పుస్తక సమీక్ష
దినేష్ సి శర్మ
నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా
రచయిత: ఎన్. భాస్కరరావు
పబ్లిషర్: రచయిత
పేజీలు:207
వెల: రూ. 600.
ఇండియా వంటి రాజ్యాంగపరమైన ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాథమిక అవసరం. ప్రాతినిధ్య ప్రభుత్వం ఉండాలనీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకీ,అసెంబ్లీలకీ ఎన్నికలు జరగాలనీ రాజ్యంగం నిర్దేశిస్తున్నది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిపేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా –ఇసిఐ) ఉండాలని కూడా రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఈ పద్ధతి అమలు జరుగుతోంది. రాజకీయ పార్టీలు నియమించిన అభ్యర్థుల నుంచి పార్లమెంటుకూ, శాసనసభలకూ సభ్యులను ఎన్నుకొంటారు. అంటే ఇండియాలో ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీల ద్వారా పనిచేస్తుందన్న మాట. దశాబ్దాలుగా ఎన్నికల వ్యవస్థలో చాలామార్పులూ, సంస్కరణలూ అమలు జరిగాయి. ప్రవర్తన నియమావళినీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ నీ, ఆస్తుల వివరాలు ప్రకటించడాన్నీ అమలు జరిపారు. ఎన్నికల విధానం సాధ్యమైనంత పారదర్శకంగా, న్యాయంగా ఉండేవిధంగా చూడడం ఈ సంస్కరణల లక్ష్యం.
అయినప్పటికీ ఎన్నికల వ్యవస్థ బలపడలేదు. చాలా లోపాలు ఉన్నాయి. సామాజిక శాస్త్రవేత్త, ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ భాస్కరరావు తన పుస్తకం ‘నెక్ట్స్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా’లో ఆ లోపాలను వివరించారు. ఒక సీటు గెలవడానికి రంగంలో ఉన్న అభ్యర్థులందరిలోనూ ఎక్కువ ఓట్లు సంపాదిస్తే చాలు. ఈ పద్దతిలో ఓటర్ పాత్ర ప్రముఖం అవుతున్నది. ఎన్నికలలో ఓటర్ ను తమకు అనుకూలంగా తిప్పుకోవడమే అభ్యర్థుల, రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం. వారు ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాని, అభివృద్ధి, పరిపాలన, ప్రభుత్వ నిర్వహణ, పారదర్శకత, తదితర ముఖ్యమైన అంశాలపైన చర్చ జరగదు. ఇవి ప్రజలకు చాలా ప్రధానమైనవి. ఒక సమూహం లేదా అల్పసంఖ్యాకవర్గం ఓట్ల రీత్యా ప్రధానం కాకపోతే వారి ప్రస్తావన ఉండదు. రాజకీయ పార్టీలకూ, వాటి అభ్యర్థులకూ వారు ముఖ్యం కాదు.
ఎవరైతే ఓటు చేస్తారో వారిపైనే దృష్టి కేంద్రీకృతం అవుతుంది కనుక కులం ప్రాతిపదికగా ఓటు చేయడం, ఉచితాలకు ఆశపడటం వంటి అవాంఛనీయ ధోరణులు ప్రబలినాయి. రాజకీయ నాయకులకూ, ప్రజలకూ మధ్య ఇచ్చిపుచ్చుకునే, లావాదేవీ సంబంధం నెలకొన్నది. అభ్యర్థుల ఎంపికలో ప్రధానాంశం గెలుపుగుర్రం కావడమే కనుక అటువంటివారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో, తొలి దశాబ్దాలలో సామాజిక సేవ చేసినవారికీ, టీచర్లకీ, డాక్టర్లకీ, ఇతర సేవారంగంలో ఉన్నవారికీ అవకాశం ఉండేది. పార్లమెంటులోనూ, శాసన సభలలోనూ సమాజంలోని ప్రతివర్గానికీ ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా తయారైందని రచయిత అంటున్నారు.
ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల ప్రచారం పోతున్న వింతపోకడలను ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించారు. సిద్ధాంతపరమైన పట్టింపులు లేకపోవడం అన్నదిఎన్నికలరంగంలో ఇప్పుడున్న అధ్వాన స్థితికీ, డబ్బుపాత్ర పెరగడానికీ ప్రధాన కారణమని రచయిత విశ్వాసం. సిద్ధాంతాల ప్రాతిపదికగా, పాదయాత్రల ద్వారా జరిగిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు జనాభా కుల,మతాలను అనుసరించి “వారిలో చీలిక తెచ్చి ఒకే పక్షానికి వారు ఓటు వేసేలాగా వారి మనసులను తయారు చేయడం వరకూ ఇప్పుడు వచ్చింది.” అభ్యర్థులు తమ బాధ్యతలను బయటివర్గాలకు బదిలీ చేస్తున్నారు. పౌరసంబంధాల సంస్థలకూ, మార్కెట్ పరిశోధకులకూ, ఎన్నికల ప్రవీణులకూ, ఇతర వ్యాపార శక్తులకూ తమ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ప్రజల అసలు సమస్యలూ, ప్రభుత్వాల పనితీరూ, అభివృద్ధి క్రమం గురించి ఈ సంస్థలకూ, శక్తులకూ బొత్తిగా తెలియవు. 1950 నుంచి ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా మారిపోయిందో రచయిత వివరించారు. తొలిరోజులలో ఎన్నికల ప్రచారం స్థానికలు చేసేవారు. వలంటీర్లు పాల్గొనేవారు. నృత్యనాటకాల ఆధారంగా ప్రచారం ఉండేది. “బహిరంగ ప్రసంగాల నుంచి ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన సందేశాలు ఇవ్వడం వరకూ ప్రచారం మారిపోయిందని రచయిత ఆవేదన వెలిబుచ్చారు. ఇందులో ప్రజలమధ్య చర్చ ఉండదు. పరిశీలన ఉండదు.” మరో అవలక్షణం ఏమంటే ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం అని భాస్కరరావు సాక్ష్యాధారాలతో సహా వాదించారు.
ఎన్నికల సమయంలో మీడియా ప్రవర్తన గురించి ఈ పుస్తకంలో రచయిత విస్తారంగా చర్చించారు. కొత్త మీడియా, సమాచార వ్యవస్థలూ ఎన్నికలలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయో వివరించారు. కంసాలి తన పొయ్యిలోని మంటలను పెంచినట్టే న్యాస్ చానళ్ళు కూడా ఎన్నికల మంటల్లో ఆజ్యం పోసి మంటలు ఎగదోసే పని చేస్తున్నాయని రచయిత అంటారు. ప్రైవేటు చానళ్ళు పెరిగిపోవడం, వాటి మధ్య పోటీ తీవ్రతరం కావడం, న్యూస్ మీడియా ఎన్నికల వార్తలను ఇచ్చే క్రమంలో ఇదివరకటి నిస్పాక్షికత, వస్తునిష్ఠమైన లక్షణం లోపించింది. పోలింగ్ కు ముందూ, తర్వాత జరిపినట్టు చెబుతున్న సర్వేలలో ప్రజలు ఏమనుకుంటున్నారో, క్షేత్రవాస్తవికత ఏమిటో వదిలిపెట్టి ప్రజాభిప్రాయంపైన ప్రభావం వేయడానికీ, తిమ్మినిబమ్మిని చేయడానికీ ప్రయత్నం జరుగుతున్నది. ప్రచారంలో చూపిన నాయకుడినే చూపించడం, చూపిన దృశ్యాలనే చూపడం ద్వారా సదరు నాయకుడికీ, అతని పార్టీకి సానుకూలంగా ప్రజాభిప్రాయం మారే విధంగా చానళ్ళు మాయ చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఎన్నికల కమిషన్ మీడియాకు సైతం మార్గదర్శకాలను విడుదల చేయాలనీ, వార్తల పర్యవేక్షణలో కమిషన్ చురుకైన పాత్ర పోషించాలనీ రచయిత సూచించారు. ఇంకోఅడుగు మందుకేసి న్యూస్ చానళ్ళ ఎన్నికల ప్రసారాలను స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ పరిశీలించాలని రచయిత అభిలషించారు.
ఎన్నికల ప్రక్రియకు తీసుకునే సమయాన్ని తగ్గించాలన్నది భాస్కరరావు సూచించే సంస్కరణలలో ఒకటి. సంవత్సరాలు గడిచిన కొద్దీ ఎన్నికల ప్రక్రియకు పట్టే సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. 1957లో ఇరవై రోజులలో రెండు దశల పోలింగ్ జరిగితే, 2019 లోక్ సభ ఎన్నికలు 39 రోజులు ఏడు దశలలో జరిగాయి. దశలవారీ పోలింగ్ జరిపినంత మాత్రాన అవి స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయన్న నమ్మకం లేదని రచయిత అభిప్రాయం. ఎక్కువ సమయం వల్ల ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి అధికారపార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
ఎన్నికల నిధుల విషయానికి వస్తే, 2018లో ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం పారదర్శకతకు పాతర వేస్తుందనీ, ఉపకారం – ప్రత్యుపకారం (క్విడ్ ప్రో కో) పద్ధతికి అవకాశం ఇస్తుందనీ హెచ్చరించారు. నిధుల సేకరణను, ఎన్నికల ఖర్చునూ అభ్యర్థుల నుంచి పార్టీలకు మార్చడంతో వలంటీర్ల ప్రచారం, వికేంద్రీకరణ పద్ధతి నుంచి పార్టీ కేంద్రిత ప్రచారానికీ, పౌరసంబంధాల సంస్థల పాత్రకూ దారితీశాయి. ఎన్నికల ప్రచారాలను అర్థవంతం, ప్రయోజనకరం చేయాలంటే నియోజకవర్గంలో ప్రచారానికి స్థానిక నాయకులనూ, కార్యకర్తలనూ మాత్రమే అనుమతించాలి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ప్రచారకులు రావడం, ప్రచారం చేయడం చెప్పిందే చెప్పినట్టు, చేసిందే చేసినట్టు అవుతుంది. అభ్యర్థులను ఓటర్లు అర్థం చేసుకోవడానికి రాష్ట్ర, జాతీయ నాయకుల ప్రచారం ఏమీ దోహదం చేయదు.
అనుభవజ్ఞుడైన పరిశోధకుడు, సామాజిక శాస్త్రజ్ఞుడు అయిన భాస్కరరావు రాసిన ఈ పుస్తకం ఇండియాలో ఎన్నికలు జరిగే విధానంలోని అనేక అంశాలను వివరిస్తుంది. ఎన్నికల వ్యవస్థను సంస్కరించడానికి అవసరమైన సూచనలు చేసింది. అయితే, ఇది రచయిత వ్యక్తిగత అనుభవం నుంచి రాసింది. చాలాచోట్ల చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎన్నికలూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరూ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మారుతున్న మీడియా తీరుతెన్నుల పట్ల ఆసక్తి కలిగిన యువజర్నలిస్టులకూ, పరిశోధకులకూ ఇది బాలశిక్ష వంటిది.
నోట్: ఎన్ భాస్కరరావు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, మార్కెటింగ్ అండ్ డెవలప్ మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇండియాలో సామాజిక పరిశోధనలో వైతాళికుడు. మాస్ కమ్యూనికేషన్స్ లో దశాబ్దాల అనుభకం కలిగిన ప్రవీణుడు. ఇదివరకు ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ ను స్థాపంచి దానికి సీఈఓగా వ్యవహరించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఉన్నత స్థాయి సలహామండలి సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు.
ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో సమీక్షించిన దినేష్ సి శర్మ అవార్డులు గెలుచుకున్న జర్నలిస్టు, రచయిత, మీడియా శిక్షకుడు. సైన్స్, టాక్నాలజీ, ఆరోగ్యం, పర్యావరణ రంగాలలో 35 సంవత్సరాల రిపోర్టింగ్ అనుభవం ఉన్నది. ఆయన మెయిల్ టుడే(ఇండియా టుడే గ్రూప్) పత్రికలో సైన్స్ ఎడిటర్ గా,ఇండియా సైన్స్ వైర్ కి వ్యవస్థాపక మేనేజింగ్ ఎడిటర్ గా పని చేశారు. ‘ద అవుట్ సోర్సర్: ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఐటీ రివల్యూషన్,’ ‘ఇండియన్ ఇన్నోవేషన్,’ ‘నాట్ జుగాడ్ – ఎబౌట్ 100 ఇన్నొవేషన్స్ దట్ హేవ్ ట్రాన్స్ ఫార్మడ్ ఇండియా ఇన్ ద పాస్ట్ 75 ఇయర్స్’ అనే టైటిల్స్ తో పుస్తకాలు రాశారు.