- ట్రంప్ సంచలన నిర్ణయం
- ప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత
- అప్రమత్తమైన అధికార వర్గాలు
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమవుతున్న అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు మరిన్ని ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని ఎఫ్ బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి లో అత్యవసర పరిస్థితి విధించారు. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ విధించాలన్ని నగర మేయర్ సిఫారసు మేరకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తరువాత అనూహ్య పరిణమాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇది చదవండి: పుట్టింటిలోనే ప్రజాస్వామ్య అపహాస్యం
అన్ని రాష్ట్రాలలో భద్రత పెంపు
మరోవైపు బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ వేళ అమెరికాలోని 50 రాష్ట్రాల రాజధానులలో దాడులకు కుట్ర జరుగుతోందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరించింది. బైడెన్ ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అమెరికన్లలో ఆందోళన పెరుగుతోంది. ఎపుడు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనని భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.
ఫెడరల్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 15 వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందిని వాషింగ్టన్ లో మోహరించారు. జనవరి 24 వరకు పహరా కొనసాగనుంది. ఎమర్జెన్సీ కారణంగా స్థానికులకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించడానికి ప్రత్యేక ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఆందోళన కారులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజల ప్రాణాలకు ముప్పు తలపెడితే వాటిని ఆపేందుకు కేంద్ర బలగాలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు.
ఇది చదవండి: అమెరికాలో అలగా చేష్టలు, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు