- టీడీపీతో బీజేపీ మళ్ళీ పొత్తుకు ఒప్పుకుంటుందా?
- జగన్ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే పవన్ ప్రతిజ్ఞ నేరవేరుతుందా?
- తెలంగాణలో టీఆర్ఎస్ మూడో సారి విజయం కైవసం చేసుకుంటుందా?
- కాంగ్రెస్, బీజీపీలలో ఏది టీఆర్ఎస్ కు పోటీ?
అధికారంలో ఉన్న పార్టీలు అధికారాన్ని కాపాడుకొనే దిశగా, ప్రతిపక్షంలో వున్న పార్టీలు అధికారపీఠాన్ని ఎక్కే దిశగా అడుగులు వేసే క్రమంలో, సొంతశక్తితో పాటు మిగిలిన పార్టీల మద్దతును కూడగట్టుకుంటాయి. రాజకీయాల్లో ఇది సర్వసాధారణమైన విషయం. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుమారు రెండేళ్లు సమయం ఉంది. తెలంగాణలో 2023 డిసెంబర్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. నిన్ననే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటన చేసి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీ ఆర్ ఎస్)తో పొత్తుపెట్టుకొనే ప్రశ్నేలేదని కరాఖండిగా చెప్పేశారు. పైకి గొడవలు పడుతున్నట్లు కనిపిస్తున్నా బిజెపి- టీ ఆర్ ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ కత్తులకు పదునుపెడుతున్నారు.
Also read: అమ్మకు వందనం
ఎవరి పొత్తులు ఎవరితోనో?
బిజెపి – కాంగ్రెస్ రహిత కూటమిని నిర్మించడమే తమ ప్రధాన ధ్యేయమని కె సీ ఆర్ పదే పదే చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ తో పీకే జతకట్టకుండా ఉండడంలోనూ కెసీఆర్ హస్తం ఉందనీ చెప్పుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటినుంచీ చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తప్ప, ప్రతి ఎన్నికల్లోనూ మిగిలిన పార్టీలతో పొత్తుపెట్టుకొనే తెలుగుదేశం అధిపతి చంద్రబాబునాయుడు ముందుకు సాగారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి – జనసేన కలిసే ప్రయాణం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో జతకట్టడానికి సిద్ధపడుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడడం చాలా ముఖ్యమని తాజాగా శిరివెళ్ల సభలోనూ పవన్ ఉద్ఘాటించారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని, రాష్ట్రంలో వైసీపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు దిశగా బలంగా ముందుకు వెళ్తామని జనసేనాధ్యక్షుడు అంటున్నారు. భాజపాతో వందశాతం పొత్తు కొనసాగుతుందని ఆయన బలంగా చెప్పారు. తెలుగుదేశంతో పొత్తు గురించి ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ, పవన్ మాటలు ఆ దిశగానే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం,జనసేన,బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా కలిసి నడిచే అవకాశాలను కొట్టిపారేయలేం. 2024 ఎన్నికల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడం కోసం ఎన్ని రకాల వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తులుపైఎత్తులు, శక్తులుయుక్తులు ఉన్నాయో అన్నింటినీ ఉపయోగించడమే ప్రధానమార్గంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు సాగుతారనే మాటలు రాజకీయ క్షేత్రంలో చాలా బలంగా వినపడుతున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కు పోటీగా బిజెపి, కాంగ్రెస్ తో పాటు వై ఎస్ షర్మిల పార్టీ కూడా బరిలో నిలువనున్నాయి. ఈ విపక్ష పార్టీలన్నీ ప్రస్తుతం ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాయి.ఈ పార్టీల మధ్య పొత్తు అన్నది దాదాపు అసాధ్యమే.
Also read: ఖలిస్థాన్ వాదం ఖతం కాలేదా?
తెలంగాణలో రెండో స్థానం బీజేపీకా, కాంగ్రెస్ కా?
