Sunday, December 22, 2024

ఎన్నికల నగారా మోగెన్

  • ఐదు రాష్ట్రాలలో ఫిబ్రవరి-మార్చి లో ఎన్నికలు
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు మార్చి 10న
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వర్చువల్ ప్రచారం చేసుకోవాలని సలహా
  • కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించిన ఎన్నికల కమిషన్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10 వ తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తూ, కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ, ఎన్నికలను వాయిదా వెయ్యాలని పలు వినతులు వెళ్లాయి. కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలి డోసు 90 శాతం మందికి పూర్తవ్వడం, రెండో డోసు తీసుకున్నవారు 65 శాతం మించిన నేపథ్యంలో, కరోనా ప్రభావం ప్రమాదకరంగా ఉండబోదని, కాబట్టి ఎన్నికల వాయిదా అవసరం లేదని కేంద్రం భావించింది. దీనితో కేంద్ర ఎన్నికల సంఘం ఏకీభవించి, ఎన్నికల నిర్వహణకు పచ్చ జెండా ఊపేసింది. కరోనా నేపథ్యంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసే అవకాశాన్ని కల్పించింది. దీని వల్ల రద్దీ తగ్గుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. పార్టీలన్నీ వర్చువల్ గా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించింది. జనవరి 15 వ తేదీ వరకూ ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలు, బహిరంగ సభలను నిషేధించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ప్రచార సరళిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

పంజాబ్ లో ప్రధాని భద్రతపై పంచాయతీ

పంజాబ్ లో ప్రధాని రక్షణ వైఫల్యంపై దేశవ్యాప్తంగా వేడివేడిగా చర్చ జరుగుతున్న తరుణంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆ ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే బిజెపి అధికారంలో లేదు. మిగిలిన రాష్ట్రాలన్నీ ఎన్ డి ఏ ఏలుబడిలోనే ఉన్నాయి.  ఏదో విధంగా పంజాబ్ ను కైవసం చేసుకోవాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆత్మగౌరవం కార్డుతో అధికారాన్ని నిలబెట్టు కోవాలని కాంగ్రెస్ చూస్తోంది. అన్ని రాష్ట్రాల్లోని అధికార, విపక్షాలన్నీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే గట్టి పట్టుతో ఉన్నాయి. ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల్లో పంజాబ్ తప్ప మిగిలిన అన్ని చోట్ల బిజెపి ఇప్పటి వరకూ బలంగానే ఉంది. పంజాబ్ లో మొదటి నుంచీ బిజెపి వెనుకబడే ఉంది. ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వెలివేయబడిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సహకారంతో చక్రం తిప్పాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లోనైతే, కాంగ్రెస్ కు మళ్ళీ అధికారం దక్కే వాతావరణం మొన్నటి దాకా ఉండేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కెప్టెన్ ను ముఖ్యమంత్రిగా తప్పించడం, నవజోత్ సింగ్ సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పడం, కొత్త ముఖ్యమంత్రి చన్నీకి – సిద్ధూకు మధ్య విభేదాలు పెరగడం మొదలైనవన్నీ కాంగ్రెస్ కు నష్టాన్ని తెచ్చే అంశాలుగానే పరిశీలకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉన్న ‘ఆమ్ ఆద్మీ’కి గెలుపు అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నట్లు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం అంశం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని చూస్తున్న పార్టీలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వేచి చూద్దాం. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో బిజెపి గెలుపు సునాయాసమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాలనలో లోపాలు, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు ఈ ఐదేళ్లలో పుంజుకున్న దాఖలాలు లేవు. బిజెపి గెలుపునకు విపక్షాల వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణంగా రాజకీయ పండితులు అభిభాషణ చేస్తున్నారు.

Also read: భద్రతా లోపం, ప్రచార పటాటోపం

యూపీలో హోరాహోరీ

ఉత్తరప్రదేశ్ లో పోరు హోరాహోరీగా సాగుతోంది. గత ఎన్నికల ఫలితాల ప్రకారం బిజెపి చాలా బలంగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో ఉన్నా, బిజెపితో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉంది. కాంగ్రెస్ పూర్తిగా చతికిల పడింది. బహుజన సమాజ్ పార్టీ ఉండీ లేనట్లుగా ఉంది. చావోరేవో తేల్చుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ పోటాపోటీగా కసరత్తులు చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్   ఏకస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని, తన సామాజిక వర్గం తప్ప మిగిలినవారి పట్ల భేదభావంతో నడుస్తున్నారని, ముఖ్యంగా బడుగులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వ్యాప్తిలో ఉన్నాయి. బలహీనులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయనే మాటలు బాగా వినపడుతున్నాయి. లఖింపూర్ ఖేరీ మారణహోమం ఘటన బిజెపి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందని ఎక్కువమంది భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అగ్రనేతలంతా ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేకదృష్టి పెట్టారు. అయోధ్య రామమందిరం నిర్మాణం, కాశీలో కారిడార్ ప్రారంభం, గంగా ప్రాజెక్టుకు భారీగా నిధుల కేటాయింపు మొదలైనవన్నీ మరోమారు గెలుపుగుర్రం ఎక్కిస్తాయనే విశ్వాసంలో బిజెపి ఉంది. అఖిలేష్ నిర్వహించిన సభలకు వచ్చిన స్పందన చూస్తే, సమాజ్ వాదీ పార్టీకి ఇదివరకటి కంటే మంచి ఫలితాలు రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అన్నీ తానై ప్రియాంక వ్యవహరిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఫలితాలు కాస్త మెరుగుపడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్  ఫలితాలు  కీలకమని అన్ని పార్టీలకు తెలుసు. ఈ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అభివర్ణిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉండే జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే భావనలో బిజెపి ఉంది. గెలుపునకు మోదీ కరిష్మా మూలమంత్రంగా పనిచేస్తుందా, లేదా అన్నది కాలంలోనే తేలుతుంది. ప్రచార ఆర్భాటాలు ఎలా ఉన్నా, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లితే ఎంతటివారికైనా ఓటమి తప్పదు. ప్రజాభిమానాన్ని చూరగొన్న వారినే రాజ్యలక్ష్మి వరిస్తుందని చరిత్ర చెబుతూనే ఉంది. అధిక ధరలు, కరోనా కష్టాలు, పెరిగిన నిరుద్యోగం ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Also read: నవ వసంతానికి స్వాగతం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles