జీవితకాలపు పాత్రికేయుడు, నిబద్ధత కలిగిన నిజాయతీపరుడు, నికార్సయిన తెలంగాణరాష్ట్రవాది కంచర్ల లక్ష్మారెడ్డి (కేఎల్ రెడ్డి) బుధవారంనాడు వరంగల్లులో తుది శ్వాస విడిచారు. ఆయన ఒంటరి. పాత్రికేయమే ప్రాణంగా బతికిన వ్యక్తి. 1969లో తొలి తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో స్వయంగా కరపత్రం దినపత్రికలాగా వెలువరించిన ‘నేరానికి’ జైలులో నెలరోజులపాటు కఠినకారాగారవాసం చేసిన వ్యక్తి.
ఈ రోజున చాలా పత్రికలు రాజకీయపార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా అంటకాగుతున్న దశలో పాత్రికేయులు మనసు చంపుకొని పని చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. సర్వసాధారణంగా జర్నలిస్టుకు తన మనసుకు తోచినట్టు, వృత్తిధర్మాన్ని నిర్వర్తించే రోజులు లేవు. నలభై సంవత్సరాల కిందటే ‘ఈనాడు’ దినపత్రిక తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్నదనే ఆరోపణతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సాహసవంతుడు కెఎల్ రెడ్డి, తనకు ఆస్తిపాస్తులు లేవు. రోజు గడిచే పరిస్థితి లేదు. ఈనాడు అధినేత రామోజీరావు ఔదార్యంతో కార్యాలయ భవనంలోనే ఒక గదిలో ఉంటూ జీవితం వెళ్ళబుచ్చుతున్న రెడ్డి తనకు సర్వస్వమైన ఉద్యోగాన్ని గడ్డిపోచలా భావించాడంటే ఆయన మనోధైర్యాన్నీ, విలువలపట్ల నిబద్ధతనూ అర్థం చేసుకోవాలి.
కెఎన్ రెడ్డి జీవితంలోని అనేక మలుపులు తడుముతూ ప్రముఖ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ ఒక పత్రికలో ప్రచురించిన సవివరమైన వ్యాసం ఆయన గురించి చాలా సంగతులు వెల్లడించింది. ఈ వ్యాసం చదివిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 13 జూన్ 2016న తన క్యాంపు కార్యాలయానికి కెఎల్ రెడ్డిని పిలుపించుకొని రూ. 15 లక్షల ఆర్థిక సాయం చేశారు. మంత్రి జగదీశ్వరరెడ్డి పూనికతో ఈ ఏర్పాటు జరిగింది. అప్పటికే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న రెడ్డికి వైద్యసహాయం అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చేశారు.
‘‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తెలంగాణ పార్టీ వివరాలను రేపు వెల్లడిస్తారని 2001లో దినపత్రికలలో ఒక వార్త వెలువడింది. తెలంగాణవాది అయిన కె.ఎల్. రెడ్డి కొందరు జర్నలిస్టులను వెంటేసుకొని మీటింగ్ కు వెళ్ళారు. తెలంగాణ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం నివాసగృహం పైభాగంలోనే కెసీఆర్ తెలంగాణ సమితి పార్టీ ఆఫీసు ఉండేది. కెసిఆర్ మెట్లు దిగి కిందికి వస్తుండగా అక్కడ గుమికూడిన ప్రజలతో పాటు కె.ఎల్, రెడ్డి కూడా ఆయనను తేరిపార చూశారు. మనిషి బక్కపలుచగా ఉన్నాడు. ముక్కు కార్టూన్ కు అనువైనది. ముఖం గంభీరంగా ఉంది. ముఖవళికల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది.
‘‘కేసీఆర్ నోరు తెరిచారు. పెదాలు కదలాడాయి. తెలంగాణ మాండలిక పదాలు విస్ఫులింగాల్లా బయటికి దూసుకొచ్చాయి. చెన్నారేడ్డి సహా తెలంగాణ నాయకులెవ్వరూ తెలంగాణ భాషలో, యాసలో మాట్లాడలేదు. కానీ ఇతడు స్థానిక ప్రజల భాషలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు. ఈయన ప్రసంగాలు నిస్సందేహంగా తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటాయి. వారిని ప్రభావితం చేసి తీరుతాయి. నివురుగప్పిన తెలంగాణ నిప్పును కేసీఆర్ మళ్ళీ రాజేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఈ నిప్పు ఆరదనిపిస్తున్నది. నా ఈ నమ్మకం వమ్ముకాదు. బక్కోడు నిజం చేసి చూపిస్తాడు. కేసీఆర్ ప్రసంగం విన్నతర్వాత కెఎల్ రెడ్డి మదిలో మెదిలిన భావవీచికలు ఇవి,’’ అంటూ చక్రధర్ ‘తెలంగాణ అక్షరయోధుడు’ అనే శీర్షికతో రెడ్డిపైన రాసిన వ్యాసంలో ఉటంకించారు.
కేసీఆర్ కెఎల్ రెడ్డి కలను సాకారం చేయగా, చెన్నారెడ్డి తన పార్టీ తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ తో విలీనం చేసి కలను కల్ల చేశారు. చెన్నారెడ్డితో కెఎల్ రెడ్డి ప్రయాణం ఆసక్తికరమైంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో దేవులపల్లి ప్రభాకరరావు సారథ్యంలో వెలువడిన ‘జనత’ పత్రికలో నెలకు రూ.150ల వేతనానికి కెఎల్ రెడ్డి ఉపసంపాదకుడుగా పని చేసేవారు. ‘జనత’ మూతబడిన తర్వాత ‘నేడు’ పేరుతో కరపత్రదినపత్రికను వెలువరించారు. అది మూడు నెలలపాటు వచ్చింది. ఒకే పేజీ కరపత్రం ఖరీదు పది పైసలు. సికిందరాబాద్ లో దినపత్రికలు విక్రయించే ఏజెంటు మల్లయ్య ఆర్థిక సహాయంతో ఈ కరపత్రం వెలువడేది. అందులో చెన్నారెడ్డి నాయకత్వంలో సాగుతున్న ఉద్యమ వార్తలు నిండా ఉండేవి. ‘నేడు’ పేరుతో వెలువడిన మొదటి కరపత్రంలో ‘తెలంగాణ సింహకిశోరం చెన్నారెడ్డి’ అంటూ ప్రధాన శీర్షిక ప్రచురించిన కెఎల్ రెడ్డి తన చివరి కరపత్రంలో ‘‘తెలంగాణ ద్రోహి చెన్నా’’ అనే ప్రధాన శీర్షిక తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. తెలంగాణ ముఖ్యం ఆయనకు. ఆ కాలంలోనే ఎన్నికలు జరిగాయి. లోక్ సభ స్థానాలు తెలంగాణలో పద్నాలుగు ఉండగా పదిస్థానాలలో తెలంగాణ ప్రజాసమితి గెలుపొందింది. విదేశీపర్యటనపై వెడుతున్న నాటి ప్రధాని ఇందిరాగాందీ అకస్మాత్తుగా అర్ధరాత్రి హైదరాబాద్ కు వచ్చి చొక్కారావుతోనూ, చెన్నారెడ్డితోనూ చర్చలు జరిపి చెన్నారెడ్డిని శాంతింపజేశారు. హైదరాబాద్ నుంచే నేరుగా విదేశాలకు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించడమే చెన్నారెడ్డి షరతు. ఆ షరతుకు ఇందిరాగాంధీ ఒప్పుకున్నారు. ఇందిరాగాంధీ షరతులకు చెన్నారెడ్డి అంగీకరించి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తాను ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్ళిపోయారు. తెలంగాణ ఉద్యమం చల్లారిపోయింది. ఈ పరిణామాన్ని కెఎల్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. జీవితంలో చెన్నారెడ్డిని క్షమించలేదు.
అటు చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఇటు కెఎల్ రెడ్డి కరపత్రం ఆగిపోవడం ఒకే సారి జరిగాయి. అప్పటివరకూ మిన్నకున్న పోలీసులు కెఎల్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టారు. న్యాయమూర్తి కరపత్రం దినపత్రిక ధోరణిలో ఉండటం గమనించి, దిల్లీ నుంచి వార్తాపత్రికల రిజిస్ట్రార్ ఆమోదం లేకుండా పత్రికలాంటి కరపత్రం నడిపినందుకు నెలరోజుల కఠిన కారాగారశిక్ష విధించారు. అప్పుడు ఒక ఖైదీకీ, రెడ్డికీ జరిగిన చర్చతోనే చక్రధర్ వ్యాసం మొదలయింది.
‘‘నువ్వు ఎవరిని చంపి జైలుకొచ్చినవ్’’ అడిగాడు ఒక హంతక ఖైదీ.
‘‘నేనెవ్వరినీ చంపలేదు. ఆ మాటకొస్తే నేను ఏ నేరమూ చేయలేదు’’ అంటూ తొలుత ప్రశ్నవిని దిమ్మరబోయిన రెడ్డి కోలుకున్న తర్వాత సమాధానం ఇచ్చారు.
‘‘ఎవర్నీ చంపకపోతే, ఏ నేరం చేయకపోతే నిన్ను జైల్లో ఎందుకేసిండ్రు’’ ఖైదీలలో ఆసక్తి పెరిగింది.
‘‘తెలంగాణ కోసం పత్రిక తీసినందుకు నాకు కఠిన కారాగారశిక్ష విధించారు’’ అని చెప్పారు. ఇతర ఖైదీలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది.గౌరవం ఏర్పడింది. జైలులో ఆయన చేయవలసిన పనులు కూడా తోటి ఖైదీలు చేసేవారు. ఆయన రోజూ దినపత్రికలు చదివి వినిపిస్తూ విశేషాలు ఖైదీలకు తెలియజేసేవారు.
‘ఈనాడు’ దినపత్రికలో రాతపరీక్షలో పాసైన తర్వాత యజమాని రామోజీరావుతో జరిగన ఇంటర్వ్యూలో కెఎల్ రెడ్డి ఉన్నదున్నట్టు మాట్లాడిన విశేషం కూడా చక్రధర్ వ్యాసంలో ఉంది. రెడ్డితో రామోజీరావు వ్యక్తిగతంగా మాట్లాడుతూ, ‘‘నువ్వు తాగుతావా?’’ అని అడిగారు. ‘‘తెలంగాణ సంస్కృతిలో తాడుగు ఒక భాగమైపోయింది. నేను తెలంగాణ రెడ్డోణ్ణి. రెడ్లందరూ తాగుతారు. నేనూ తాగుతా. పండగలూపబ్బాలూ వచ్చినప్పుడు, పెండ్లిండ్లూ, పేరంటాలూ వంటి వేడుకలు జరిగినప్పుడు నేను తాగుతాను. అయితే తాగి నేనెన్నడూ వాంతులు చేసుకోలేదు. తాగిన మైకంలో ఎవరితోనూ గొడవపడలేదు’’ అని సమాధానం చెప్పారు. ‘ఈనాడు’లో ఉద్యోగంలో చేరారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పత్రిక వార్తలూ,వ్యాఖ్యలూ ప్రచురిస్తోందన్న కారణంగా ఆయన రాజీనామా చేసిన రోజున జనరల్ షిఫ్టు (సెంట్రల్ డెస్క్) బాధ్యుడుగా ఎడిషన్ రాత్రి ఒంటిగంటకు ఇచ్చేసిన తర్వాత రాజీనామా లేఖ రాసి మర్నాడు రామోజీరావుకు అందజేయమని అటెండర్ కు చెప్పి, లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు. మనసు చెప్పినట్టు నడుచుకునే జర్నలిస్టులాగా వ్యవహరించారు.