అధికార టీ ఆర్ ఎస్ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. రెండో స్థానం బిజెపికి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక మొదలైన బడా నేతలు వచ్చి గట్టి వేడి పుట్టిస్తే కాస్త వాడి పెరుగవచ్చు. వై ఎస్ షర్మిల పార్టీ ఇంకా బాల్యావ్యవస్థలోనే ఉంది. చాలా నిర్మాణం జరగాల్సి ఉంది. మొత్తంగా చూస్తే, తెలంగాణలో పొత్తుల మాట పెద్దగా ఉండకపోవచ్చు. తెలంగాణలో జనసేన ప్రయాణం, ప్రభావంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. టీ ఆర్ ఎస్ – బిజెపి సంగతి ఎలా ఉన్నా, పవన్ కల్యాణ్- కెసీఆర్ మధ్య పెద్దగా విభేదాలు లేవని అనిపిస్తోంది. ‘భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్’ లో తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనాయకుడు కెసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కె టీ ఆర్ పాల్గొన్నారు. పాల్గొనడమే కాక పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం కూడా అందించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికార వైసీపీ బలంగానే ఉంది. ప్రజాబలం తగ్గిందా? లేదా? అన్నది రేపటి ఎన్నికల సమయంలోనే తేలుతుంది. తెలుగుదేశం 2019ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది.ఆ దశ నుంచి విజయం వైపు పయనించాలంటే అంత తేలికైన విషయం కాదు. గత ఎన్నికల సమయానికి -ఇప్పటికి .. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎదిగిన జాడలు ఎక్కడా కనిపించడం లేదు. దేశంలో అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో బిజెపి గొంతు కాస్త గట్టిగా వినపడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్, గిడుగు రుద్రరాజు వంటివారు అప్పుడప్పుడూ నోరుచేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఉన్న దీనావస్థ నుంచి పైకి లేవడం లేదు.
Also read: కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందా?
పవన్ కల్యాణ్ ఇంకా పుంజుకోవలసి ఉంది
జనసేన ఇంకా బలంగా నిర్మాణం కావాల్సిఉంది. ప్రజల్లో తన నాయకత్వం పట్ల విశ్వాసం కలిగించడంలో పవన్ కల్యాణ్ ఇంకా గట్టిగా కృషి చేయాల్సిఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కష్టాలు, రాష్ట్ర ప్రగతి ప్రయాణం, వివిధ రకాల గందరగోళాల మధ్య ప్రజావ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం, వివిధ సామాజిక వర్గాల మధ్య అసంతృప్తులు రగలకుండా చూసుకోవడం అధికార పార్టీ వైసీపీ అధినాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎదురుగా ఉన్న సవాళ్లు. ప్రతిపక్షాలతో పాటు మీడియా, సోషల్ మీడియాను కూడా అధికార పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తటస్థ మీడియా సైతం దూరం కాకుండా చూసుకోవడం అన్ని పార్టీలకు ముఖ్యం. మొత్తంగా తెలుగురాష్ట్రాల్లో పొత్తుల ప్రస్థానం, ప్రగతి, ప్రభావం ఎలా ఉండబోతాయో చూద్దాం. బిజెపి పరంగా రాష్ట్రంలో ఎలా ఉన్నప్పటికీ, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ- రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఇంతవరకూ ఎటువంటి విభేదాలు లేవు. దీని ప్రభావం రేపటి ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఎలా ఉండబోతుందో చూడాలి. 2019 ఎన్నికలకు సుమారు ఒక సంవత్సరం ముందు నుంచి తెలుగుదేశం -బిజెపి మధ్య విభేదాలు పెరగడం మొదలయ్యాయి. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో,నరేంద్రమోదీ – చంద్రబాబునాయుడు మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవు. 2024 ఎన్నికల వేళ, తెలుగుదేశం – జనసేన – బిజెపి పొత్తులపై ఈ అంశం ఏ మేరకు పనిచేస్తుందో, అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయో వేచిచూద్దాం.
Also read: ఐరోపాలో మోదీ పర్యటన