Sunday, December 22, 2024

యథావిధిగా ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పరీక్ష

  • మమతా, అఖిలేష్ మైత్రి
  • కెప్టిన్ ని తక్కువ అంచనా వేయలేం
  • పంజాబ్ లో కాంగ్రెస్ కి ఆప్ సవాల్
  • గోవా, మణిపూర్ లో తృణమూల్ ఎత్తులు

ఒక పక్క ఒమిక్రాన్  వేరియంట్ వ్యాప్తి  కలవరం పెడుతూనే ఉంది. మరో పక్క అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి ఉండదని దిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా శాసనసభల పదవీకాలం వచ్చే సంవత్సరం ముగియనుంది. ఫిబ్రవరి – ఏప్రిల్ మధ్య కాలంలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. ఒమిక్రాన్ ఉధృతి డెల్టా వేరియంట్ వ్యాప్తి రెండూ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేయడమే మంచిదని పలువురు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలు జరగాల్సి ఉండిన ఈ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ జరిగిన వ్యాక్సినేషన్ పై సంబంధిత అధికారులు సమావేశమై, సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో తొలి డోసు ప్రక్రియ దాదాపుగా పూర్తయినా  రెండో డోసు ఇంకా చాలామందికి అందాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ పూర్తి చేస్తే, ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయంలోనే కేంద్రం ఉందని భావించాలి. గతంలో కరోనా ఉధృతి చల్లారక ముందే  వ్యాక్సినేషన్ ప్రక్రియ తప్పటడుగులు వేస్తున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయకుండానే జరిపారు. పైపెచ్చు పశ్చిమ బెంగాల్ లో కోలాహలంగా ఎన్నికల సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో, అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి,  ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీగా పోటీబడ్డాయి. చివరకు గెలుపు మళ్ళీ మమతా బెనర్జీనే వరించింది. ఆ గెలుపుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని మమతా బెనర్జీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు.

Also read: వణికిస్తున్న ఒమిక్రాన్

ఉత్తర ప్రదేశ్ ఉత్కృష్టం

ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మైత్రి దినదిన ప్రవర్ధమానమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కాంక్షతో వీరిద్దరూ రగిలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వమే రాజ్యమేలుతోంది. అక్కడ ఉన్న ప్రతిపక్షాల్లో కాస్త మెరుగ్గా ఉన్న పార్టీ సమాజ్ వాది. దానికి అధిపతి అఖిలేష్. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అధికార బిజెపి చాలా దూకుడుగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు ప్రధానమైన నేతలంతా అక్కడే కన్నేశారు, కలియ తిరుగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ కొన్నాళ్ల నుంచి అక్కడే తిష్ట వేశారు, విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అఖిలేష్ సభలకు జనం బాగా వస్తున్నారని, స్పందన కూడా ఆశాజనకంగా ఉందని ఒక వర్గం చెబుతోంది. వారణాసిలో కారిడార్ శంకుస్థాపన, గంగా ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ కేటాయింపు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, గత ఎన్నికల్లో వచ్చిన గొప్ప మెజారిటీ మొదలైనవి బిజెపికి మళ్ళీ పట్టం కట్టడానికి ఉపయోగపడతాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఏకస్వామ్య విధానం, పెరిగిన రాజ్ పుట్ ల ఆధిపత్యం, బడుగు వర్గాలపై అత్యాచార ఉదంతాలు, లఖింపూర్ ఖేరీలో రైతు ఉద్యమకారుల హతం, నిరుద్యోగం, అధిక ధరలు, కరోనా కష్టాలు, అభివృద్ధి కుంటుపడడం మొదలైనవి యోగి ఆదిత్యనాధ్ గెలుపుకు గుదిబండలుగా నిలిచే అవకాశం ఉందని కొందరు జోశ్యం చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తమ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని, మోదీ వ్యతిరేక వర్గాలనన్నింటినీ ఏకం చేయాలనే దీక్షతో సాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. బహుశా మిగిలిన రాష్ట్రాలలోనూ తిరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఆమె ప్రభావం మిగిలిన రాష్ట్రాల్లో ఏ మేరకు ఉంటుందన్నది కాలంలోనే తెలుస్తుంది.

Also read: సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం

పంజాబ్ లో ఆప్ ఆకర్షణ

పంజాబ్ రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. ఒక్క కోతి తా వనమంత చెరచె .. అన్న చందంగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రవర్తనతో కాంగ్రెస్ లో చీలికలు వచ్చేశాయి. కొత్త కలయికలు రూపుదిద్దుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్, బిజెపి ఒక వైపుగా నిలిచే ధోరణలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ – సిద్ధూ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆన్నీ ధృతరాష్ట్ర కౌగిలిగింతలే కనిపిస్తున్నాయి. అమ్ ఆద్మీ పార్టీ మెరుగ్గా ఉందని మొదటి నుంచీ వినిపిస్తోంది.  ప్రస్తుతం సీట్ల ప్రకారం కూడా ఆ పార్టీ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు అమ్ ఆద్మీకి మరింత లాభాన్ని చేకూర్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటి వరకూ బలమైన నాయకుడుగా పేరున్న అమరేంద్రసింగ్ ను తక్కువ అంచనా వేయరాదని కొందరు అంటున్నారు. కెప్టెన్ సహకారంతో పంజాబ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బిజెపి చూస్తోంది. వ్యవసాయ బిల్లులు రద్దు చేసిన అంశం బిజెపికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.  గత ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే   బిజెపి అట్టడుగు స్థానంలో ఉంది.

Also read: యూపీ ఎన్నికల కురుక్షేత్రంలో అతిరథమహారథులు

ఉత్తరాఖండ్ లో బీజేపీకే మళ్ళీ పట్టం?

దైవభూమి ఉత్తరాఖండ్ బిజెపి పాలనలోనే ఉంది. బిజెపి పాలనలోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ అనేకసార్లు ముఖ్యమంత్రులను మార్చడం పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. అక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 57 సీట్లు దక్కించుకున్న బిజెపి అత్యంత బలమైన పార్టీగా ఎంతో పైఎత్తున ఉంది. కాంగ్రెస్  – 12, ఇండిపెండెంట్  -2 స్థానాలతో ఉన్నాయి. కాంగ్రెస్ తన బలాన్ని విస్తరించుకోవడంలో వైఫల్యం చెందింది. దైవభూమి మళ్ళీ మరో ఐదేళ్లు బిజెపి పాలనలోనే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయంతో ఏకీభవించవచ్చు. గోవాలో బిజెపి ఆధిక్యత కొనసాగుతోంది. గత ఎన్నికల్లో 40 అసెంబ్లీ స్థానాలకు గాను 25 చోట్ల విజయం సాధించిన బిజెపి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మనోహర్ పారికర్ అకాల మరణం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగినా, 2022లో  తిరిగి బిజెపి  తిష్టవేసే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మణిపూర్ లోనూ బిజెపి ప్రభుత్వమే ఉంది. 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో మిగిలిన భాగస్వామ్యులను కలుపుకొని ఎన్ డి ఏ 37 సీట్ల బలంతో రాజ్యమేలుతోంది. కాంగ్రెస్ 15 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. రేపు ఎన్నికలు జరుగబోయే ఐదు రాష్ట్రాల్లో,ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాలు ఎన్ డి ఏ ఏలుబడిలోనే ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్  ఫలితాలు పార్టీల, అగ్రనేతల భవిష్యత్తును మారుస్తాయని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ప్రీఫైనల్ గా అభివర్ణించ వచ్చు.

Also read: కర్ణాటక పీఠం కదులుతోందా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles