- పాటల్లో, మాటల్లో కాదు చేతల్లో స్త్రీని గౌరవిద్దాం
- ఆకాశంలో సగం అనే మాటను అక్షరసత్యం చేద్దాం
“ఆడాళ్ళు మీకు జోహార్లు … ఓపిక, ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు..” అన్నాడు ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. ‘క్షమయా ధరిత్రి’ అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా అన్నారు..”ఆడవాళ్లు – మగవాళ్లు ఇద్దరూ సమానమే. కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం.” ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. ‘ఆకాశంలో సగం’ అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది. కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. ఛాందసాలు, చాదస్తాలు ఇంకా రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకోవడం కేవలం ఆనవాయితీ కారాదు. ఆత్మపరీక్షకు ఆధారం అవ్వాలి. మహిళాలోకపు అభివృద్ధికి ఆలంబన కావాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నా, మనం మాత్రం మాతృమూర్తిని తలచుకొని కొలుచుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు మొదలై శతాబ్దం దాటింది. స్త్రీమూర్తిని గౌరవించే సంస్కారం, సంప్రదాయం మనకు అనాదిగా ఉంది.
Also read: గోదావరి – కావేరి అనుసంధానం అయ్యేనా?
ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకడలు
అదే సమయంలో కష్టాలు, కన్నీళ్లు, బానిసత్వం, అణగదొక్కే విధానం, ఆచారాల పేరిట అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు. ‘నిర్భయ’ చట్టాల వంటివి ఎన్ని వచ్చినా, ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా, అరాచకాలు ఆగడంలేదు. ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవలేదు. ఓటు హక్కు వచ్చినా, చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. ‘ స్త్రీలకు స్త్రీలే శత్రువులు’ అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ, సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు. కార్మిక సంఘాలు ఏర్పడినా, చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు, కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది. 1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది. సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం. అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం, బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి.
Also read: విశాఖ వైశిష్ట్యం
గ్రామీణ సాధికారత పెరగాలి
గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. ‘పని సంస్కృతి'( వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. వంద సంవత్సరాలపై నుంచీ 100 దేశాలకు పైగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటు చేసుకున్నప్పటికీ సమగ్రత, సంపూర్ణత సాధించాల్సి ఉంది. సమానత్వాన్ని సాదరంగా స్వాగతించడమే (ఎంబ్రేస్ ఈక్విటీ) 202 3సంవత్సరంలో పెట్టుకున్న ఎజెండా. స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు. అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి, పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు,దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు. స్త్రీమూర్తులే ఈ జగతికి జీవనజ్యోతులు, అనురాగదేవతలు.
Also read: సమరస సేనాని సంజీవయ్య