికి ఉండాల్సిన సులక్షణాలు. వాటిన్నింటినీ పునికిపుచ్చుకొని, న్యాయమూర్తిగా మంచిపేరు తెచ్చుకొని, పదికాలాల పాటు చరిత్రలో నిలవాలనే శుభసంకల్పంతో జస్టిస్ ఎన్ వి రమణ వ్యవహరిస్తున్నారని పెద్దలు అంటుంటారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ తెలుగుదనం,భారతీయత పట్ల ఆర్తి,ఆవేదనలు కూడా కనిపిస్తాయి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, మార్గనిర్దేశం చేసే మహనీయులను ఎన్నడూ విస్మరించరాదని ఆయన పదే పదే చెబుతుంటారు. తెలుగువారిలో ఐకమత్యం కొరవడడం పట్ల ఆవేదన చెందుతూ ఉంటారు. తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పేలా మన ప్రవర్తన ఉండాలని హితవు పలుకుతారు. అనేక రాష్ట్రాలలోని ప్రముఖ సాంస్కృతిక, చారిత్రక కట్టడాలను ఎక్కువ శాతం తెలుగువారే కట్టారని మనం గుర్తెరగాలని చెబుతారు. తెలుగుజాతికి రావాల్సినంత గుర్తింపు రాలేదనే ఆవేదన కూడా ఆయనకు ఉంది.
Also read: నిద్ర ఒక యోగం
పల్లెల పట్ల పరివేదన
రైతుల కష్టాల పట్ల, పల్లెసీమల సమస్యల పట్ల ఆయనకు హృదయవేదనా ఉంది. పల్లె నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి గ్రామీణ భారతం గురించి ఎక్కువ తెలుసు. న్యాయవ్యవస్థలో ఎన్నో సంస్కరణలు రావాలని, న్యాయ పరిపాలనలో పారదర్శకత, కేసుల పరిష్కారంలో వేగం పెరగాలని ఆయన చెబుతూ ఉంటారు. న్యాయవిద్య వైపు విద్యార్థులు, యువత మొగ్గుచూపాలని ఆయన కోరుకుంటారు. ” తెలుగు ప్రజలు గర్వపడేలా, తెలుగుజాతి కీర్తిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తాను. దీనికి భిన్నంగా ప్రవర్తించబోను” అని పొన్నారం ప్రసంగంలో జస్టిస్ ఎన్ వి రమణ తెలుగువారికి మాటిచ్చారు. ఈ మాటలను బట్టి, ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తన పదవీకాలంలో తాను అనుకున్నవన్నీ విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిద్దాం. సొంతగడ్డపై ఘన సత్కారాలతో పాటు, స్వరాష్ట్ర ప్రభుత్వ ఆతిధ్యాన్ని స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్ వి రమణ ఒకే వేదికపై కలువనున్నారు.ఇది శుభ పరిణామం. తెలుగువారి కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తూ, పుడమితల్లి ఋణం తీర్చుకుంటారని విశ్వసిద్దాం.
Also read: పండుగలొస్తున్నాయి, జాగ్రత్త!