నల్లగొండజిల్లా పరసరాయిపల్లెలో 92 సంవత్సరాల కిందట పుట్టిన కంచర్ల లక్ష్మారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1955లో డిగ్రీ చేశారు. వెంటనే సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి హైదరాబాద్ నుంచి నడిపించే రాజకీయ పత్రిక ‘తెలుగుదేశం’లో చేరి తన సుదీర్ఘమైన జర్నలిజం జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ‘ఈనాడు’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రభూమి’ పత్రికల్లో పని చేశారు. ఠాకూర్ హరిప్రసాద్ హైదరాబాద్ నుంచి వెలువరించిన ఇంగ్లీషు పత్రిక ‘ఇండియన్ హెరాల్డ్’లో పని చేశారు. వయోధిక పాత్రికేయుడు వి. హనుమంతరావు నడిపించిన వారపత్రికలోనూ, జి. రామారావు తెచ్చిన వారపత్రిక ‘వారంవారం’లోనూ పని చేశారు. దేవదాసు నిర్వహించిన ‘నిజం’లోనూ, పాంచజన్య నిర్వహించిన ‘మహానగర్’లోనూ కరసేవ చేశారు. ఉద్యమకాలంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నడిపిన ‘తెలంగాణప్రభ’లో కూడా పని చేశారు. అనేక పత్రికలలో పని చేసిన కెఎల్ రెడ్డి సాధ్యమైనంతవరకూ ఒదిగి ఉండేవారు. మనసుకు కష్టం కలిగిన మరుక్షణం ఉద్యోగం నుంచి వైదొలిగేవారు. హైదరాబాద్ నుంచి వరంగల్లు వెళ్ళి అక్కడే జీవిస్తే మిత్రులు సహకరిస్తారని సలహా చెప్పిన వ్యక్తి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు. నేను చాలాసార్లు కలుసుకొని రెడ్డితో మాట్లాడాను. పత్రికప్రపంచం, తెలంగాణ మినహా మరే విషయమూ ఆయనకు ఆసక్తి కలిగించేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ ఉండేవారు. లాల్ బహద్దూర్ స్టేడియం పక్కన ఫతే మైదాన్ క్లబ్ లో ఒక గదిలో నివసించిన రోజుల నుంచీ నాకు కెఎల్ రెడ్డి పరిచయం. వరంగల్లులోనే ప్రశాంతంగా జీవిస్తూనే వార్థక్యం కారణంగా మృతి చెందారు. ఎటువంటి పరిస్థితులలోనూ రాజీపడకుండా పత్రికలలో తన షరతులమీద పని చేసిన బహుకొద్దిమంది జర్నలిస్టులలో కెఎల్ రెడ్డి ఒకరు. అటువంటి అరుదైన పాత్రికేయుడికి, విలువలకు పట్టం కట్టిన మహోన్నత వ్యక్తికి అక్షరాంజలి.
Thank you sir.
నాకు లక్ష్మా రెడ్డి గారు బాగా పరిచయం.
వారి తమ్ముడు ఇంద్ర సేన రెడ్డి గారు,నాను సీనియర్ ,ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు.
వరంగల్ లో తీవ్ర నిర్భంద పర్సితుల్లో వరంగల్ లో ఉన్నాడు.అప్పుడు ఎందుకో ఏ పత్రికలో లేడు.
కాళోజీ ఇంట్లో కలుస్తూ ఉండేవాడు.
సీనియర్ పాత్రికేయుడు, పేండెం శ్రీనివాస్ రావు గారు,అప్పుడు PTI correspondent.
ఆయన కాళోజీ రామేశ్వర రావు గారి అల్లుడు.
ఆయన దగ్గర లక్ష్మారెడ్డి గారు కలుస్తూ ఉండే వాడు.
చాలా ధన్యవాదాలు.
ఈ తరం వారికి ఎవరికీ పెద్దగా తెలియని విలేఖరి.
అసలు P.N.Swamy గారి గురించి అడిగితేనే మాకు తెలియదు అని చాలా సార్లు జవాబు వచ్చింది.